డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
Kodavatiganti Kutumba Rao1949లో ఒకరోజు ఉదయాన నేను పుట్టినప్పుడు మా నాన్న కొడవటిగంటి కుటుంబరావు ఆంధ్రపత్రిక డెయిలీలో నైట్ షిఫ్టులో పనిచేస్తున్నారట. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మాత్రం చివరిదాకా ఆయన ఉద్యోగం చందమామలోనే. కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యాన్ని రచించిన వ్యక్తిగా మా నాన్నగారి గురించి చాలామందికి తెలుసుగాని పత్రికాసంపాదకుడుగా తెలియదు. ఆయన చందమామకు పేరులేని సంపాదకుడుగా పనిచేశారని నేను రాసిన దాకా ఎవరికీ తెలియకపోవడం నన్నే ఆశ్చర్యపరిచింది. ఆయన సాహిత్య కృషిలోని ఈ పార్శ్వాన్ని తెలియజేసే వ్యాసాలను కొన్ని సమర్పిస్తున్నాను. ఆయన సాధించిన గొప్ప విజయాల గురించి ఆయనకు సమకాలికులూ, సహోద్యోగులూ వాటిలో రాసిన విషయాలు కొన్ని ఈనాటి సాహిత్యాభిమానులకు ఆసక్తికరంగా ఉండవచ్చు.
పత్రికల గురించీ, వాటి సాహిత్య, సామాజిక పాత్ర గురించీ, జర్నలిజంలోని కష్టసుఖాల గురించీ కుటుంబరావుగారు 1941-79 మధ్య కాలంలో రాసిన 18 చిన్నాపెద్ద వ్యాసాలు విరసం ప్రచురించిన సంస్కృతి వ్యాసాల సంపుటిలో ఉన్నాయి. ఇందులో ఆయన అభిప్రాయాలూ, అనుభవాలూ, ఉద్దేశాలూ అన్నీ ద్యోతకం అవుతాయి. ఆ విషయాలను ఆయన మాటల్లో తెలుసుకోవడమే బావుంటుంది కనక ఇక్కడ ప్రస్తావించటం లేదు.
నాకు తెలిసి ఆయన అనేక పత్రికల్లో పేరు లేకుండా రాసినవెన్నో ఉన్నాయి. చందమామలో చేరక మునుపే అందులో తండ్రి-కొడుకులు మొదలైన సీరియల్స్ రాశారు. యువ మాసపత్రికలో పనిలేని మంగలి అనే పేరుతో మంత్లీ కాలమ్ రాశారు. ఎన్నో బెంగాలీ నవలలకు తెలుగు అనుసరణలు చేశారు. కినిమా మాసపత్రిక నిండా ఆయన రచనలే ఉండేవి. తాము చెయ్యనివాటిని కూడా చేశామని చెప్పుకుంటూ, పబ్లిసిటీ, టీవీ ఇంటర్వ్యూలూ అనగానే పరిగెత్తుకొచ్చే ఈనాటివారి ధోరణితో పోలిస్తే పేరుకూడా చెప్పుకోకుండా అసంఖ్యాకమైన రచనలు చెయ్యడమే కాక, పత్రికల ప్రాచుర్యానికి తన బాధ్యత ఎంత ఉందో కూడా బైటకు చెప్పుకోని ఆయన వ్యక్తిత్వం ఈ రోజుల్లో విచిత్రంగా అనిపించవచ్చు.
ఆంధ్రపత్రికలో ఆయనతో పనిచేసినవారిలో నీలంరాజు శేషయ్యగారూ, కపిల కాశీపతిగారూ, దాసు వామనరావుగారూ, జయంతి కిరీటిరావుగారూ, వడ్లపట్ల ప్రసాదరావుగారూ, గోళ్ళమూడి రామచంద్రరావుగారూ, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారూ, నండూరి రామమోహనరావుగారూ, సూరంపూడి సీతారామ్ గారూ తదితరులుండేవారు. ఆ తరవాత బాపు, ముళ్ళపూడి యుగం ఆరంభమయింది. వీరంతా వారపత్రికల ప్రాచుర్యాన్ని అంతకంతకూ పెంచుతూ పోగలిగారు. మా నాన్నగారికి కథా, నవలా, వ్యాస రచయితగా ఎక్కువ పేరు రావడంతో ఆయన జర్నలిజంలో చేసిన కృషి గురించి ఎక్కువగా ఎవరికీ తెలియలేదు. అలాగే ఆయన అనువాదరచనలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. రచయితగా ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అంచనా వెయ్యాలంటే ఈ అంశాలుకూడా వెలికి రావాలని నాకనిపిస్తుంది. ముఖ్యంగా జర్నలిస్టు అయినవాడికి సమాజంతో ఎక్కువ ప్రమేయం ఉంటుంది.
మా నాన్నగారు సినిమా జర్నలిస్టు అవతారం చాలించిన చాలా ఏళ్ళ తరవాత కూడా ఆయనను సకుటుంబంగా తెలుగు సినిమా ప్రీవ్యూలకు పిలుస్తూ ఉండేవారు. బి.ఎన్. రెడ్డి, కెవి.రెడ్డి, ప్రసాద్ తదితరులు ఆయన రాసిన పాత విమర్శల కారణంగా ఆయనను గౌరవించేవారు. బి.ఎన్. రెడ్డి తన సినిమాల గురించి మా నాన్న రాసిన రివ్యూలకు జాగ్రత్తగా స్పందిస్తూ ఉండేవారట. పెళ్ళి చేసిచూడు సినిమా విడుదల అయినప్పుడు మా నాన్నకు దాని పబ్లిసిటీ వగైరాలతో ప్రమేయం ఎక్కువగా ఉండేది. అయితే ఆ తరవాత కూడా గుండమ్మ కథ తీసే రోజుల దాకా చక్రపాణిగారు విజయా చిత్రాలకు కథ, పాత్ర చిత్రణ మొదలైన విషయాల్లో ఆయనను ఇన్‌ఫార్మల్ గా సంప్రదిస్తూ ఉండేవారు.
ఆధునికజీవిగా, జర్నలిస్టుగా తనకు ఆసక్తికరం అనిపించిన వివిధ విషయాలను మా నాన్నగారు పత్రికల్లో జనరంజకం చేసే ప్రయత్నం చేశారు. అది ఎంతవరకూ ఫలించిందో నేటి పాఠకులూ, పత్రికా విలేకరులూ నిర్ణయించుకోవాలి. ఈనాటికీ సర్క్యులేషన్ పెరగడానికి ఖచ్చితంగా పనికొచ్చే భక్తి విషయాలూ, బూతు కథలనూ కూడా జమిలిగా ప్రచురించే తెలుగు పత్రికలున్నాయని మనకందరికీ తెలిసినదే. ఎటొచ్చీ ఉత్తమ సంస్కారాన్ని నిజాయితీగా ప్రతిఫలించే పత్రికలకు డబ్బులు రాలకపోవచ్చునేమోగాని భావితరాలు మాత్రం వాటిని గుర్తుంచుకుంటాయి.
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment