Tuesday, April 22, 2008

ఏటంచు మా ఊరు

ఏటంచు మా ఊరు
ఎండిన సముద్రమైపోయింది
మా గూడెం సూర్యుడు అస్తమించిన
కటిక చీకటి రాత్రై పోయింది.
రెక్కలు తెగి నేలరాలిన పక్షైపోయింది.
మా పల్లె కొమ్మలు తెగ నరికిన
అడవి తుమ్మల వనమైపోయింది.
నక్షత్ర గోళాలు విరిగి మీద పడ్డట్లు
తనువంతా నెత్తురు ముద్దై పోయింది.
ఛిధ్ర చిధ్రమైన ఆకాంక్షలతో
చితికి చితికి పోయింది మా పల్లె
మా కష్టం మాకు దక్కకుండా పోతుంది.
మా నీళ్ళు మాకు దొరకకుండా పోతున్నవి
మా పేగులు ఆకలి సంగీతాలు ఆలపిస్తున్నవి
మా గొంతులు తడారి పోతున్నవి
కడుపులో బాధలు లుంగలు చుట్టుకుపోతున్నవి
వాకిట్లో తలవాకిట్లో వాడల్లో వీధుల్లో
ఆకలి, రోగం, మృత్యువు, ఊరేగుతున్నవి.
తిరుగబడిన నా తల్లి నా పల్లె
ప్రపంచీకరణ చట్రంలో ఇర్గబడి మూల్గుతున్నది
ఆకలి పోరులో చిందిన మా నెత్తురు.
ఎండిన మా నేల నిండా పరుచుకుంటున్నది
కుక్క రాజకీయాల అవకాశవాద నక్క
ఎత్తులు జిత్తులు పొందులు పొత్తులు
మా ఓట్లు లాగేసుకొని
మమ్ముల్ని వంతులవారిగా వాటాలేసుకుని
పొందుగా పసందుగా పీక్కుతింటున్నవి
గద్ద మొఖపు బుడ్డ సారల టోపోనికి
మా దళారీలు దరువేస్తుండ్రు
ఊర్లకు ఊర్లు డాలరు నోట్లో కుక్కేస్తుండ్రు
ఊపిరి మెసలకుండా ముక్కు చెవులు
మూసేస్తుండ్రు
ఊపిరాడక ఉసూరుమని ఫీనిక్స్ పక్షివలె
చచ్చి కాలి కూలిన చితాభస్మం నుండి
చిగురించి బ్రతుకుతుంది మళ్ళీ మా ఊరు
మరణంలో మళ్ళీ జనిస్తుంది మా ఊరు
గుండెల్ని బొగ్గుట్టల్ జేసి మండించే
అవిశ్రాంత పోరాట బావుటై ఎగురుతుంది
జనం గుండెల్లో హిమాలయ పర్వతమై
మిగులుతుంది
మము గన్న మా పల్లె మా అమ్మ మా ఊరు.

No comments: