Wednesday, April 23, 2008

“హబ్సిగుడా - తీన్‌మార్”

చావూష్‌ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్ళందరూ అఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్, అబిసీనియాలకు చెందినవాళ్ళు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్ళను ‘హబ్సీ’లు అని కూడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్ళకు సంబంధించినదే. వీళ్ళను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు అనగా చావూష్‌లు హైద్రాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.

రెండు వందల సంవత్సరాల క్రింద వనపర్తి సంస్థానం నైజాం సంస్థానంల ఒక ముఖ్యమైన ఉపసంస్థానం. దీని మొదటి రాజు ‘రాజా రామేశ్వర్రావ్’ తన సంస్థానం పకడ్బందీ రక్షణ కోసం పటిష్టమైన సైన్యాన్ని రూపందిచుకోవాలని బొంబాయి బానిసల సంత నుండి కొంత మంది స్త్రీపురుష నీగ్రో బానిసలను కొనుగోలు చేసి వనపర్తికి బందీలుగ పట్టుకొచ్చి వారితో ప్రత్యేక సైనిక పటాలాన్ని తయారు చేసినాడు. ఆ నీగ్రో బానిసలంత ఆఫ్రికా అశ్వాల వలె బలిష్ఠులు, అఫ్రికా సింహాల వలె ధైర్యవంతులు. కాలక్రమంల వారి సంతతి తామరతంపరగ అభివృద్ధి చెంది వారి జనాభా కొన్ని వందలకు చేరుకున్నది. మొదటి దశల సంస్థాన రక్షణకు వళ్ళు బాగా ఉపయోగపడినా తర్వాత కాలంల వాళ్ళు తలనొప్పిగా మారినారు. ఆ చిన్న సంస్థానంల వారిని పోషించడం, అదుపుల పెట్టడం తర్వాత వచ్చిన సంస్థానాధీశులకు తలకుమించిన భారమయ్యింది. గుర్రాల వలె బలిష్టులైన వారికి కామతృష్ణ హెచ్చు కావున స్థానికులకు వారు ప్రమాదంగ పరిణమించినారు. చివరికి విధిలేక వనపర్తి రాజావారు వళ్ళందరినీ ఒక శుభముహూర్తంల నైజాంకు నజరానాగ సమర్పించుకుని చేతులు దులుపుకున్నడు. నైజాం వాళ్ళందరితోటి ప్రత్యేకమైన ఆశ్వికదళాన్ని రూపొందించినాడు. వాళ్ళనే తరువాత ఆఫ్రికన్ కావల్రీ గార్డ్స్ అన్నరు. వాళ్ళ కోసం నైజాం ప్రత్యేక నివాసస్థలాన్ని ఏర్పాటు చేసినాడు. అదే ఈనాటి ఎ.సి.గార్డ్స్ ఏరియా, మాసబ్‌టాంక్‌లోని మహావీర్ హాస్పిటల్ వెనుక భాగమే ఈ ఎ.సి.గార్డ్స్ బస్తీ, వారి సంతతి ఇప్పటికీ అక్కడనే నివసిస్తున్నరు.

ఈ చావూష్‌ల హైద్రాబాద్ నగరానికి అందించిన తమదైన విలక్షణ సంస్కృతిల ముఖ్యమైంది ‘తీన్ మార్ వాయిద్య సంగీతం’. అది ఒక రకమైన డప్పు. ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన వాయిద్య పరికరం. ఇప్పటికీ పెండ్లిండ్లలో ఉత్సవాలలో శుభసంతోష సందర్భాలలో ఈ ‘టుమ్కీ’ని బజాయిస్తుంటరు. దీని శబ్దం భీకరంగ, ఉత్తేజంగ ఉంటది. వినేవారిని పరవశుల్ని గావించి వారిచే చిందులు వేయిస్తది. హిందువులు కూడ ఈ తీన్‌మార్ వాయిద్యాన్ని ఆరాధిస్తరు. దీపావళి పండుగ తెల్లారి యాదవులు ‘సదర్’ (యాదవుల కులసభ) మేళాను జరిపే సంధర్భంల ఈ తీన్‌మార్ డప్పులకు అనుగుణంగ తలలకు శమ్లాలు చుట్టుకుని, చేతులల్ల పొడుగైన లాఠీలను పట్టుకొని రకరకాల సాముగరిడీలు, విన్యాసాలు చేసుకుంట చిందులు తొక్కుకుంట అందంగ అడుగులు వేసుకుంట ‘దద్దడ్ కీ దద్దడా, దద్దడ్ కీ దద్దడా’ అని నాట్యం చేస్తరు. హిందీ సినిమాలకు కూడ ఈ తీన్‌మార్ సంగీతం ప్రాకడం విశేషం.

ఎక్కడి ఆఫ్రికా? ఎక్కడి బొంబాయి బానిసల సంత? ఎక్కడ వనపర్తి సంస్థానం? ఎక్కడి హైద్రాబాద్? చావూష్‌లు హైద్రాబాద్ నగర సంస్కృతిలో పాన్‌సుపారీ లాగ కలిసిపోయినారు.

ఢిల్లీ మీద అహమ్మద్ షా అబ్దాలీ, నాదిర్‌షాలు దండెత్తి నగరాన్ని నేలమట్టం చేసి జనజీవనాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు, 1857 లో సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అనేకమంది ప్రజలు కాందీశీకులుగ వింధ్య పర్వతాలు, నర్మదానదిని దాటి దక్షిణ ముఖద్వారంలో ఉన్న హైద్రాబాద్ నగరానికి చేరుకుని ఆశ్రయం పొందినారు. హైద్రాబాద్‌లోని శాంతిసిస్థిరతలు వారిని ఆకర్షించినాయి.
అట్ల హైద్రాబాద్‌ నగరం ప్రపంచ నాగరికతల విభిన్న సమ్మేళనానికి చౌరస్తాగ నిలబడింది. చార్‌మినార్‌గ అవతరించింది. అందరికి అమ్మగ, అన్నపూర్ణగ మారింది. అనేక జాతుల వారికి అనేక ప్రాంతాలవారికి ఆశ్రయమిచ్చింది. అక్కున చేర్చుకుంది. ‘సల్లగ బతుకుండ్రి బిడ్డా’ అని దీవనార్తెలు ఇచ్చింది. ఏ దేశమైతేనేం? ఏ జాతి ఏ మతమైతేనేం? ‘మానవుడా, మానవుడా’ అంటూ అందరినీ తన చల్లని ఒడిలకు తీసుకుంది. హైద్రాబాద్ ఒక మినీ భారతదేశంగ రూపొందింది. ‘జో జిస్సే మిలా సీఖా హమ్‌నే - గైరోంకో భీ అప్నాయా హమ్‌నే’ ( ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం - పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం ) అని ఆనంద గీతికలు పాడింది. ఇది హైద్రాబాద్ గోప్పతనం !

( లోకేశ్వర్ రాసిన ‘సలాం హైద్రాబాద్’ పేజి 29-31 నుంచి )

No comments: