Tuesday, April 22, 2008

పదకోశం గురించి (3/4)

తెలంగాణలో లయబద్ధమైన భాష వున్నది. నాదాత్మకమైన మాట వున్నది. మాట మాట్లాడితే చాలు ఏదో ఒక సంగీతం జాలువారుతున్నది. మాట్లాడ్డమే కాదు తిట్టినా వీళ్లకు నాదమే ఆత్మ. అందుకే “తల్లాలిని తిట్టినా తాళం తప్పొద్దురా” అన్న సామెత పుట్టుకొచ్చింది. “కోతి అయినా కొమ్మ తప్పి దుంకదు” అన్న రహస్యం వీళ్లకు బాగా తెలుసు. పాట ఎంత ముఖ్యమో తెలంగాణ వాసులకి మాట కూడా అంతే ముఖ్యం. లయబద్ధంగా మాట్లాడుకునే మాట తీరే తెలంగాణ పాటకు ఎక్కడలేని బలాన్ని యిచ్చింది. తెలంగాణ మాట ఎంత నాదమయమో చూద్దాం.

తెట్టన తెల్లారుడు, పట్టన గుండె వల్గుడు, బెక్కన బెంగటిల్లుడు, చెటాన చెంపదెబ్బ ఏసుడు, పిటాన పిరం, మూట ముగ్గురు… యిలాంటివి ఎన్నింటినో చూపవచ్చు. మధ్య మాండలికంలో “తెట్టన తెల్లారుడు” కు బదులు భళ్ళున తెల్లవారడం వుంది. “తెట్టన తెల్లారుడు” లోని యతిమైత్రికీ, “భళ్ళున తెల్లవారడం” లోని ప్రాసయతికీ తేడా లేదూ!

తెలంగాణలో వ్యవహరించబడే అతులం కుతులం, కల్గం పుల్గం, తల్లడం మల్లడం, ఇచ్చుకం పుచ్చుకం మొదలైన మాటల్లోని శ్రుతి సుభగత్వం అతలా కుతలం, కలగా పులగం, తల్లడిల్లడం, ఇచ్చి పుచ్చుకోవడాల్లో వుందా? అతలా కుతలంలోని అతలాను అతులంగా మార్చుకోవడానికి వీళ్లకు ఏ వ్యాకరణ వేత్తల, పండితుల అనుమతి అవసరం లేదు. వీళ్లకు కావలసింది “కుతుల” అనే మాటకు అనుకూలంగా “అతలా”ను “అతులం”గా మార్చుకోవడమే! తల్లడిల్లడంలోని 3+5 మాత్రల ఏర్పాటు నచ్చలేదు. వెంటనే 5+5 మాత్రల తల్లడం మల్లడంగా మార్చారు. అట్లాగే యితర మాటలు. ఇట్లా ఉచ్చారణా విధేయంగా పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతల్ని మార్చుకోవడంలో వెనుకంజ అన్న ప్రశ్నే లేదు వీళ్లకు. ప్రజల భాషకు పండితుల పట్టింపులు ఉండవు. వీళ్లా పదాలను అనుకుంటె ఒక్క దగ్గరికి ముద్ద చేయగలరు. అనుకూలంగా లేకుంటే తీగలుగా సాగదీయడమే గాక రేకులుగా పర్యాప్తం చేయగలరు. మాటను “నాదమయం” చేసే ఈ “పనితనం” సోమన, పోతన, నారన, కొరవి గోపన, కంచర్ల గోపన్న, దాశరథి, సినారె, కాళోజి, అలిశెట్టి, గద్దర్, వెంకన్న, అందెశ్రీ, దేశపతి… యిట్లా ఎందరిలోనో కనిపిస్తుంది. తెలంగాణలో శ్వాసాలు నాదాలుగా మారడానిక్కూడా యిదే కారణం. కత్తి గట్టుడు, కన్నుగొట్టుడు, కన్ను వెట్టుడు, పనిజేసుడు, వాన్ని గొట్టుడు, వీన్ని దిట్టుడు, ఇర్గ జూసుడు, ఇర్గవడుడు, కయ్యగోసుడు, గడ్డిదొక్కిచ్చుడు… ఇత్యాదులు.

తెలంగాణ భాషను నాదమయం చేయడంలో “పూర్ణానుసారం” పాత్ర కూడా చాలా గొప్పది చూడండి:

ఇచ్చంత్రం (విచిత్రం), నాగుంబాము (నాగు పాము), తాంబేలు (తాబేలు), లచ్చిందేవి (లక్ష్మీదేవి), చిమ్మంజీకటి (చిమ్మచీకటి), తెల్లందాక (తెల్లవారుదాకా, తెల్లవార్లూ), పుంటికూర (పుల్లటి కూర), పొద్దుందాక (పొద్దుగూకేదాక), పొద్దుంజాముల (పొద్దుగూకేవేళ), చాంతాడు (చేదత్రాడు), వరంగల్ (ఒరుకల్), తెలంగాణ (తెలుగుస్థానం), డ్రంబు (డ్రమ్ము), గాంచునూనె (గ్యాస్‌నూనె), సరింగ (సరిగా), ఎదురుంగ (ఎదురుగా), రాంగ (రాగ), పోంగ (పోగా), అనంగ అనంగ (అనగా అనగా), యాసంగి (వేసవి) మొ||నవి. ఇట్లాగే తెలంగాణ మాటను లయబద్దం చేయడానికి కొన్ని అక్షరాలను ద్విత్వం చేస్తున్నారు. చిత్తగించండి.

మస్సి (మసి), మస్సాల (మసాల), గస్సాలు (గసగసాలు), అనగల్ల మాట (అనగల మాట), దయగల్ల తల్లి (దయగల తల్లి), ఆత్మగల్ల చెయ్యి (ఆత్మగల చేయి), గాలి బొయ్య బొయ్య ఇసురుడు (గాలి బొయ్యిమని వీచడం), కాల్లు తట్ట తట్ట కొట్టుడు (కాళ్ళు తట తట కొట్టడం), గొర్ర గొర్ర గుంజుకపోవుడు (గొర గొరా లాక్కుపోవడం), పొల్ల కిస్స కిస్స నవ్వింది (కిస్సున నవ్వడం), లప్ప లప్ప తినుడు, గుట్ట గుట్ట తాగుడు, పల్ల పల్ల ఏడ్సుడు, మిట్ట మిట్ట చూసుడు, బర్ర బర్ర గోకుడు, లట్ట లట్ట తాగుడు, పస్స పస్స తినుడు, పిస్స పిస్స మాట్లాడుడు, తుప్ప తుప్ప ఊంచుడు మొ||నవి. ఇంతే కాదు పదంలో అసంయుక్తాక్షరాలను సంయుక్తాలుగా మార్చి నాదమయం చేస్తారు. దీన్నీ గమనించండి.

సూత్కం (సూతకం), జాత్కం (జాతకం), పాత్కం (పాతకం), నీట్కం (నీటుకం), కైలాట్కం (కైలాటకం) మొ||నవి. జంజాట్కం, పూట్కం, దోష్కం, కమస్కం (కమ్‌సేకమ్), తీర్పాటం, తెగారం, జాగారం లాంటివన్నీ యిలా మారి ఊపిరి పోసుకున్న పదాలే! మాటలో సరిసమానమైన ‘తూగు’ను పాటించడంలో కూడా ఈ నాదాన్ని విడిచి పెట్టకూడదన్న రహస్యం దాగివుంది. “కాండ్రించి ఉమ్మాడు” అన్న వాక్యంలోని “కాండ్రించి”ని తెలుగులో “కాండ్రకిచ్చ” అంటున్నారు. కాండ్రించి లో ఐదు మాత్రలుంటే “కాండ్రకిచ్చ”లో 3+3=6 మాత్రలు ఏర్పడి “తూగు” సమానమైంది. “ఎండి పోవుడు” అనే మాట తెలంగాణలో “ఎండుకపోవుడు”గా వుంది. 3+4 మాత్రలుగా వున్న మాట తెలంగాణకొచ్చేసరికి 4+4గా మారింది. తెలంగాణ పదాలకూ, పదబంధాలకూ, సామెతలకూ, పొడుపులకూ ఈ “లయ” ప్రాణం. పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టినట్టు ; తీరు తీరు చీరెలు గట్టుకొని తీర్తానికి పోతె, ఊరుకొక్క చీరె ఊశిపోయిందట ; పంట గంజి పాసు పాసు, కైకిలి గంజి కమ్మకమ్మ ; నాబికాడ సల్లవడితె నవాబ్ తోని జవాబ్ చెప్పొచ్చు… యివన్నీ నాదమయమైన సామెతలు. ఏతావాతా చెప్పేదేమంటే తెలంగాణ మాటకు వాదం అద్దితే పాట – సంగీతం రుద్దితే పాట – లయను దిద్దితే పాట – అసలు తెలంగాణమే తెలుగు గానం.

తెలంగాణ భాష అందమైన భాష. చిన్న పిల్లల ముక్కులోంచి చీమిడి కారుతున్నప్పుడు “ముక్కు వచ్చింది, తియ్యండి” అంటారు. “కళ్ళ కలక” ను “కండ్లు వచ్చినయనీ”, గవదబిళ్లల వ్యాధిని “కుత్కెలు వచ్చినయనీ” లేదా “చెంపలొచ్చినయనీ” వ్యవహరిస్తారు. చేతి, కాలి వేళ్లకు అరుదుగా వచ్చే “జెట్టరోగం” పేరు ఉచ్చరించడానికే భయపడుతారు. మల విసర్జనకు వెళ్లిన వ్యక్తిని వాడు “సుట్టాల మార్గం బోయిండు” అంటారు. అందమైన నవ్వును “శిల్క నవ్వు”గా పేర్కొంటున్నారు. సౌందర్యాన్ని “సక్కదనం, రామసక్కదనం”, పదాలతో మాట్లాడుతారు. అలికి పూతలు పెట్టే ఎర్రమన్నును “పుట్ట బంగారం” అంటారు. తెలంగాణ భాష ఆత్మీయమైన భాష. “అన్నా ఎటు వోతున్నవే?” “ఓ అవ్వా! మంచిగున్నవా?”, “తమ్మీ! జెర పైలం”, “తాతా! ఏం పరాశికాలే?”, “మర్దలు పిల్లా! ఈ నడ్మల జెర్ర నిగనిగ అయినవ్”, “నాయనా ! నా మొర ఏ దేవునికి ముడుతదో!”, “చెల్లే! బావ బతుకమ్మ పండుక్కు పంపలేదానే?”… ఇట్లాంటి ఆప్యాయమైన వాక్యాలు, వావివరసలు, సహజాతి సహజాలు. తెలంగాణ భాష గ్రాంధికానికీ, కావ్యభాషకీ చాలా దగ్గరైన భాష. భాషావేత్తలకూ, వ్యాసకర్తలకూ, నిఘంటుకారులకూ వలసినంత సమాచారాన్ని యివ్వగల్గిన అక్షయపాత్ర తెలంగాణ ప్రాంతం. ఏది ఏమయినా ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ తెలంగాణ భాష లేని తెలుగు సరస్వతిని ఊహించడమే కష్టం. అట్లాంటి చదువుల తల్లి చిత్రపటం వుంటే గింటే అది అసమగ్రమే !

No comments: