కేన్సర్ వ్యవస్థలో ఛిద్రమైన కవి కుటుంబం
‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.
1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు బదులుగా ‘సాహిత్య పాఠశాల’ నిర్వహించే సంప్రదాయం అట్లా ప్రారంభమైంది. శ్రీశ్రీ ‘మినీలాంగ్ మార్చ్’గా నిర్వచించిన ఊరేగింపు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌నుంచి వరంగల్ మహబూబియా హైస్కూల్ గ్రౌండ్స్ (జగదీశ్‌నగర్) వరకు ఎనిమిది కిలోమీటర్లు సాగింది. అక్టోబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి మీద ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) కింద అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హైదరాబాదు సిటీ కమిషనరు చెరబండరాజు, ఎంటి ఖాన్‌లపై, వరం గల్ కలెక్టర్ నాపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఎంటి ఖాన్‌ను 9వ తేదీ సాయం త్రమే పురానాపూల్‌లోని ఆయన ఇంటిదగ్గర అరెస్టు చేశారు. ఆ సాయంకాలమే అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు దగ్గర్లో ఉంటున్న చెరబండరాజును అరెస్టు చేయడానికి అంబర్‌పేట పోలీసుల పోయా రు. పెట్లబురుజు దగ్గర, పాతబస్తీలో ఉండే పోలీసు కానిస్టేబుళ్ళతో ఎంటి ఖాన్‌ను, అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లతో చెరబండరాజుకు లంగోటా దోస్తీ. చెరబండరాజయితే ఎప్పుడూ సైకిలుపై ఆ పోలీసుస్టేషన్ ముందునుంచే ఆవరణలో కనిపించే కానిస్టేబుళ్లను పలకరిస్తూనే రోజూ పోతుండేవారు. ఆ పరిచయంతోనే చాలా మర్యాదపూర్వకంగానే పైవాళ్ల ఉత్తర్వులు అమలు చేయించడానికి వాళ్లు పోయా రు. చెరబండరాజు ఒక్కడే ఉన్నాడు. ‘శ్యామలను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చాను. ఈ రాత్రి పాప పుడుతుంది. రేపు సాయంత్రం వచ్చి అరెస్టు చేయండి’ అని నిష్కల్మషమైన చిరునవ్వుతో అడిగాడు చెరబండరాజు. ‘సరేసార్, భార్య పురుటి నొప్పులతో దవాఖానాలో ఉంటే అరెస్టు చేసే దుర్మార్గులం కాము. కాని పాప పుడుతుందనే ఎట్లా చెప్తారు సార్’ అన్నారు వాళ్లు. ‘మాకు పాపే, ఆడపిల్లే కావాలి. ఆడపిల్లే పుడుతుంది’ చెరబండరాజుకు విప్లవ విజయంపై ఎంత ప్రగాఢవిశ్వాసమో తన వ్యక్తిగత ఆకాంక్షల సాఫల్యంపట్ల కూడా అంత తిరుగులేని నమ్మకం.
1944లో నల్లగొండ జిల్లా అంకుశాపురంలో ‘ఏటికేతంబెట్టి ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకెరుగని’ రైతు కుటుంబంలో పుట్టిన బాలనరసింహ, బక్కారెడ్డి, శెరబందిరాజు (ఎలియాస్ చెరబండరాజు)కు మైనర్‌గానే పెళ్లయింది 16, 17 ఏళ్ల వయసులో. శ్యామలకు 14 ఏళ్లు. ఇద్దరూ కాపుబిడ్డలవలె చేన్లలో, చెలకల్లో, పొలాల్లో మట్టిపని, బురదపని చేశారు. అప్పుడామె నుదుటిపై చెమటచుక్కలకు అంటిన కురులపై ఆయన పద్యాలు రాశారు. ఆ తర్వాత సంస్కృతాంధ్ర కళాశాలలో తెలుగు ప్రబంధాలు చదువుకున్నప్పుడు పింగళి సూరన సుగాత్రీశాలీనులు చేనులో పనిచేస్తూ వానలో తడిసినప్పటిటి విసర్గ సౌందర్య ప్రేమను ఇష్టపడ్డాడు. కాని దాదాపు పదేళ్ల దాకా కూడా వాళ్లకు సంతానం కలగలేదు. చెరబండరాజుకు పిల్లలన్నా ముఖ్యంగా ఆడపిల్లలంటే ఎంతో మక్కువ. ఈ మక్కువ లేవీ సకాలంలో నెరవేరని సామాజిక పరిస్థితుల్లోకి మొదట, రాజకీయ నిర్బంధంలోకి ఆ తర్వాత ఆయన నెట్టబడ్డాడు.
1970 జులై 4న ఆయన సహచరులతోపాటు విరసం ఏర్పాటు చేసి 71 ఆగస్టు లోనే జ్యోతి, నిఖిల్‌లతోపాటు పీడీయాక్టు కింద అరెస్టయినప్పటినుంచీ, ఆయనే ఎమర్జెన్సీలో జైల్లో రాసుకున్నట్టుగా
నేను పసిపాపల్ని ముద్దాడితే
వారి చెక్కిళ్ల మీద తడిని
కత్తులతో చెరుపుతారు
అనే అమానవీయ వాతావరణం ఏర్పడింది.
చెరబండరాజు దశాబ్దకాలపు ఎదురుచూపు, కలలో పండినట్లుగా అక్టోబరు 9న ఆయనకు పాప పుట్టింది. ఆసుపత్రిలో పాపను చూసుకుని ఆ రాత్రి ఆసుపత్రి వరం డాలోనే పడుకొని, 10వ తేదీ ఉదయం వస్తూనే అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో మిఠాయికూడా ఇస్తూ ‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప. ఆ పసి పాపతోనే ఆయనను జైల్లో కలవడానికి వారానికోసారి ఇచ్చే ములాఖత్‌కు వెళ్లేది శ్యామల. జైలులోనే కూతురు ఉదయిని కోసం ‘పాపా!’ అని పాట రాశాడు చెరబండరాజు.
ఆడుకో మా పాప ఆడుకోవమ్మా
మీనాన్న వస్తాడు నీకు ముద్దిస్తాడు అంటూ పోరాట పాఠం చెప్తూ..
ఓరుగల్లు మామనేరమేమిజేసె
భాగ్యనగరపు మామ ఎవరి కొంప ముంచె
బందిఖానాలల్ల బంధించినారమ్మ
ప్రజల బాగు కొరకు పాట గట్టాడమ్మ
ఎరుపు మామయ్యతో గొంతు కలిపాడమ్మ
నిర్దోషి మీ నాన్న ఖైది అయినాడమ్మ
అని ఇంకా మాటలుకూడా నేర్వని పాపకు తనను పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాడు. 73 నవంబర్ 16న హైకోర్టు ఉత్తర్వులపై విడుదలయి ఆరు నెలలు తిరగకుండానే సికిందరాబాదు కుట్ర కేసులో చెరబండరాజు 18 మే 74న అరెస్టయ్యాడు. అప్పటికి ఉదయిని ఏడు నెలల పాప. అచ్చం చెరబండరాజు పోలికలతో విశాలనేత్రాలతో మాటలు నేర్చే వయసు ‘మా పాప మాట్లాడుతోంది’ అని పాట రాశాడు చెరబండరాజు.
సికింద్రాబాదు కుట్ర కేసులో 75 జనవరిలో విడుదలయ్యాడో లేదో ఆరు నెలలు తిరగకుండానే జూన్ 26న ఆత్యయిక పరిస్థితి ప్రకటించగానే మళ్లీ అరెస్టయ్యాడు. పాప మొదటి పుట్టిన రోజుకు ‘చందమామ’ వంటి పాట రాశాడు.
మా యింటి అందాల చందమామా
చీకట్లు చిరకాలముండవమ్మా
జాలిగుండె ల తల్లి చెంతనున్నాది
చెరసాలలో తండ్రి క్షేమమన్నాది
…. అమ్మ కంటికి నీవు చందమామా
వెన్నలూరే పెరుగుకుండవమ్మా
నీ చేతిచలువలో వెన్నెలున్నాది
నీ నవ్వులో పూల జల్లూ వున్నాది
మా కలల మొలకవే చందమామా
కన్నీరు మాకేల చెప్పవమ్మా
నీ కళ్ళ వెలుగు లో శాంతివున్నాది
మా అశాంతులకదీ మందు అయినాది.
ఆ కలల మొలక ఆటపాటలతో ఎదిగే క్రమమంతా చెరబండరాజు జైలు, కాకపోతే ఆయన మాటల్లో ‘గాంధీ రోగ నిలయం’లో బ్రెయిన్‌ట్యూమర్ వంటి భయంకర రోగంతో గడిచి ఆరు నెలలపాటు కోమాలోనే ఉండి చివరకు 82 జులై 2న కన్నుమూశాడు. అప్పటికి ఉదయిని వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు. సరిగ్గా ఉదయిని తన 33వ ఏట ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసే సమయానికి ఆమె పాప సింధూరది అదే వయసు. అమ్మకంటి చందమామలుగా పాపలు పుడుతున్నారుగానీ ‘కన్నీరుమాకేల’ అనే పరిస్థితి లేదు. చెరబండరాజు జైలు, అనారోగ్యంతో ఆసుపత్రి కాలమంతా 71 నుంచీ 82దాకా ఆయన సహచరి శ్యామల చేసిన సేవలు, భరించిన కష్టాలు, అనుభవించిన వేదన మనకు తెలంగాణలో తెలియని ఇంకెందరు మహిళలు అనుభవించారో ఊహించవలసిందే తప్ప చెప్పలేం. ఎమర్జెన్సీ లో విడుదలయి 81లో గవర్నర్ ఉత్తర్వులతో 311 సి కింద ఉద్యోగం కూడా కోల్పో యి ఆటో నడుపుకొని బతకాలని చెరబండరాజు నిర్ణయించుకునే కాలానికి ఒక కొడు కుకూడా పుట్టాడు. ఆ కిరణ్ ఆటపాటలు చూడకుండానే ఆయన కన్ను మూశాడు.
చెరబండరాజు శిక్షణలోనే ఉదయిని ‘కొండలు పగిలేసినం బండలను పిండినం’ పాటకు భూపాల్ రూపకల్పన చేసిన నాట్యం చేసేది. 1990 జనవరిలో ట్యాంకుబండు, హుసేన్‌సాగర్ పక్కన జరిగిన విరసం ఇరవయ్యేళ్ళ సభల్లో ఉదయిని బహిరంగసభ వేదికపై ఆ నృత్యరూపకం ప్రదర్శించి వేలాదిమంది మనసులు చూరగొన్నది. కాని, చెరబండరాజు మరణానంతరం వచ్చే చాలీచాలని ఉపాధ్యాయ పెన్షన్, తల్లి, తమ్ముడుతో కుటుంబం గడవడం కష్టమై ఉదయిని ఇంటర్మీడియేట్‌తోనే చదువు మానేసి చేతికందిన ఉద్యోగాలు చేయాల్సివచ్చింది. ఆ దుర్భర పరిస్థితుల్లో ఆమెపెళ్ళి గురించి ఆలోచించినపుడు మాత్రం ‘నాన్న రాజకీయాలవల్ల అమ్మ పడిన కష్టాలు చూసాను. నేనా టెన్షన్ తట్టుకోలేను’ అని మాత్రం చెప్పింది.
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకు పాలిటెక్నిక్‌లో చదివిన నాగార్జునరెడ్డిని ఆమె ప్రేమించిందని వాళ్ళిద్దరూ ఇంట్లో ఎవరికీచెప్పకుండా పెళ్ళిచేసుకొని వచ్చేదాకా ఊహించలేకపోయాం. ఆయన విద్యార్థిగా రాడికల్ ఉద్యమంలో ఉన్నా, 1997నాటికే లారీకొనుక్కొని వ్యాపారంలో ఉన్నాడు. ఉదయిని తన వైవాహిక జీవితాన్ని ఏడాది, ఏడాదిన్నరయినా అనుభవంచిందో లేదో, 98మార్చి నెలలో హైదరాబాదు తార్నాకలో ఆరాధన థియేటర్ ముందు హైదరాబాదు నగరపీపుల్స్‌వార్ కార్యదర్శి సుభాష్ (రవి), మెదక్‌జిల్లా పీపుల్స్‌వార్ జిల్లా కమిటీ సభ్యుడు భానుతో పాటు నాగార్జునరెడ్డి కూడా అరెస్టయి ‘ఎన్‌కౌంటర్’ అయ్యాడు. అప్పటికి వాళ్ళ పాప సింధూర ఆరునెల లు కూడా నిండని పసికూన. ఈ భావజాలం వల్ల వచ్చే ఘర్షణను కూడా అనుభవిం చలేనని సున్నితంగా భావించిన పాతికేళ్ళు నిండని ఉదయినికి తన వైవాహిక జీవితం లో సహచరుని ‘ఎన్‌కౌంటర్’ ఎంత అశనిపాతమో. మళ్ళీ తల్లి దగ్గర చేరింది. బతకాలి. తాను బతుకుతూ తల్లిని, బిడ్డను,తమ్ముణ్ణి నిలబెట్టాలి. చెరబండరాజుకున్న మొండిధైర్యమే తనకున్నది. మళ్ళీ ఉద్యోగం.
కాని, 2005లో ఉదయినికి కూడా బ్రెస్ట్‌క్యాన్సర్ అని బయటపడింది. కెమోతెరపీతో నయమయిందనే అనిపించింది. కాని ఊపిరితిత్తులకు వ్యాపించింది. అప్పటికే చెరబండరాజు సేవలో, కష్టాల్లో, సమస్యల్లో శ్యామల శారీరకంగా శిథిలం కావడం ప్రారంభమైంది. కిడ్నీ సంబంధమైన దీర్ఘవ్యాధి. చెరబండరాజు మాటల్లోనే చెప్పాలంటే ఆ ఇంట్లో అందరి అశాంతులకు మందు అయి తిరుగుతున్న పాప సింధూర మాత్రం ఉన్నది. ఒక సంవత్సరంపైగా నిష్కృతిలేని వ్యాధితో క్షోభననుభవించి ఉదయిని 2007 మార్చి 13వతేదీ వేకువన కన్నుమూసింది. ‘నాకు బతకాలని ఉంది. మా పాపకోసం బతకాలని ఉంది. కాని ఈ బాధ భరించలేకపోతున్నాను’ అనేది తాను.
ఇది నాకు తెలిసిన ఒక ఉదయిని, ఒక చెరబండరాజు కుటుంబం చరిత్రకనుక చెప్పాను గానీ, ఇది మూడున్నర దశాబ్దాల తెలుగునేల చరిత్రకు భిన్నమైంది కాదు. తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇటువంటి మంటెపొయ్యి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోనే కాదు, పలనాడు, రాయలసీమల్లో కూడా ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి వందలాది, వేలాది కుటుంబాలకోసం ఏం చేయగలం. సుందరయ్యగారు తెలంగాణ సాయుధపోరాట కాలంలో అమరులైన నాలుగువేలమంది ఇళ్ళకు ప్రతి ఇంటికీ వెళ్ళి పలుకరించాడని చెప్తారు. ‘మిస్సింగు’ కేసులవిచారణ సందర్భంగా 1989-90లలో బాలగోపాల్‌తోపాటు కొందరు ఇటువంటి ప్రయత్నం చేశారు. 90మేలో రైతుకూలీ సంఘం సభల సందర్భంగా వరంగల్‌లో అటువంటి ఒక అమరుల బంధుమిత్రుల పరస్పర పలుకరింపు సందర్భం కల్పించారు. 2004 నుంచి అమరుల బంధుమిత్రుల సంఘం కూడా పనిచేస్తున్నది. వీరిలో ఆర్థికసహా యం అవసరమైనవారు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. దాదాపుగా అన్నీ ఇటువంటి కుటుంబాలు-ఛిద్రమైనవో, శిథిలమైనవో. అయితే, అంతకన్నా ప్రతి ఒక్క రూ ఆశిస్తున్నది మాత్రం ఒక మాటసాయం. ఒక మనిషి సాయం. సమాజం కోసం ప్రాణాలిచ్చిన వాళ్ళ కుటుంబాలకోసం మానవసమాజం ఆమాత్రం చేయలేదా?
Wednesday, April 23, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment