Tuesday, April 22, 2008

బహుపరాక్‌

- డా|| నందిని సిధారెడ్డి

రెండు నదుల మధ్య నివసిస్తున్న ప్రజలకు రెండుపూటల తిండి దొరుకుతలేదు. కనీసం తాగెతందుకు నీళ్లు కరువవుడు నిజంగా విషాదం. నీటి వనరు కోసం నిత్య సంఘర్షణ నేటి కఠోర వాస్తవం. భూమినీ నీటినీ ఎడబాపుతున్న వలసాంధ్రుల పెడబుద్ధులు లెక్కించతరం గాదు. పూటకో వ్యూహం రోజుకో పథకంతో వెనుకబడిన జనాన్ని వేపుక తింటున్న రాకాసిపీడ నిలువరించ తరం గాదు. కొత్తగా గోదావరి నీళ్లు కృష్ణా నదిల కలిపి ఆంధ్రాకు తరలించేటందుకు ప్రణాళికలు రచించిండ్రు.

భూమీ నీరూ తెలంగాణల సమృద్ధిగా ఉంది. న్యాయంగా నీటి వాటా పొందగలిగితే తెలంగాణా సారవంతమైన నేల. సస్యశ్యామలమై కడుపుకు తొక్కులాడే కష్టజీవుల బతుకులు వికసింపజేస్తది. నియ్యత్‌ లేని వలసాధిపత్యం అట్లా జరగనియ్యది. ఒకపక్క భూమిని విచ్చలవిడిగా ఆక్రమిస్తూ ఉన్నది. గతంలో రేగడి భూమిని ఆక్రమించి ఇప్పుడు ఎర్రనేలలకు ఎసరు పెట్టింది. ఎరవేసింది. కాలువలకు అటుపక్క ఇటుపక్క భూములు కొన్న వారు ఆక్రమించుకొన్న వారు ఇయ్యాల హైవే రోడ్లకు అటూ ఇటూ దౌర్జన్యంగా ఆక్రమించుకొంటున్న భూములకు అడ్డులేదు. అసలు లెక్కలేదు. చెదరిన గ్రామాలు కూలిన నివాసాలు కుప్పకూలిన ఎవుసాలు నేటి తెలంగాణ వాస్తవాలు.

ప్రపంచీకరణ పంచ చేరి ఇంత విధ్వంసం సృష్టిస్తున్న ఆంధ్రా సంపన్న పాలక సంకీర్ణ వర్గాలు తెలంగాణ నోళ్లు మూసి ఇప్పుడు నీళ్లు కొల్లగొట్టే కుట్రకు పాల్పడుతున్నారు.

యాభైయేండ్ల నుంచి అక్రమంగా తరలించిన నీళ్లు చాలలేదట. కొల్లగొట్టిన నిధులు చాలలేదట. ఊడ్చుకుపోయిన ఉద్యోగాలు చాలలేదట. కృష్ణను సాంతం తరలించినా తృష్ణ తీరలేదట. ఇప్పుడు గోదావరి నదిని దుమ్ముగూడెం నుండి నాగార్జున సాగర్‌కు మలిపి కృష్ణానదిల కలిపి అన్ని కాలాలు, కుడి కాలువలు కోస్తాకు నీళ్లు దోచిపెట్టే కుట్రకు రూపకల్పన జరిగింది. నల్లబంగారం, ఎర్ర బంగారం రెండు రకాల భూమి ఇప్పటికే దోచిండ్రు. నల్లనది, తెల్లనది రెండు నదుల నీళ్లు టోకున దోయబోతున్నారు. రాజు తల్చుకుటే దెబ్బలకు కొదువలేదు. పోకిరి సర్కారు పోకడలకు అదుపు లేదు. పంట పండే భూమి రియల్‌ ఎస్టేట్‌ కింద బీడువడింది. తెలంగాణా రైతు బతుకులెక్క మూగరోదనలో మూలుగుతున్నది. ఇక్కడి భూమినుంచి ఎడబాపి నీళ్ళను మలిపే దొంగతనం నిస్సిగ్గుగా తెరమీదికొచ్చింది.

బాబ్లీ ప్రాజెక్ట్‌ కట్టి మహారాష్ట్రులు నీళ్లు ఆపుకుంటరు. మహారాష్ట్రులు ఆపే నీళ్ళ గురించి మాట్లాడేందుకు మనరాష్ట్రులు దోచే నీళ్ళ గురించి మాట్లాడరు. అక్కడా ఇక్కడా కేద్రంలో మూడు చోట్ల అధికారంల ఉన్న కాంగ్రెస్‌ మూడు మాటలు రాసి ఒక్క కట్ట ఆపలేదు. అట్ల తెలంగాణ బీడుపడాలే. ఉన్న నీళ్లు మలుపుకపోతే ఇట్ల బీడు పడాలే. బాబ్లీ గురించి బ్రహ్మండం బద్దలు చేసే పార్టీలు గోదావరిని కొల్లగొట్టనున్న పోలవరం గురించి పలకరు. దుమ్ముగూడెం దుఃఖం గురించి మాట్లాడరు. అంతా కోస్తా చేతి గోళికాయలే. ఆడిస్తే ఆడే ఆటబొమ్మలే. తెలంగాణ ప్రజల కడుపుకొట్టే కుట్ర జరుగుతున్నది బహుపరాక్‌.

తెలంగాణా శక్తులు గట్టిపడాలే. గట్టిగా మాట్లాడాలె. తాటాకు చప్పుళ్లతో వాటాలు రావు. సన్నాయి నొక్కుల్తో సమన్యాయం జరగది. తెలంగాణ సోయితో బలంగా ఉద్యమించాలే. ప్రత్యేక రాష్ట్రం కోసం పరవళ్లు తొక్కాలె. తెలంగాణా, ఇంకొక్కసారి ఇంకొక్క హోరు.

No comments: