ఆ తల్లిని నేను చూడలేదు
కాని ఆ చూపుడు వేలు నన్నే వేలెత్తి చూపుతున్నది
కొన్ని చోట్ల ఆ పిల్లల్నీ నేను చూడలేదు
ఆ తల్లి కన్నీళ్ళు మాత్రం నన్ను వెన్నాడుతున్నాయి
ఆమె ఒడిలోంచి రాలిపోయిన పువ్వుల్ని
వికసించని రేకుల చూపుల్ని
చెరగని చిరునవ్వుల పరాగాన్ని
ఏ మట్టిలో ఏరుకొమ్మనను ఆ తల్లిని
ఆ గుండ్లకు ఎదురొడ్డిన గుండెలు
ఆమె కడుపుపంట అనీ
ఆ మట్టిలో చిందిన నెత్తురు
ఆ తల్లి పాలేననీ
వాస్తవాన్ని ఏ పంటికింద నొక్కి చెప్పనూ
దుఃఖాన్ని ఏ కంటిలో దాచి చెప్పనూ
ఆ పంట చల్లగుండాలని అనుకున్నది తప్ప
ఆ ఫలాలనామె ఆశించలేదు
చిదిమితే పాల్గారే చిన్నారిని కాకున్నా
చిందిన నెత్తురయినా ఆ తల్లి చూసుకోలేదు
ఇంకా ఆకృతి పొందక ముందే
ఆ పిండం ఆకలి ఆమె తీర్చింది
ఊపిరి ఆమె పోసింది
తన కలల రూపాన్ని ఇచ్చింది
ఆ శిశువు తొలికేకను
లోకంలో ఆమె మొదట విన్నది
ఇవ్వాళ
ఏ అజ్ఞాతంలో ఆ శిశువు
ఆఖరి ఆక్రందన చేసిందో
కల చెదరిన మమకారం తప్ప
కబురు లేదు
తన రక్తమాంసాలు పంచుకున్న
ఆ శిశువు వెచ్చని స్పర్శను
కళ్ళు తెరవగానే
పొత్తిళ్ళలో హత్తుకున్న ఆ తల్లి
శూన్య హస్తాలకివ్వాళ
కనుమూసిన ఆ శిశువు
చల్లటి స్పర్శ కూడ లేదు
ఆ తల్లి పురుటి నొప్పుల బాధ
అర్థమయితే తప్ప
ఇవ్వాళ
ఆ తల్లి ఆక్రోశమూ అర్థం కాదు
ఆ అమాయకమైన తల్లికి
తల్లికోసమే పిల్లలు అసువులు విడిచారనీ
ప్రాణంపోసిన తల్లికోసమే
ప్రాణాలిచ్చారనీ చెప్పనా
అందుకోసమే
ఇంకా పిల్లల్ని ఇవ్వమని
దోసిలి చాచానని చెప్పనా
ఆ తల్లి చూపుడు వేలు ముందు
అవనత వదనంతో నిలబడి
అడగనా ఎడతెగని త్యాగాలను!
Wednesday, April 23, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment