Tuesday, April 22, 2008

పదకోశం గురించి (4/4)

ఇంకా ఈ పదకోశం ఎలా తయారైందో కొన్ని మాటలు. ఇదొక పద్ధతి ప్రకారం చేసిన పని కాదు. కేవలం నా జ్ఞాపక శక్తి మీద ఆధారపడి తెలంగాణ పదాలను సేకరించాను. ఈ నాటి రెండున్నర జిల్లాల భాషకు పరిచయం కాని, అయినా అంతగా ప్రభావితం కాని నా చిన్న నాటి వాతావరణంలోకి వెళ్లి, జీవించి తెలంగాణ మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాను. గుర్తుకొచ్చిన పదాలను, పదబంధాలను, సామెతలను వెంట వెంటనే కాయితాల మీద రాసుకున్నాను. మళ్లీ వాటిని అకారాది క్రమంలో రిజిష్టరులో నమోదు చేశాను. (కార్డులు రాసుకుని వుంటే బావుండేది కానీ అనువాదాల నుండి దూరమై మొత్తంగా ఈ పనిలోనే కూరుకుపోతాననే భయంతో ఆ పని చేయలేక పోయాను). ఇట్లా పదజాలాన్ని గుర్తుకు తెచ్చుకునే క్రమంలోనే నాకు అందుబాటులో వున్న శ్వేతరాత్రులు, ఊటబాయి మొదలైన వచన సాహితీ సంపుటుల్ని చదివి మరికొన్ని సేకరించాను. కొన్ని పదాలను మిత్రులు కూడా సేకరించి యిచ్చారు. అయితే ఇది కేవలం ఆరు నుండి ఎనిమిది నెలల మధ్య కాలంలో తయారైన పదకోశం. ప్రెస్‌లోనే ఆయా అనేక కారణాల వల్ల ఒక ఏడాది పాటు వుండిపోయింది. “ఏనుగు ఎల్లింది తోక జిక్కింది” లే అని హాయిగా ఊపిరి తీసుకుందామనుకున్న ఆఖరు క్షణంలో మరో సాంకేతిక కారణంతో మళ్ళీ మొదటికొచ్చి మరలా కంపోజు చేయించాల్సి వచ్చింది. 13-7-2003 నాటి ‘తెలంగాణ రచయితల వేదిక’, కరీంనగర్ జిల్లా సభల్లో “ఆవిష్కరణ” జరగాలన్న ఒత్తిడితో అకారాది క్రమంలోనూ, యితరత్రానూ కొన్ని తప్పులు దొర్లాయి.

ఇక… ఈ కోశంలో తెలంగాణ పదాలకు అర్థాలు దాదాపు కోస్తా భాష (మధ్య మాండలికం)లో యివ్వబడ్డాయి. ఇక్కడి పదాలను యిక్కడి వాళ్ళకేగాక యితర ప్రాంతీయులక్కూడా పరిచయం చేయాలన్నది దీనికి ఒక కారణం. తెలంగాణలో వున్న పదజాలం అంతా ఇందులో వుంటుందేమో అన్న వాళ్లకు ఆశాభంగం తప్పదు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పదాలతో నాకు పెద్దగా పరిచయం లేదు. అందువల్ల ఈ కోశంలో అవి లేకపోవచ్చు. నా లక్ష్యం కేవలం ఐదు వేల పదాలతో పుస్తకం వేయడం. ఇప్పుడిది దాదాపు ఏడు వేల పదాలతో మీ ముందుకు వస్తున్నది. ఇందులో నేను యిచ్చిన అర్థాలవల్ల పదాలకు అర్థస్పూర్తి సరిగా కలగడం లేదనుకున్న సందర్భంలో ఉదాహరణలుగా వాక్యాలను యిచ్చాను. మరో విషయం…

ఈ పుస్తకంలోని పదాలకు సాధారణార్థాలు యివ్వలేదు. అవి అందరికీ తెలిసినవే! అందుకని విశేషమైన అర్థాలను మాత్రమే యిచ్చాను. ఇందులో వున్న పదాలు ఖచ్చితంగా తెలంగాణవే అని చెప్పడానిక్కూడా లేదు. ఇక్కడా, యితర ప్రాంతాల్లోనూ వుమ్మడిగా వున్న పదజాలంకూడా కోశంలో వుండడానికి వీలుంది. తెలంగాణ పదాలకు తెలిసినంత మేర అర్థనిర్ణయం చేశాను. తెలియనప్పుడు చేతులెత్తేసి ప్రశ్నార్థకం పెట్టేశాను. పద స్వరూపం సరిగా తెలిసినప్పుడు మాత్రమే అర్థాన్ని ఖాయం చేయగలం. పదస్వరూపం విషయంలో ఒకే జిల్లాలో అనేక రూపాలు గమనించాను. మరు వెండ్లి / మారు వెండ్లి, పీతాంబురం / పట్టు పీతాంబరం, కిర్మి / కిర్ము, శిప్పల పండు / సితపల్క పండు, పతానపుంగురం / పతానపుటుంగురం, పంచతం / పంచితం, పసాడం / పశాడం, సూత్ మార్కన్ / సూర్ మార్కాన్, పుల్లంగొయ్య / పిల్లంగొయ్య, సుట్టి / సుట్టు ఇలా ఆయా ప్రాంతాల్లో ఆయా పదాలు చలామణిలో వున్నాయి. కనుక భాషా దృష్టితో అన్నీ సాధు రూపాలుగానే భావించాలి.

తెలంగాణ ప్రజల వ్యవహారంలో మహాప్రాణాలులేవు కనుక ఈ కోశంలో వాటిని పరిహరించాను. పదాది హకార, వకారాలు అకారంగా పలుకుతారు కనుక అలాగే యివ్వడం జరిగింది. తెలంగాణ భాష అనగానే ‘ఉర్దూ’ గుర్తుకొస్తుంది. బహమన్లు, ఆసఫ్‌జాహీలు, కుతుబ్‌షాహీల పరిపాలన వల్ల తెలంగాణ భాషలో పర్షియన్, టర్కిష్, అరబిక్ భాషా పదాలు కలిసిపోయాయి. ఆ పదాలకు మూలాలు తెలిసినప్పుడు పక్కనే బ్రాకెట్టులో అవి ఏ భాషా పదాలో తెలిపే సంకేతాక్షరాలు (పర్షియన్ అయితే ‘ప’ అనీ, అరబిక్‌కు ‘అ’ అనీ, టర్కిష్‌కు ‘ట’ అనీ) యిచ్చాను. తెలియని సందర్భంలో వదిలేశాను. ఆంగ్ల భాషలోంచి వచ్చిన పదాలు యిటీవలివి కనుక వాటిని ప్రత్యేకించి ఏ అక్షరంతోనూ సూచించలేదు.

నిఘంటు నిర్మాణం లోతైన పని. అదొక బృహత్కార్యం. ఎంతో సున్నితమైన అంశం. ఇది ఒకరిద్దరితో అయ్యేది కాదు. అంకిత భావంతో కనీసం ఐదారుగురు ఒక దశాబ్దం పాటు సమిష్టిగా నెరవేర్చాల్సిన తపస్సు. ఇదొక సామూహిక సంపద. తెలంగాణ నలు చెరగులా వ్యయప్రయాసలకు ఓర్చి తిరిగి సేకరించవలసిన పద సంపత్తి ఎంతో వుంది. ఓపిక, సమయం, ఆసక్తి, ప్రేమ, ఆర్థికపరమైన వెసులుబాటు, ఆరోగ్యం, పరిశ్రమ, వ్యాకరణ భాషా సాహిత్యాదుల పట్ల లోతైన అవగాహన లాంటి అనేకానేక అంశాలతో ముడివడిన కార్యమిది. పైగా తెలుగు సంప్రదాయ నిఘంటవుల్లాగా తెలంగాణ నిఘంటు రచన నల్లేరు మీద బండి నడక కాదు. నాకయితే ఈ రంగంలో అనుభవమే లేదు. నేను వేస్తున్న ఈ పదకోశం ఒక చిత్తు ప్రతిలాంటిదే! ఈ రంగంలో యింతకు ముందు ఆచార్య రవ్వా శ్రీహరి (ప్రస్తుత ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు) నల్గొండ జిల్లా పదకోశం వేసి గొప్ప కృషి చేశారు. దాన్ని ఈ ఫిబ్రవరిలో చూశాను. వేముల పెరుమాళ్లు వేసిన “తెలంగాణ జాతీయాలు” అలాంటిదే!

చివరగా మరికొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఈ పదకోశాన్ని మరింత విస్తృతంగా వేస్తే బావుంటుందేమో అనుకున్న సందర్భంలో పెద్దలు ఆచార్య కోవెల సంత్కుమారాచార్య గారు చక్కని సలహా యిచ్చారు. ఇప్పుడున్న పరిమిత పదజాలంతో పుస్తకం వేయమనీ, తదనంతర కాలాల్లో యింకా అదనంగా సేకరించగలిగితే వాటితోనే అనుబంధం 1, అనుబంధం 2… యిలా వేసుకోవచ్చనీ ధైర్యం చెప్పారు. ప్రూఫ్‌ల దగ్గర్నించి పుస్తకాన్ని భుజాన వేసుకుని పదస్వరూప, అర్థ నిర్ణయ విషయాల్లో తోడ్పడి ఈ రూపంలో రావడానికి సాయం చేసిన వాళ్లిద్దరు. ఒకరు డా|| జి. లక్ష్మణరావు, మరొకరు తత్త్వాది ప్రమోద్ కుమార్.

మరొక్కమాట… నాకు తెలిసింది తక్కువ. తెలుసుకోవలసింది ఎక్కువ. తెలిసిందాన్ని తెలిసినట్లు నలుగురితో పంచుకోవాలన్న మక్కువ మాత్రం ఎక్కువ. సహృదయంతో యిందులో వున్న లోపాలు ఎత్తి చూపితే సవరించుకుంటాను. ఏది ఏమైనా తప్పులు నావి… గుణాలు తెలంగాణవి.

No comments: