విరసం సిటీ యూనిట్ ఆధ్వర్యంలో
తేది 21-3-2008 రోజున ప్రెస్‌క్లబ్ హైద్రాబాద్‌లో అల్లం రాజయ్య - నవలాసాహిత్యం-1 అంశంపైన ఒక రోజు సాహిత్య సమావేశం జరిగింది. అల్లం రాజయ్య రచించిన నవలల మొదటి సంపుటిలో 3 నవలలు ఉన్నాయి. ఈ మూడు నవలలపై సమగ్రమైన సాహితీ చర్చ జరిగింది.
మొదటి సెషన్లో ఎ.కె. ప్రభాకర్, రత్నమాల అల్లం రాజయ్య నవలాసాహిత్య వైశిష్ట్యంపై ఉపన్యసించారు. ఈ సమావేశానికి విరసం పినాకపాణి అధ్యక్షత వహించారు.
ఎ.కె. ప్రభాకర్ మాట్లాడుతూ రాజయ్య ఒడ్డున కూచొని రాసే రచయిత కాదని, ఉధ్యమాల నుంచి వచ్చి రాసి ఆ సాహిత్యాన్ని ప్రజలకు చేర్చాడని, మంచి టైం కీపర్ అని ఆయన సాహిత్య వికాసంలో చరిత్రగతిని రికార్డు చేసిన రచయిత అన్నారు. జరిగిన సంఘటనలకు సాహిత్యరూపాన్ని ఇవ్వడం గతితార్కిక వివేచనంలో అందరికన్నా ముందుండడం ఆయన ప్రత్యేకతలుగా వివరించారు. 1974-79 మధ్యలో గల పరిస్థితులు ఈ నవలలో కన్పిస్తాయి. ఈ రచయిత కేవలం వ్యాఖ్యాత కాదు, సాహిత్య రూపాన్ని మార్చిన వాడని, నవలలో కొత్త టెక్నిక్‌ను ప్రవేశపెట్టి కుహనా అభివృద్ధి చీకటి కోణాన్ని నాల్గు పంక్తుల్లో చెప్పాడు.
కొలిమంటుకొందన్న నవలలోని ”అందరికి ఆడికేస్తన్నం” అన్న చంద్రం మాటలతోనే కొలిమంటుకొన్నది.
రత్నమాల అగ్నికణంలోని బయ్యక్క పాత్ర దృష్టి కోణంలో మాట్లాడుతూ ‘అగ్నికణం రాయడం ఒక సాహసం’ అని అభివర్ణించింది. చలం అవుట్‌సైడర్‌గా చూసినదాన్ని రాజయ్య ఇన్‌సైడర్‌గా స్త్రీలపై లైంగిక వేధింపులను ఇతర అంశాలను ఈ నవలల్లో వివరించారు.
పినాకపాణి మాట్లాడుతూ 1970లో మొదలైన ప్రజాఉద్యమాల ప్రేరణతో అల్లం రాజయ్య సాహిత్య రంగంలోకొచ్చారన్నారు. ఆ ఉద్యమాల గెలుపోటముల గురించి కాకుండా అవి దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఉద్యమాలను ఎలా నిర్మిస్తాయో అంచనా కట్టాలంటే అల్లం రాజయ్య సాహిత్యం ఉపయోగపడుతుందన్నారు.
కొలిమంటుకొంది నవల ఒక ప్రక్రియ అని, అగ్నికణం గుణాత్మకమైన మార్పును సూచించే నవల అని, సబ్జక్ట్కీ ఆబ్జక్ట్కీ మధ్య గల సంబంధాన్ని సాహిత్యం ఎలా చూస్తుందనే దానిని అల్లం రాజయ్య చూపిన దృష్టికోణాన్ని పినాకపాణి ఆవిష్కరించారు.
అల్లం రాజయ్య ఈ నవలలో నిజాయితీ శిల్పం. అగ్నికణం నవలలోని స్త్రీ పాత్రలలో ఎసర్టీవ్, సాధికారకత ఎక్కువ వ్యవసాయరంగ స్త్రీలలో ఇది ఇంకా ఎక్కువ. పితృస్వామ్య ఆధిపత్యం స్త్రీల పైనే కాక అట్టడుగు వర్గాల మగవారిపై కూడా ఉంటుందని నర్సయ్య పాత్ర ద్వారా సూచించాడని రత్నమాల విశ్లేషించారు.
స్త్రీల లైంగిక అణచివేతల మీద సామాజిక రాజకీయా అంతర్గత బహీర్గత సాహిత్య ప్రతిఫలన ఈ నవల. అగ్నికణంలోని బయ్యక్క పాత్ర తెలుగు సాహిత్యంలో ఒక శాశ్వత జ్ఞాపకంగా నిల్చిపోతుంది.
సెంట్రల్ యూనివర్సిటి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థ గురించి ”ఊరు” నవలలో అల్లం రాజయ్య చిత్రించిన తీరును కొనియాడారు. ప్రజల అనుభవాలను చిత్రీకరిస్తే హీరో ఉండడు. ఈ విధానం టాల్‌స్టాయ్ వార్ - అండ్ పీస్‌లో కనిపిస్తుంది అన్నాడు. మనిషి క్రైసిస్‌లో ఉన్నప్పుడు, అతడు నిలబడ్డతీరు ఆ మనిషి డెప్త్‌ని బట్టి ఉంటుందన్నారు. రాజయ్య భాషా చిత్రీకరణ గురించి మాట్లాడుతూ ప్రజలు మాట్లాడుకునే భాషను విముక్తి సాధనంగా చూడాలన్నారు.
రాయలసీమలో కూడా ఎంతో కాలంగా హింస ఉంది. అయినా ఇంతకాలంగా అక్కడ ఇలాంటి రచనలు రాలేదు. ఎందుకంటే అక్కడ ఉద్యమం, లేక హింసలో మానవీయ కోణం లేదు. ఇక్కడి ఉద్యమంలో త్యాగాలు మానవీయ విలువలు అంతర్లీనంగా ఉన్నాయి.
అల్లం రాజయ్య సోదరుడు ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తన సోదరునితో గల అనుబంధాన్ని, అల్లం రాజయ్య రాసిన నవలకు గల సంబంధాన్ని వివరించారు. ప్రత్యేక తెలంగాణా 1969 విద్యార్థి ఉద్యమం అందించిన సృజనాత్మకత, క్రియాశీలత అల్లం రాజయ్యకు అంది ఉండవచ్చన్నారు. వరంగల్‌లో సృజన సాహితీ మిత్రమండలి సాంగత్యం, మంథని చుట్టుప్రక్కలగల ప్రజాఉద్యమాల నేపథ్యం ఆయన సాహిత్య ప్రేరకాలు అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment