Tuesday, April 22, 2008

ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన పి.జె.ఆర్‌

పి.జె.ఆర్‌.గా హైదరాబాద్‌ నగర ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన పి. జనార్ధన రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒక చారిత్రిక సందర్భంలో హఠాత్తుగా మన మధ్యలోంచి వెళ్లిపోవటం నగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక పెను విషాదం. పూరించలేని ఒక లోటు. తెలంగాణ తల్లి కన్న ముద్దు బిడ్డ. తెలంగాణకు జర్గుతున్న అన్యాయలపై, వివక్షతలపై అలుపెరగకుండా, మడమ తిప్పకుండా తాను పోరాడటమే గాదు తెలంగాణ ప్రజా సంఘాలకు తన మద్దతును, సంఘీభావాన్ని తెలిపాడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనల్ని, 610 జివో అమలు వైఫల్యాలని ఎండగడుతూ తెలంగాణ ఉద్యోగుల సంఘం వేదికలపై నుంచి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, జిల్లాలలో నిర్వహించిన సదస్సుల్లో ముఖ్య అతిథిగా హాజరయి సంఘం చేస్తున్న పోరాటాలకు మద్దతుగా నిలిచాడు. ప్రతి సంవత్సరం సంఘం వెలువరించే ‘తెలంగాణ డైరీ’ ఆవిష్కరణలకు విధిగా హాజరయి ఉద్యోగులని ఉత్తేజపరిచాడు. జనవరి 6, 2008న జరిగే ‘తెలంగాణ డైరీ 2008′ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండే.

పోతిరెడ్డి పాడు తూములు పెంచి కృష్ణా నీళ్లను తరలించుకుపోతే హైదరాబాద్‌ నగరం మంచినీటి కరువును ఎదుర్కొంటుందని, తెలంగాణ అన్యాయమైపోతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల పక్షాన విమర్శిస్తూనే ఉన్నాడు. హైదరాబాద్‌లో అక్రమ భూముల పందేరాన్ని, ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకించాడు. పేదలకు నివాస స్థలాల కోసం నిరంతరం శ్రమించాడు. నగర ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకున్నాడు. పేద ప్రజలకు కొండంత అండ ఇక లేరు.

తెలంగాణ టైమ్స్‌ ప్రారంభ సంచికను ఆవిష్కరించిన పి.జె.ఆర్‌. మా ప్రేరణ. ఆ మహానాయకుడికి, ప్రజల మనిషికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం కావాలని తపించే తెలంగాణ తల్లి బిడ్డ పి.జె.ఆర్‌కు ఆశ్రుతప్త హృదయాలతో జోహర్లు ఆర్పిస్తున్నాం. వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పి.జె.ఆర్‌. ఆశయ సాధన కోసం ఆయన మాకిచ్చిన స్ఫూర్తితో ముందుకు నడుస్తాం. పి.జె.ఆర్‌ అమర్‌ హై

తెలంగాణ అచ్చే దాకా తెగించి కొట్లాడుడే

2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తానని వాగ్దానం చేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలని సొమ్ము చేసుకొని ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్‌ ఏకాభిప్రాయ సాధన పేరు మీద నాలుగేండ్లు కాలాయాపన చేసింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఇప్పటికిప్పుడు 450 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. అయినా కాంగ్రేస్‌ మాత్రం గోడమీద పిల్లి వారం ఏ వైఖరి ప్రదర్శించకుండా రెండో ఎస్సార్సీ అంటూ మరో మోసానికి సిద్దపడుతున్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రేస్‌ మోసాన్ని, వంచనని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు తప్పనిసరై రాజీనామాలకు టిఆర్‌ఎస్‌ సిద్దపడింది. 23 మంది టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలు చేయడం అపూర్వమైన చారిత్రిక సన్నివేశం. ఇక ప్రజాక్షేత్రంలోనే తెలంగాణ అంశాన్ని తేల్చుకుందామని టిఆర్‌ఎస్‌ భవిష్యత్‌ కార్యచరణ రూపొందించుకుంటున్నది. వారి అపూర్వమైన పదవీ త్యాగాన్ని తెలంగాణ ప్రజానీకం హృదయపూర్వకంగా స్వాగతించింది. ప్రజల దీవేనలు ఎప్పుడైనా త్యాగధనులకే దక్కుతాయన్నది జగద్వితమే. ఈసందర్భంగా తెలంగాణ టైమ్స్‌ రాజీనామాలు చేసిన టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను అభినందింస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నది. హైదరాబాద్‌లో 11 మార్చి 2008 (మంగళవారం) రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగులింగంపల్లిలో జరుగుతున్న తెలంగాణ ప్రజా సంఘాల ‘సంఘీభావ సభకు- తెలంగాణ ధూంధాంకు ‘ తెలంగాణ టైమ్స్‌ మద్దతు ప్రకటిస్తున్నది.
సంపాదక వర్గం

No comments: