(అల్లం రాజయ్య నవలలపై (కొలిమంటుకొంటుకొన్నది, ఊరు, అగ్నికణం) సమీక్షా వ్యాసం)
నేను కాలానికి, చరిత్రకు… సాక్షిని, సహచరున్ని, టైంకీపరును. ఈ పని నేను ఇష్టపూర్వకంగా ఎంచుకున్నదేమీ కాదు. నా కాలం, నా తరం నాకు వొప్పజెప్పిన కర్తవ్యమిది. గుబగుబలాడే గుండెతో ఇంత బరువును… పంచుకోకుండా, చెప్పకుండా ఉండజాలని తీవ్రమైన మానసిక స్థితి నుండే నేను రాయడం ఆరంభించాను… నేను అక్షరాలుగా పేర్చిన ఈ అనుభవాలన్ని నాతరపు అనుభవాలు - రక్తసిక్తమైన అనుభవాలు.
- అల్లం రాజయ్య (వెనక్కి తిరిగి చూసుకుంటే)
శ్రీకాకుళం గిరిజనోద్యమం ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతిధ్వనించిన ఆ కాలం కల్లోలకాలం - చరిత్ర సంఘర్షణల చరిత్ర. అందుకే అల్లం రాజయ్య పంచుకునే అనుభవాలు - పేర్చిన అక్షరాలు రక్తసిక్తాలు. 1969 ఒక కొండగుర్తేకాదు - బండ గుర్తుకూడా. కల్లోలాల గుదిబండని అప్పుడెత్తుకొన్న తెలంగాణ ఇంకా మోస్తూనే వుంది. నాగేటిచాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటానికి - బొగ్గు గుట్టల్లో నిప్పురవ్వయి లేచిన కార్మికోద్యమానికి - అడవి కడుపులో కార్చిచ్చై మండిన ఆదివాసీ విముక్తి చైతన్యానికీ అల్లం రాజయ్య ప్రత్యక్ష సాక్షి. తరతరాల పీడనకి వ్యతిరేకంగా భూమికోసం, రాజ్యాధికారం కోసం దిక్కుమొక్కులేని జనం చేపట్టిన ప్రజాయుద్ధ పంథాలో, సాగిన జైత్రయాత్రలో రచయితగా రాజయ్య భాగమయ్యాడు. తెలంగాణలో వట్టికోట తర్వాత (ప్రజల మనిషి, గంగు….) సజీవమైన చరిత్రని సృజనాత్మక సాహిత్యంగా మల్చిన రచయిత రాజయ్యే. అయితే వట్టికోట పోరాట విరమణ తర్వాత గతాన్ని రికార్డు చేస్తే - రాజయ్య ఉద్యమం అగ్నిపర్వతం లావాలు చిమ్ముతోండగా ఆ వేడిలో - ఆ సెగకు ఉడుకుతూ తన వర్తమానానికే సాహిత్యరూపం యిచ్చాడు. వట్టికోట తన నవలల్లో చిత్రించిన 40ల నాటి పరిస్థితులే 70ల్లో రాజయ్య కలం పట్టేనాటికి ఆయన తిరుగాడిన నేల మీద నెలకొని ఉన్నాయి.
నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం భారతదేశంలో వ్యవసాయిక విప్లవానికి దీశానిర్దేశం చేసింది. వలస పాలన అంతరించి అధికార మార్పిడి జరిగినా ఫ్యూడల్ పీడన వున్న ప్రతిచోటా తెలంగాణ మళ్ళీమళ్ళీ బద్దలవుతూనే వుంటుందని ప్రపంచానికి చాటిచెప్పింది. అప్పుడు వికసించిన విద్యుత్తేజం బెంగాల్ సంతాల్ గ్రామాల్లో, శ్రీకాకుళం సవర - జాతుల వలసల్లో వసంతమేఘమై గర్జించింది. ఆ గర్జన 70ల్లో మళ్ళీ ఉత్తర తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనించింది. అందుకే డెభ్భైల కాలాన్ని దందహ్యమాన దశాబ్దంగా పేర్కొన్నారు. తారీఖులు - దస్తావేజులు చరిత్ర సారంకావు గానీ - అవి చరిత్ర సారాన్ని తెలుసుకోవడానికి సాధనాలు. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు ‘ఎటువైపో’ తేల్చుకొన్న కాలం అది. ఉద్యమావసరాలకు వివిధ ప్రజాసంఘాలు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి. (1970 - విరసం, 1972 - జనామం, 1973 - పౌరహక్కుల సంఘం, 1974 - రాడికల్ విద్యార్థి సంఘం, 1978 - రాడికల్ యువజన సంఘం, 1979 - రైతుకూలీ సంఘం మొ||… వీటిలో కొన్ని యివ్వాళ ప్రకటిత, అప్రకటిత నిషేదాలకీ, నిర్బంధాలకీ గురయివున్నాయి). దేశవ్యాప్తంగా జరిగిన రైల్వేసమ్మెని అంటుంచితే - గాంధీ సహాయనిరాకరణ - శాసనోల్లంఘన స్ఫూరితోనే కావచ్చు బీహార్‌లో విశ్వవిద్యాలయాల్ని విడిచి విద్యార్థుల్నీ, మేధావుల్నీ ప్రజల్లోకి వెళ్ళమని జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చింది కూడా ఈ కాలంలోనే. 1978 - ‘గ్రామాలకు తరలండి’ కాంపెయిన్ ‘ప్రజా పంథా’ లో గొప్ప మలుపు - పెను సంచలనం. ఇది ఉద్యమాల స్వరూపాన్ని మార్చివేసింది. దోపిడికి వ్యతిరేకంగా పెనుగులాడుతోన్న రైతాంగాన్ని నిర్మాణాల వైపు నడిపించింది.
ఈ కాలంలోనే 40ల్లో తెలంగాణ సాయుధ పోరాటం వేడి అంతగా సోకని కరీంనగర్ జిల్లా పల్లెల్లో రైతులు, కూలీలు, అట్టడుగు కులాలకి చెందిన వివిధ వృత్తుల వాళ్ళు, స్త్రీలు భూస్వామ్య పీడనకి - ఆధిపత్యాలకి ఎదురుతిరిగారు. ఆ క్రమంలో సమస్త సంపదకి సృష్టికర్తలైన ప్రజల పోరాటానికి భూమి కేంద్రమైంది. దొరలు అంతకుముందు వసూలు చేసిన దండగలు - జరిమానాల్ని ప్రజలు తిరిగి గుంజుకొన్నారు - ఎగేసిన పెట్టుబడుల్ని రాబట్టుకొన్నారు. సాంస్కృతిక పీడనకి ఉద్వాసన పలికారు - దొరని సాంఘికంగా బహిష్కరించారు. దొరలు ఊళ్ళొదిలి పట్నాలకి ఉడాయించారు. అయితే పోరు ఆగలేదు - నిజమైన పోరు అప్పుడే మొదలైంది. రైతు కూలీల తిరుగుబాట్లు నిర్మాణరూపం తీసుకొన్నాయి. ఉద్యమం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళింది. జగిత్యాల జైత్రయాత్ర (సెప్టెంబర్ 8, 1978) తర్వాత రాజ్యం దొరలకి వత్తాసుగా గ్రామాల్లోకి ప్రవేశించింది. నెల తిరిగేసరికి ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్లా తాలూకాల్ని కల్లోల ప్రాంతాలుగా ప్రకటించింది - (ప్రకటన - అక్టోబరు 20, అమలు అక్టోబరు 4) గడీలు పోలీసు క్యాంపులయ్యాయి. మంచి బతుకు కావాలన్నందుకు పల్లెలు యుద్ధభూములయ్యాయి. పంటచేలు నెత్తురు చిందాయి. ఊరూ వాడా ఆగమయ్యాయి. ఆకలికి అలమటించే అన్నలు- అక్కలు అగ్నికణాలయ్యారు. రాజ్యాధికారం కోసం సాయుధమయ్యారు. ప్రాణాలు సాకపోశారు.
ఈ కదలిక క్రమం అంతట్నీ అల్లం రాజయ్య కొలిమంటుకొన్నది (1978-79), ఊరు (1982), అగ్నికణం (1983) నవలల్లో నమోదు చేశాడు. తిరగబడందే బతుకులేదని తెలుసుకొన్న ప్రజా జీవితాల్లోని సంక్లిష్టతని, మానవీయ స్పందనల్ని, అన్నిరకాల అణచివేతలోనూ నిర్బంధాల్లోనూ మొక్కవోని ధైర్యంతో నిలబడి పోరాడిన కొత్త తరం మనుషుల రక్తచలనాన్ని సాహిత్యంగా మలచి ఉద్యమాన్ని రికార్డు చేయడమే గాక - కార్యకర్తలకి గొప్ప విశ్వాసాన్ని, చైతన్యాన్ని అందించడంలో రాజయ్య రచయితగా ముందు నిలబడ్డాడు. ‘ప్రజల నుంచి ప్రజలకు’ - అన్న సాంస్కృతిక నినాదాన్ని గతితార్కికంగా సాహిత్యానికి అన్వయించాడు. ఈ మూడు నవలల్ని పాతిక - ముప్ఫై సంవత్సరాల తర్వాత యివ్వాళ్టి చారిత్రక అవసరంగా ‘పర్‌స్పెక్టీవ్స్’ అందిస్తోంది - వాటిని మళ్ళీ చదువుతుంటే గుండె తడవుతుంది - రక్తం పొంగుతుంది.
***
పి. రామకృష్ణారెడ్డి అన్నట్లు ‘రాజయ్య రచనలు కొంతమంది పాఠకులవి కావు - కోట్లాది మంది ప్రజలవి’. అవి మట్టి నుంచి మొలకెత్తినవి. ఒక నిర్దిష్ట మానవ సమాజంలో మెరుగైన జీవితం కోసం తండ్లాడిన రక్తమాంసాలున్న మనుషులు ఈ నవలల్లో పాత్రలు. ‘కొలిమంటుకొన్నది’లో నర్సింహం, గుడ్డి గట్టయ్య, రాజెల్లి, బొత్తయ్య, బద్ది లింగయ్య. ‘ఊరు’లో బొంద్యాలు, గౌండ్ల చిన్నయ్య, వడ్ల శంభయ్య, సాకలి అంతయ్య, రాధమ్మ, నర్సమ్మ. ‘అగ్నికణం’లో బయ్యక్క, పికిలి…. యిలా వీళ్ళంతా పోరాటంలో పాలు పంచుకొన్న మట్టి మనుషుల ప్రతిరూపాలు. ఈ ప్రజా సమూహాలకు భవ్యమైన జీవితాన్నందించేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన రాజారాంలు, కొండయ్యలు - వ్యక్తుల్లో రగులుకొంటున్న కోపానికి రాజకీయ చైతన్యాన్ని జోడించారు. అందుకే రాజయ్య రాసిన యీ మూడు నవలలు దేనికదే ప్రత్యేకంగా కాకుండా ట్రైలజీలా కనిపిస్తాయి.
‘కొలిమంటుకొన్నది’ నవల మొదలయ్యేసరికి - దొరపీడనకి వ్యతిరేకంగా ఒంటి నాగలి నర్సింహం ఒంటరిగానే నిలబడతాడు. తన పెరట్లోని కరెంటు స్తంభాలని దొర కాజేసినపుడు - సహాయం కోసం మాలీ పటేల్ని, పట్వారీని, పోలీసు అమీన్‌ని, కరెంటు ఆఫీసర్ని అందర్నీ అర్థిస్తాడు. ‘ఎన్నటికైనా ఉన్నోడు ఉన్నోడు ఒక్కటే’ నని అర్థం చేసుకుంటాడు ‘కరంటు బీదోనికోసం గాదు - దొరల బంగులాలల్ల, గడీలల్ల దీపాల కోసం… దొరల బాయిల్ల నీల్లు తోడేందుకోసం… సడగులు ఆల్ల మోటార్లు తిరిగేటందుకే.’ దోపిడి సమాజంలో అభివృద్ధికరమైన అంశాలన్నీ దొరలే వాడుకుంటారని గ్రహించేసరికి దొర కుట్రకు వున్న భూమి సైతం కోల్పోతాడు. ‘పండిచ్చేది మనం, తినేది ఇంకోల్లు’, ‘ఎయ్యిమందిని ఒక్క దొర ఆడిత్తండు - ఎయ్యిసేతులు ఒక్కటయ్యే దేవుసం రావాల’న్న చైతన్యం అందిపుచ్చుకొంటాడు. దొర జులుంకు వ్యతిరేకంగా, దున్నేటోనికి భూమికోసం రైతుకూలీలంతా ఒకటవ్వాలని తెల్సుకొని వ్యక్తిచైతన్యం వర్గ చైతన్యంగా రూపొందే క్రమంలో భాగమవుతాడు. మంది సొమ్ము తిన్న దొరల దౌర్జన్యం కొలిమంటుకోనంతవరకే. జగిత్యాల జైత్రయాత్రకి పూర్వరంగమంతా, సామాజిక చలనం అంతా ‘కొలిమంటుకొన్నది’ నవల్లో చిత్రితమైంది. చినమెట్‌పల్లి భూస్వామి ప్రజల మీద కాల్పులు జరుపుతూండగా ఆ మారణకాండని ఆపకుండా చూస్తూ నిలబడ్డ పోలీసు అధికారిని (నిజానికి ఆ అధికారి దొరకు అండగా వచ్చాడు) ‘ఆ దుస్తులు, తుపాకీ నాకివ్వు - వాణ్ణి అరెస్టు చేస్తా’నని నిలదీసిన శ్రామిక స్త్రీ మాటలే ‘కొలిమంటుకొన్నది’ నవలకి ముగింపు - ఒక సంఘటనకి కళారూపం ఇవ్వడంలో రాజయ్య చూపిన నేర్పు అపూర్వమైంది - జీవితం సాహిత్యం గతి తార్కికంగా ఒకదానికొకటి పరిపూరకంగా పని చేస్తాయని చెప్పడానికి రాజయ్య మొదటి నవలే అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రజల తిరుగుబాటు కోసం నిర్మాణ రూపం తీసుకొనే క్రమంలో దొర కొత్త ఎత్తుగడలతో పోలీసుల్ని వెంటబెట్టుకొని ఊళ్ళోకొస్తాడు. దొర రూపం మారింది - స్వభావం మారలేదు. కానీ ప్రజలిప్పుడు గొప్ప చైతన్యంతో తొనకిసలాడుతున్నారు. కేవలం ఉద్రేక స్వభావులు కారు - ఆలోచనాపరులు. అన్ని రకాల ఆర్థిక - సామాజిక - రాజకీయ సంబంధాలనూ వాటి సంక్లిష్టతతో సహా అర్థం చేసుకొన్నారు. దోపిడి వ్యవస్థలో దొర ఒక భాగం మాత్రమేననీ ‘వ్యవస్థని సమూలంగా మార్చాలంటే రణం చేయక తప్పదనీ రాజ్యాధికారం కోసం సాయుధ ప్రజా సైన్యం అవసరాన్ని వారు గుర్తెరిగారు. పోరాటం దీర్ధకాలికమనీ తెలుసుకొన్నారు. ఈ క్రమం అంతా ‘ఊరు’ నవల దృశ్యమానం చేస్తుంది. అందుకే ‘కొలిమంటుకొన్నది’ నవల్లోలా యిందులో ఒక ప్రధాన పాత్ర వుండదు. ప్రజలంతా చరిత్ర నిర్మాణంలో ప్రధాన పాత్రధారులే. వర్గపోరాటానికి చెందిన చైతన్యపూరితమైన భావజాలమే ప్రజాశ్రేణుల్ని నడిపించే సూత్రధారీ, చోదకశక్తీ. ప్రజాచైతన్యాన్ని ఎదుర్కోడానికి, అణచివేయడానికి పీడకులు వేసే ఎత్తుగడలు, చేసే సమీకరణలు గురించి ‘ఊరు’ బలంగా చర్చించింది. నిజానికి కొలిమంటుకొనేసరికి దొరకి తన ఫ్యూడల్ పెత్తనం యింకెంత మాత్రం చెల్లదని తేలిపోయింది. బలహీనమైన భూస్వామ్యానికి - రాజ్యం ప్రత్యక్ష సహయం అవసరమైంది. మొరటు ఫ్యూడల్ అణచివేత పద్ధతుల్లో పరిశ్రమల్లోకి పెట్టుబడుల బదలాయింపు - రాజకీయాధికారం - వీటిల్లో మూడో ప్రత్యామ్నాయం ద్వారానే - రాజకీయాల్ని శాసించడం ద్వారానే దోపిడీ నిరాఘాటంగా కొనసాగించగలమనీ చట్టాలు, పోలీసులు, కోర్టులు, జైళ్ళు, తుపాకులు - అన్నీ తమకు అండగా వుంటాయనీ దొరలకి గ్రహింపు కలిగింది. వీటిని ఎదుర్కోడానికి ప్రజలకి మిగిలింది - మిలిటెంట్ పోరాటమే అన్న ప్రజల సంక్లిష్ట రాజకీయ వ్యూహాన్ని ‘ఊరు’ స్పష్టంగా తెలియజెప్పింది. రెండు వర్గాల వ్యూహప్రతివ్యూహాల్ని కార్యాచరణని ఒక చారిత్రక సందర్భంలో రాజయ్య సాహిత్యీకరించాడు. ఒక విధంగా విప్లవోద్యమ శిబిరాల్లో ‘ఊరు’ రాజకీయ పాఠమైంది. చంటయ్య వెంట పూర్తికాలం పార్టీలో పనిచేయాలన్న అతని భార్య నర్సమ్మ నిర్ణయంతో ‘ఊరు’ నవల ముగిస్తే - ఉద్యమంలో రాటుతేలిన బయ్యక్క స్వీయ కథగా ‘అగ్నికణం’ మొదలవుతుంది. రాజయ్య చేసిన యీ ముగింపు సంకల్పితమైనా అసంకల్పితమైనా - ఒక నిర్దిష్ట మానవ సమాజంలో కల్గిన చలనాన్ని పొరలు పొరలుగా అర్థంచేసుకోడానికి, పోరాటమార్గంలో ఏర్పడే సంక్లిష్ట మానవ సంబంధాల లోతుల్ని విశ్లేషించుకోడానికి, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాల్ని బలపర్చుకొనే సైద్ధాంతికావగాహన సాధించడానికి రాజయ్య రాసిన యీ మూడు నవలలు మంచి పని ముట్టులుగా ఉపయోగపడతాయి - స్థూలంగా పోరుదారికి ఎత్తిపట్టిన దివ్విటీలై వెలుగుచూపుతాయి.
మూడో నవల ‘అగ్నికణం’ - ఆడది అగ్నికణమైతే అన్నపేరుతో మొదట కొంతభాగం ధారావాహికంగా వెలువడింది. స్త్రీల లైంగికత పట్ల ఫ్యూడల్ పితృస్వామ్య భావజాలం ఎలావుంటుందో తెలియజెప్పే అద్భుతమైన నవల యిది. తెలుగు నేల మీద - సాహిత్యంలో కానీ మరెక్కడైనా కానీ ‘స్త్రీవాదం’ అన్నపదం పుట్టని రోజుల్లో స్త్రీ పురుష సంబంధాల్లో, వైరుధ్యాల్ని గొప్ప సంయమనంతో చర్చించింది ‘అగ్నికణం’. సంఘటిత మహిళా ఉద్యమాలు బలపడిన తర్వాత కూడా లైంగిక స్వేచ్చ అన్న విషయాలు చర్చకు నోచుకోలేదు - కానీ లైంగిక దోపిడికి సంబంధించిన అనేకాంశాల్ని, పాఠ్యాల్ని ఎంతో సాహసంగా, నిజాయితీగా, సహానుభూతితో అస్సర్‌టీవ్‌గా రాజయ్య యీ నవలలో చెప్పగలిగాడు. స్త్రీలపై జరిగే అన్ని రకాల అమానవీయ శారీరక హింసనీ అనుభవించిన ‘బయ్యక్క’ అనే అట్టడుగువర్గ స్త్రీ - స్త్రీ విముక్తి కోసమే కాదు - సమస్త మానవాళి విముక్తికోసం ఉద్యమం బాట బట్టడం యిందులో ప్రధాన వస్తువైనప్పటికీ బయ్యక్కల జీవితంలో ఎదురయ్యే అనేకమైన చేదు అనుభవాలను ఒకవైపు, విముక్తి మార్గంలో బయ్యక్క చూసిన మానవీయ స్పందనలు మరొకవైపు చిత్రించడం ద్వారా ఉద్యమాల లోపల స్త్రీ పురుష సంబంధాల్లో కనిపించే ఉదాత్త నైతిక విలువలకు ఉన్నత సాహిత్య రూపం యిచ్చినట్లయింది. అయితే ఉద్యమాల్లో ప్రజాసంఘాల్లో బయ్యక్కలు దోపిడికి గురవడం లేదా - అంటే బయటా లోపలా ఎటువంటి అవలక్షణాన్నైనా ఎదిరించి పోరాడగల శక్తిని ఉద్యమ కార్యచరణే యిస్తుందని చేత ఆయుధం ధరించిన బయ్యక్క చెప్పకనే చెబుతుంది.
బయ్యక్క లాంటి దగాపడ్డ చెల్లెళ్ళు విముక్తి పోరాటంలో చేరడం సహజమూ అనివార్యమూ అయినప్పటికీ వాళ్ళు ఆ పోరాటంలో కీలకమైన పాత్ర నిర్వహించడం గురించి చర్చలు జరిగాయి. ఒకసారి విముక్తి పోరాటంలో భాగమైన తర్వాత భావజాలపరంగా బయ్యక్కలు బలపడితీరాలి. ఆ శక్తిని ఉద్యమాలు తప్పక అందించాలి. అప్పుడే ప్రగతిశీల ఉద్యమాలు సఫలమైనట్లు. ఈ నవల్లో కథనం బయ్యక్క ముఖతః కొంత వినడం వల్ల - స్త్రీ పురుషులిద్దరి ఆలోచనా కోణాల్ని అర్థంచోసుకోగలం - అయితే విప్లవోద్యమ భావజాలం - అనుభవం యిద్దర్నీ ఒకేలా ఆలోచింపజేస్తుందని తెలుస్తుంది. బతుకు తెరువు వెతుక్కుంటూ బయ్యక్క కాలరీలో తలదాచుకొని గోర్కి అమ్మలా ఉద్యమోన్ముఖురాలైనట్లు రాయడం ద్వారా ఉద్యమాల మలుపు నిప్పు పారిశ్రామిక వాడల్లోకి వ్యాపించిన, వైనాన్ని రాజయ్య జాగ్రత్తగా ముడివేశాడు. దీనికి సూచనలు ‘కొలిమంటుకొన్నది’లోనే కనిపిస్తాయి. నర్సింహం తోడల్లుడి కొడుకు పాపయ్య బొగ్గు బావుల్లో ఎదుర్కొంటున్న దోపిడితో పాటు - బావి మీద ఉద్యోగం పోగొట్టుకొన్న ఆనందం అనే కార్మికుడు గ్రామంలో సంఘ నిర్మాణంలో క్రియాశీలక పాత్రవహించినట్లు పేర్కొనడం ద్వారా ఉద్యమాల భవిష్యత్తుని రాజయ్య సరిగా దర్శించినట్లు తెలుస్తుంది. ఈ పాత్రలన్నీ సజీవ వ్యక్తులే అయినప్పటికీ వాటిని సాధారణీకరించి - కొన్నిరూపాల జీవితాల వ్యక్తుల సమాహార రూపంగా నమూనాలుగా తీర్చి దిద్దడంలో రాజయ్య చూపిన ప్రతిభ అనితరసాధ్యం. చరిత్రకి సాహిత్యరూపం యిచ్చి ‘కాలంలో నడిచిన కలం’ (వరవరరావు) గా రాటుతేలిన సృజనాత్మక నైపుణ్యం రాజయ్యకి ప్రజలనుంచి - ఉద్యమాలనుంచే లభించినప్పటికి - తన నిజాయితీ నిబద్ధతలతో నూతన ప్రజాస్వామిక యుద్ధపంధాకి దిగ్దర్శనం చేయడం ద్వారా మిగిలిన తెలంగాణ రచయితలందరి కన్నా రాజయ్య ఎంతో ముందున్నాడు. చరిత్ర నడిచిన దారినే కాదు - చరిత్ర సారాన్ని కూడా రాజయ్య అర్థం చేయించి - అవిష్కరించి సాంస్కృతిక పంథాలో అగ్రగామి అయ్యాడు. ఇది రాజయ్య సాధించిన విజయమే కాదు - సాంస్కృతికంగా ఉద్యమం సాధించిన విజయం కూడా.
జీవన్మరణ పోరాటాలమధ్య వున్న తన ప్రజలకు తన సాహిత్యాన్నందించడానికీ, ‘కడుపుల పేగులు తెగిపోయే దుఃఖపు ఎక్కిల్లతో సతమతమౌతోన్న’ వాళ్ళ గుండెనిండా ధైర్యాన్ని విశ్వాసాన్ని యివ్వడానికి రాజయ్య ఎన్నుకొన్న మార్గం ఏమిటి? ‘పట్వారోని బెల్లపురంగు అప్పుకాయిదమో - షావుకారి తెల్లకాయిదమో - శిస్తు కాయిదమో - భూమిని తెగనమ్ముకొన్న కాయిదమో - ఓట్ల కాయిదమో - పోలీసు జవాను తెచ్చే సమను కాయిదమో తప్ప వేరే కాయిదం చూడని ప్రజల్లోకి, బతుకుల్లో కార్చిచ్చు పెట్టడానికి తప్ప ఓదార్చడానికి తోడ్పడని కాయిదాల్ని చూస్తే వనుకుపట్టీ కూలినాలన్నల దగ్గరికి - ఆ మురికి కొంపల్లోకి - ఆ ఎర్ర సెలుక దబ్బల్లోకి - ఆ మట్టి చేతుల్లోకి తన సాహిత్యం ఎలా వెళ్ళాలి’ అని ప్రశ్నించుకొన్న రచయిత అంతవరకూ వ్యవస్థీకృతమైన లిఖిత సాంప్రదాయ శృంఖలాలను ఛేదించి పాటతో పాటు కథని నవలని కూడా మౌఖికం చేశాడు. ప్రజలు రాజయ్య సాహిత్యాన్ని సమూహాల్లో చదివి వినిపించుకొన్నారు. లిఖిత నవల ‘శ్రవ్య నవల’ (పి.సి.నరసింహారెడ్డి) అయింది. నవలకి పాఠకులు తగ్గి శ్రోతలు పెరిగిన్రు (వరవరరావు). సాహిత్యం గొప్పవాళ్ళ మనోసృష్టి, సంపద అని స్థిరంగా పాతుకుపోయిన రివాజుని రాజయ్య బద్దలుకొట్టాడు. కేప్టలిస్టు సమాజంలో రూపొందిన సంక్లిష్ట సాహిత్య ప్రక్రియగా భావించే నవలని మౌఖికమూ, సామూహికమూ చేసి ప్రజాసాహిత్యానికి కొత్త దార్లు వేశాడు.
‘ప్రజల చెమటనుంచి, శ్రమనుంచి, ఉత్పత్తి క్రమంలో వారి జీవితానుభవాలనుంచి పుట్టిన భాషని వదిలేసి వేరే భాషలో (ప్రామాణికంలో) రాయడం చేతగాదనీ రాయవలసిన అగత్యం కూడా లేదని’ నిర్ద్వంద్వంగా చెప్పి తర్వాతి తరం తెలంగాణా ప్రజారచయితలకు మార్గదర్శకుడయ్యాడు. ‘సాహిత్యమంటే బతుకే బతుకని - ఆ బతుకుతోని పెనుగులాట అని, పొలాలు పంటచేలు ఆ పంట భూములకోసం, బువ్వకోసం విముక్తికోసం జరిపే జీవన్మరణ పోరాటాలనీ, అవి చెమట నుంచి నెత్తురు నుంచి పుట్టిన జీవభాషలో రాయచ్చనీ’ భరోసానిచ్చాయి రాజయ్య రచనలు. దాంతో పొలాల్లోంచి, కార్ఖానాల్లోంచి, బొగ్గుపొరల్లోంచి, అడవి కడుపులోంచి రచయితలు పుట్టుకొచ్చి ప్రజల సాహిత్యానికి మెరుగు పెట్టారు.
నిజానికి ప్రజల భాషలోని నుడికారాన్ని, నొక్కుని, యాసని అచ్చులోకి అనువదించడం చాలా కష్టమైన వ్యవహారం. రచయిత ఎంతో నేర్పు చూపినా నోటిభాష నాడిని రాత పట్టుకోలేదు. వినాల్సిన మాటల్ని చదవడంలో యిబ్బంది ఎదురవుతుంది. దుఃఖంతో బొంగుపోయిన మాట - జీరవోయిన గొంతు - చేరువైన గుండె - లుమ్మలు చుట్టుకొన్న కడుపు - మాటరాక పొడవుగా తీసే మొస - కళ్ళవెంట ఉబికే కన్నీరూ, తల్లోనే కందిరీగల తీరుగసాగే విచారమూ! క్రోధంలో రాసుకుపోయిన కంఠం - ఉబికిన రక్తనాళాలూ - వణికే పెదాలు - అదిరే ముక్కుపుటాలు - కరకుదనం మాత్రమే కన్పించి కనిపించని మనసులోని మార్దవం యిదంతా భాషలో భాగమే. దీన్నంతటినీ వినిపించడానికి, శిల్ప నైపుణ్యంతో దృశ్యమానం చేయడానికీ రచయిత ఎంతో జాగరూకుడై వుండాలి. ఈ భాషంతటినీ తనకు తెలిసిన జీవితంతో ముడివేసినపుడు మాత్రమే నిక్కమైన ప్రజాసాహిత్యం రూపొందేదీ. దీన్ని సాధించడానికి రాజయ్య చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. ఇదంతా మర్చిపోయి ‘మాండలికం’ అడ్డు పడుతుందని ప్రకటించడం, అసహనం ప్రదర్శించడం అనవగాహనన్నా కావాలి - ఆధిపత్యమన్నా కావాలి - లేదా రెండూ కావాలి.
కెన్యన్ రచయిత గుగీవాధియాంగో - ఇంగ్లీషులో రాయడం మానేసి అనేకమైన అణచివేతల మధ్య తన మాతృభాష గికుయూలోనే సాహిత్య సృష్టి చేస్తున్నాడు. భాషా సంస్కృతిక ఆధిపత్యాలపై ప్రకటనగా దాన్ని గుర్తించాలి. గుగి రాజయ్యకంటే పదేళ్ళు పెద్ద. కానీ గుగీ మాతృభాషలో రాయడానికి ఆరేడేళ్ళకు ముందే రాజయ్య తన సొంత భాషలో రాస్తానని ఖరాఖండిగా చెప్పాడు. సమస్త ఆధిపత్యాలపై పోరాటం ప్రకటించిన రచయితకి భాషాధిపత్యం కూడా దృగ్గోచరమైంది. రాజయ్య ‘కొలిమంటుకొన్నది’ రాస్తున్న కాలంలోనే ఆయన వాడిన భాష గురించి అనేక చర్చలు జరిగాయి. చెప్పిన విషయం మీద నుంచి భాషమీదకి దృష్టి మరల్చే వాళ్ల గురించి అప్రమత్తంగా వుండాలని రాజయ్య అప్పుడే హెచ్చరించాడు. ఇవ్వాళ తెలంగాణ భాషలో రాస్తున్న వాళ్ళందరూ రాజయ్య యిచ్చిన స్పూర్తిని మదిలో, యాదిలో వుంచుకోవాలి.
రాజయ్య నిబద్ధత ముందు వెలవెల బోయిన వాళ్ళు, అతని నిజాయితీకీ, శిల్ప విన్యాసానికీ విస్తుబోయి యీర్ష్యాళువులైన వాళ్ళు యివ్వాళ అప్పటి విప్లవ కథపై నవలపై బురదపూయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఆకాశం వైపు చూసి ఉమ్మడం లాంటిదే.
***
‘ప్రత్యర్థులు’ తర్వాత రాజయ్య రాయలేదు. ఈ ఖాళీకి కారణం ప్రపంచీకరణ వెల్లువలో గ్రామాల్లోకి కొట్టుకొచ్చిన చెత్తేకావచ్చు. ఈ చెత్త అతనికి ఊపిరాడనివ్వకుండా చేస్తూవుండొచ్చు. చెత్తలో నిప్పురవ్వపడి రాజుకున్నప్పుడు రాజయ్య రాయకుండా వుండలేడు. అందుకు ప్రజాసంఘాల వెన్నుదన్ను కూడా అవసరం. ఇంకా మిగిలివున్నదంతా పూర్తి కావాలన్న రాజయ్య కల సాకారం కావాలనే ఆ కలకంటున్న వాళ్ళందరి ఆశ.
(మార్చి 21, 2008న అల్లం రాజయ్య నవలా సాహిత్యం పై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విరసం నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం ఆధారంగా)
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
ఈ సమీక్షా వ్యాసం రాసింది ఎ . కె . ప్రభాకర్
Post a Comment