Tuesday, April 22, 2008

పదకోశం గురించి (2/4)

తెలంగాణ ప్రజలు ఎంతో అర్దవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మేర అన్న పదాన్ని పరిశీలించండి. ఈ పదాన్ని ఇతర ప్రాంతీయులు “దర్జీ” అంటున్నారు. అది ఉర్దూ పదం. మేరల (హద్దులు) మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తి మేర. ఇదేమో తెలుగు పదం. తెలంగాణలో వ్యవహరించబడే కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు. పంట పండించి కాపు (కాపలా)గా వుండేవాళ్ళు కాపోల్లు. దీనికి సమానార్థకంగా ఆంధ్రప్రాంతంలో రైతులు అంటున్నారు. రైతు ఉర్దూ పదం.

మెత్తగా వుండునట్లు తలకింద పెట్టుకునేది ‘మెత్త’ (దిండు), రోట్లో వేసి నూరినప్పుడు, తొక్కితే ఎట్లా మెత్తనవుతుందో అట్లా తయారైనది ‘తొక్కు’ (పచ్చడి), తన్నితే, తంతే పడివుండేది ‘తంతె’ (మెట్టు), చల్లగా వుండేది ‘చల్ల’ (మజ్జిగ), ఎర్రగా వుండేది ‘ఎర్ర’ (వానపాము), వర్షకాలంలో నీటి ప్రవాహంతో ఒర్రేది (అరిచేది) కాబట్టి ‘ఒర్రె’, వాగునది, వాగేది కనుక ‘వాగు’, నదించేది, శబ్దించేది కనుక ‘నది’. ఇవన్నీ నిఖార్సైన నికాలస్ తెలుగు పదాలు. అంగాన్ని లేదా శరీరాన్ని కప్పి వుంచేది ‘అంగీ’ (చొక్కా), లాగుతూనే వేసుకుని లాగుతూనే తీసి పారేస్తాము కనుక ‘లాగు’ (పంట్లాము), గుల్లగా అంటే ఖాలీగా వుండేది ‘గుల్ల’ (గంప). లోన బోలుగా వుంటాయి కనుక ‘బోలు ప్యాలాలు’ (మరమరాలు), జిహ్వకు రుచికలిగించేవి ‘జిమ్మలు’ (చేపలు), తినేటపుడు కంచంలో ఒక అంచుకు, పక్కన పెట్టుకున్నందువల్ల మాట్లాడే ‘అంచుకు పెట్టుకునుడు’ (నంజుకునుడు), సున్నపురాయి, కోడిగుడ్లు, జిగురు మొదలైనవి కలిపి బాగా ‘దంగు’నట్లు ప్రత్యేకంగా తయారు చేయబడిన పాతకాలంనాటి ‘డంగ్ సున్నం’, కంకుతూ తింటాము కనుక ‘కంకి’ (పొత్తు), చిట్టిగా, చిన్నగా వుండే ‘జిట్టపులి’ (చిరుతపులి), గోళాకారంలో వుండే ‘గోలి’ (మాత్ర), తడి కల్గిన భూమి ‘తరి’ (మాగాణి), శుష్కమైన ఎండ నేల కుష్కి (మెట్ట), గిరుక్కున తిరిగే ‘గిరక’ (గిలక), గిరకమీంచి తాడు జారి సందులో పడగా వ్యవహరించే ‘సందెన వడుడు’, గుడి ఆవరణలో గుండ్రంగా వుండేది ‘గుండం’ (పుష్కరిణి), కళ్ళు బైర్లు కమ్ముతూ మన కళ్ల ముందు చక్రం తిరిగినట్లు తిరిగే ‘చెక్కరచ్చుడు’ (తల తిరగడం), ఉన్నట్టుండి వెఱగుపడే ‘బీరిపోవుడు’ (ఆశ్చర్యపోవడం), గుండ్రంగా వుండే ‘గుండీ’ (బొత్తాం), దెబ్బలు, గాయాలు మొ|| వాటితో గజ్జలో దిగిన వాపుతో గగ్గోలు పడే ‘గగ్గోడు’, ఆకాశమ్మీది నుండి వెళ్ళే ‘మీది మోటర్’, స్టార్టు చేయగానే కుట్ కుట్ అని చప్పుడు చేసే ‘కుట్కుటు మోటరు’… ఇవి సరళమైన, అర్థవంతమైన, నిరాడంబరమైన సాఫ్‌సీదా తెలుగు పదాలు.

ఇంకా చూడండి:

కారడ్డం మాటలు = (వెటకారమ్మాటలు) నిజానికివి కాలడ్డం మాటలు. కాలు అడ్డు పెట్టబడిన మాటలు. ఈ కాలు + అడ్డే మాటలే కాలొడ్డే మాటలయ్యాయి ఉదా|| (సిరి రా మోకాలొడ్డినట్లు…)
కాపాయం: పొదుపు; కాపు+ఆయం = కాపాయం. ఆయం అంటే ఆదాయం. (ఆయ వ్యయాల్లో ఆయం వుంది కదా!) ఈ ఆయాన్ని కాపు చేసుకోవడం అంటే కాపాడుకుని పొదుపు చేయడమే కాపాయం.
కమ్మగ కాయి పాయి చేసుకుని తినుడు = ఇష్టమృష్టాన్నాల్లాగా అన్నపానాదులు ఆరగించడం. కాయి (ఖాద్యం) = అన్నం, ఆహారం; పాయి = (పేయం) పానీయం.
అన్నం కచ్చె పెక్క ఉడుకుడు = అన్నం ఉడికీ ఉడక్కపోవడం కచ్చా అంటే పచ్చి. ఉడకనప్పుడు కచ్చాగానే వుంటుంది. పెక్క (పక్క, పక్కా) అంటే పక్వం. ఉడికినప్పుడు పక్వమై పక్క, పెక్కగా మారుతుంది.
తడలు గొట్టుడు = ఉప్పొంగడం, తటాకాదుల్లోని అలలు గాలితో కడల్కొనడం.
మన్ను దుల్లు దుల్లు అవుడు = బాగా దున్నినందువల్ల నేల ‘వదులొదులు’ కావడం.
కుల్లుల్లు చేసుడు = చక్కగా తేరుకుని తేటగా వున్న ఏటి నీటిని కుదిపి కదిపి అడుగున వున్న మట్టీ బురదలకు చెందిన కుళ్ళూ, మకిలలతో మురికి చేయడం.
పూస పేర్లోల్లు = పూసలు, పేరులు (దండలు), అద్దాలు, దువ్వెండ్లు మొ||నవి అమ్ముకునే వాళ్ళు.
పేర్నాల వెట్టుడు = పేరులు, నామాలు పెట్టి నిందించడం
మాట తొందురుతొందురు పోవుడు = తొందర తొందరగా మాట్లాడితే వచ్చినట్లు పక్షవాతాదుల వల్ల మాటలు తడబడడం.
బూమి దామార నానుడు = వర్షాదుల వల్ల భూమితన దాహం ఆరేలా తడిసిపోవడం.
ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలూ, సామెతలే! తెలంగాణ వాసుల పలుకులో నుడికారం వుంటుంది. జానపదత్వం తొంగి చూస్తూ వుంటుంది. మట్టివాసన గుబాళిస్తూ ఉంటుంది. వీళ్లకు ఏది కొందామన్నా “అగ్గిల చెయి పెట్టినట్లుం”టుంది. తమకు యిష్టం కాని వాళ్ళను చూసినప్పుడు “పెయ్యి పొంట ముండ్లు” వస్తయి. “కాల్లు కడుపులు పట్టుకుని” బతిమాలి బామాలే సందర్భాలు వీళ్ళక్కూడా ఉంటాయి. వీళ్ళు తమ బతుకుల్ని దాదాపు “గుడ్డి కొంగలోలె” ఎల్లదీస్తూ వుంటారు. అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు “ముండ్ల మీదున్నట్లు” భావిస్తారు. కరువులు, కాటకాల వల్ల యిక్కడి బతుకులు “మంటలు పడ్డట్లు” అవుతాయి. అయితే… తెలంగాణలో కూడా “కాని తూట్ల కెల్లి కర్రెపిట్టను ఈగిం”చగలిగిన అఘటన ఘటనా దురంధరులున్నారు. “వంగితె పిచ్చలు మాయం చేసెటోల్లు” కూడా వున్నారు. వెనకబాటు తనం వల్ల తెలంగాణ వాసుల బతుకు “పల్లేరు కాయలల్ల బొర్లిచ్చినట్లు” ఉంటుంది. వీళ్ళు మనస్పూర్తిగా కాక “కడుపునిండ” మాట్లాడుకుంటారు. (ఆ మనస్సు ఎక్కడుందో తెలియని అమాయకులు కదా!) వాన కాలంలో ఎప్పుడు “మొగులు మెత్తవడు”తుందా అని ఎదురుచూస్తూ వుంటారు. “దొంగ చీకటి ఒక్కటయినట్లు” (పులి మీద పుట్రలా) ఉన్న పరిస్థితుల పట్ల కలత చెందుతారు. అన్యాయంగా “బట్టగాల్చి మీద పారేస్తే” (నీలాపనిందల పాలు చేస్తే) కంట తడి పెడతారు. “పానం కొలికిలకు వచ్చినా” (తలప్రాణం తోకకు వచ్చినా) పని చేయాలనుకుంటారు. “గుట్కిల్లు మింగరు” (నీళ్ళు నమలరు). “గట్టుకు కుక్క మొరిగినట్లు” (అరణ్యరోదనంలా) బతుకు ఆగమైపోయినా వణ్కరు జెన్కరు. తెలంగాణలో సైతం కొన్ని “ముడ్డి లేని ముంతలుం”టయి (వ్యక్తిత్వం లేనివాళ్ళు). “ఎన్నపెడితే నాకని, ఏలు పెడితే చీకని” కొరకరాని కొయ్యలుంటయి. “తల్లి కడుపుల పొద్దు పడుతుండంగ” అలసి సొలసిన దేహాలతో యిళ్ళకు తిరిగొస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పోలికలన్నింటినీ పుణికి పుచ్చుకున్నప్పుడు ఈ పొరగాండ్లు వాళ్ల “నోట్లకెల్లి ఊశిపడ్డట్లు” ఉన్నారంటారు. “నోట్లో బంగారు చెంచాతో పుట్టాడు” అనడానికి బదులు “బొడ్లె వరాలు పోసుకుని పుట్టిండు” అంటున్నారు. మోసం చేయడంలోగాని, మొత్తానికి మొత్తంగా ప్రవర్తనలోగాని ఒకరికి మరొకరితో సారూప్యం ఉన్న సందర్భంలో “వీడు వాని జుట్లకెల్లి ఎల్లిండు” అంటున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బొచ్చెడు ఉదాహరణలు చూపవచ్చు. ఇంత సొగసుతో వున్న భాషని సినిమాలో గూండాలు మొ||న పాత్రలకు పెట్టి సొమ్ము చేసుకుంటూ పరిహసించడం తెలుగు సాహిత్యంలో పెద్ద విషాదం.

తెలుగు ద్రావిడ భాషల్లో ఒకటి. తెలంగాణ తెలుగు ద్రావిడానికి చాలా దగ్గర. అయిపోవడం, నిండుకోవడం అనే అర్థంలో తెలంగాణలో “ఒడిశిపోవుడు” అన్న మాట వుంది. మలయాళంలో “ఒడువిల” అంటే చివరికి, ఆఖరుకు అని అర్థం. ఒడిశిపోవుడు అంటే చివరికొచ్చి అయిపోవడమే మరి. తెలుగు పిల్లనగ్రోవిని తమిళంలో పుళ్ళాంగుళల్ అంటున్నారు. తెలంగాణలో దీన్నే పుల్లంగొయ్య (కొన్ని ప్రాంతాల్లో పిల్లంగొయ్య) గా వ్యవహరిస్తున్నారు. తమిళ పుల్లాంగుళల్ కు తెలంగాణ పుల్లంగొయ్య దగ్గరగా వున్నది. తద్ధార్మార్థక భావార్థం తెలంగాణలో చేసుడు, చూసుడు, వచ్చుడు మొ|| మాటలతో పేర్కొంటున్నాం. అయితే యితర ద్రావిడ భాషల్లో ఈ త. భావార్థం ఎలా వుందో చూడండి. చెయ్‌వుదు (చేసుడు), పార్‌ప్పదు (చూసుడు), వరువుదు (రావడం)… ఇలా… ఇవి తమిళంలోనివి. ఇక కన్నడంలో యివే మాడువుదు, నోడువుదు, బరువుదు మొ|| ఈ రీతిలో వ్యవహృతాలు. తమిళ, కన్నడాలు రెండింటిలోనూ ఉన్న పదాంత ‘దు’ వర్ణం తెలంగాణ ‘డు’ వర్ణం ఒక్కటే! మలయాళంలో వీటినే చెయ్యుక, నోక్కుక, వరుక అంటున్నారు. నల్లగొండలో వ్యవహరించే చేస్కం, చూస్కం, వచ్చుకం లాంటి ‘కం’ అంతాలకు మలయాళం దగ్గరగా లేదూ! తెలంగాణలో పొలానికి ఆఖరు తడి పెడుతున్నప్పుడు “తన్నీరు కట్టుడు” అంటారు. ఈ తన్నీరు తమిళ తన్నీర్ ఒకటే! వచ్చిన చుట్టాల బాగోగులు బాగా తెలుసుకోవడం, కనుక్కోవడం, వాళ్ళను గౌరవించడం అనే అర్థంలో అర్సుకునుడు అంటున్నాం. ఇది మలయాళంలో “అఱయుక” కు సమీపం. పురుగూ పుట్రా అనే పదానికి తెలంగాణలో పురుగుబూచి వ్యవహారంలో వుంది. ఈ “బూచి” “పూచ్చి” లోంచి వచ్చింది. పూచ్చి అంటే పురుగు (తమిళం). “తీసుకుని వెళ్ళు” అనే మాటలకు బదులుగా తెలంగాణలో కొంటవో (కొంట పో) అంటున్నారు. ఇది తమిళంలోని “కొండు పో” కు దగ్గర. “కొండు” అంటే కొని, (గై)కొని, (తీసు)కొని అని అర్థం. పో అంటే పొమ్మని చెప్పడం. అడకత్తెర అన్న మాటను తీసుకోండి. మలయాళంలో అడయ్‌క్క అంటే వక్క. (పోకలకు సంబంధించినది) దాన్ని కత్తిరించే సాధనం అడకత్తెర.

No comments: