- తిరుమల రామచంద్ర
తెలంగాణ చరిత్ర బుద్దుని సమకాలీన చరిత్ర. నిజామాబాద్ జిల్లాలోని నేటి బోధన్‌లో బవరి అనే విద్యాంసుడు ఉండేవాడు. అతడు బుద్దుని చరిత్రను కర్ణాకర్ణికగా విన్నాడు. బుద్దుని తథాగతి - సత్యమార్గం - అతనికి నచ్చింది. తన శిష్యులను బుద్దుని దర్శించి, అతని అష్టాంగ మార్గాన్ని ఆకళించుకొని రమ్మని రాజగృహానికి పంపాడు. వారు బుద్దుని సన్నిధానంలో కొంతకాలం ఉండి, అతని తథాగతిని యథావత్తుగా గ్రహించి బోధన్‌కు తిరిగి వచ్చారు. సంతృప్తితో బవరి పండితుడు ఆ మార్గాన్ని అనుసరించాడు. ప్రజలలో ప్రచారమూ చేశాడు. బుద్దుని సమకాలంలోనే అతని ఉపదేశాలు వేలమైళ్ళ దూరంలో ఉన్న తెలంగాణ ప్రజలను ప్రభావితం చేశాయన్నప్పుడు మంచిపట్ల వారి అభిముఖ్యం ఎంత నిశితమైందో మనం అంచనా వేయవచ్చు.
ప్రాగైతిహాసిక యుగం
తక్కిన ఆంధ్రదేశంతో పాటే తెలంగాణాను ప్రాగైతిహాసిక కాలంలో మానవుడు మూడులక్షల సంవత్సరాల నుంచి నివసిస్తున్నట్లు తెలుస్తున్నది. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలో జరిగిన తవ్వకాలలో శిలాయుగపు ఆయుధాలు, పరికరాలు లభించాయి. డోర్లగల్లు - ఆత్మకూరు కనుమ దగ్గర శిలాయుగ పరికరాల పరిశ్రమ విశేషంగా సాగింది. తెలంగాణ ఆదిమానవుడు శిలాయుగం నుంచి మరికొంత ముందడుగు వేసి, నూతన శిలాయుగంలో ప్రవేశించి, ఆహరాన్ని పండించుకొని దేశ దిమ్మరితనం తగ్గించుకొని కొండమీద, కొండ ఆడివారాలలోను నివాసాలు ఏర్పరచుకొన్న చిహ్నాలు కూడా వరంగల్లు, నల్లగొండ జిల్లాల్లో తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరికొంత సభ్యత ఏర్పడిన తర్వాత తెలంగాణ మానవుడు లోహయుగంలో ప్రవేశించి కంచు, ఇనుము పరికరాలను నిర్మించుకొన్నాడనడానికి తెలంగాణా అంతటా ముఖ్యంగా వరంగల్లు, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోని “రాకాసి గుళ్ళు” నిదర్శనం.
చరిత్రయుగం తెలంగాణాలో బౌద్దంతో ప్రారంభమయింది. బోధన్ శాతవాహనులకు ముందే, శుంగకాణ్వుల కాలంలోనే ప్రసిద్ధమైంది. ఇది అస్మక దేశంలోని ప్రధాన పట్టణాలలో ఒక్కటి. అక్కడి నుంచి తెలంగాణా అంతటా బౌద్ధం వ్యాపించింది. గుమ్మడిదుర్రు, ఫణిగిరి మున్నగు ప్రాంతాలలో జరిగిన తవ్వకాలలో వెలువడిన బౌద్ధ స్తూపావశేషాలు, బుద్ధ విగ్రహాలు ఈ వ్యాప్తికి నిదర్శనం, ఆంధ్రబౌద్ధులలో తర్వాత ఏర్పడిన చైత్యక, అపరశైలేయ, రాజగిరీయాది శాఖలలో రాజగిరీయులు రాచకొండవారయి ఉంటారని లేక యాదగిరిగుట్ట ద్వారమైన రాయగిరివారు అయినా కావచ్చునని తెలుగుభాషా సమితి విజ్ఞాన సర్వస్వం ప్రధాన సంగ్రాహకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు భావిస్తున్నారు.
బోధన్ పట్టణం, తర్వాత జైనమతానికి కూడా ఆటపట్టయింది, అక్కడి నుంచే జైనం కొలనుపాక మున్నగు ప్రాంతాలకు వ్యాపించింది. బోధన్‌లో గొప్ప గోమటేశ్వర విగ్రహం ఉండేదని, దానిని చూచిన తర్వాతనే హొయసళుల కాలంలో శ్రవణ బెళగొళ గోమటేశ్వర విగ్రహం వెలసిందని అంటారు.
మరొక సంగతి, జైనులు ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా మొదట ఒక సరోవరం తవ్వించేవారు. దాని తీరంలో తీర్థంకరుల విగ్రహాలు స్థాపించేవారు. కొలనుపాక, అంటే కొలను వున్న పాక-వూరు. కొలనున్న జైనుల పర్ణశాల అని అర్ధం. దీనికి ప్రతికృతి అయిన శ్రవణ బెళగొళ జైన శ్రమణుల కొలను. కొలనుపాకలో మేఘచంద్రాది ప్రసిద్ధ జైనాచార్యులున్నట్టు జైనుల మతగ్రంథమైన అనంతపాసాదిక తెలుపుతున్నది. కాని బోధన్‌లోని గోమటేశ్వరుని విగ్రహం జాడ తెలియదు. జైన శైవ సంఘర్షణలో ముక్కలు ముక్కలయిందేమో! కొలనుపాకలో మాత్రం జైన తీర్ధంకరులలో ఒకడైన వృషభనాథుని పచ్చరాతి విగ్రహం నేటికి పూజలందుకుంటున్నది.
సాతవాహనులు
సాతవాహనుల కాలం నుంచి తెలంగాణా చరిత్ర స్పష్టంగా తెలుస్తున్నది. తెలంగాణ సాతవాహనుల ఏలుబడిలోకి వచ్చినట్లు మెదక్ జిల్లా కొండాపురం, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, ధూళికట్ట, నల్లగొండజిల్లాలోని సూర్యాపేట, ఫణిగిరి, వర్ధమానుకోట మున్నగు చోట్ల జరిగిన తవ్వకాలలో సాతవాహన చక్రవర్తుల నాణేలు, మట్టిబొమ్మలు, మట్టిపాత్రలు మున్నగునవి లభించడం నిరూపిస్తున్నవి. ఇటీవల 1982 అక్టోబరు నెలలో రాష్ట్ర పురాతత్త్వశాఖ డైరెక్టరు డాక్టర్ కృష్ణశాస్త్రిగారు నల్లగొండజిల్లా, తుంగతుర్తి తాలూకా వర్ధమానుకోటలో కోటదిబ్బ అనే ప్రాంతంలో జరిపిన పరిశోధనలలో సాతవాహనుల కాలపు నిర్మాణాలు వెలువడ్డాయి. సీసంతో తయారయిన వర్తులాకారపు నాణేలు లభించాయి. వాటిపైన, మధ్యన గుర్రం, చుట్టూ బ్రాహ్మిలిపిలోని శాసనం “మహాతలవరస వాజసామికస సవస…” అని ఉన్నాయి. ఈ నాణేల వంటి మట్టిముద్రికలు కరీంనగర్ జిల్లా పెద్దబంకూరు త్రవ్వకాలలో దొరికాయి. దీనినిబట్టి క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాలలో కరీంనగర్, వరంగల్, నల్లగొండజిల్లా ప్రాంతాలను మహా తలవర బిరుదాంచితులైన వాజసామికులు, ఆశ్వపతి వంశీయులు, సాతవాహన సామంతులు పాలించి ఉంటారని డాక్టర్ శాస్త్రి అభిప్రాయపడు తున్నారు. జనగామ నుంచి సూర్యాపేట మార్గంలో ఇంతకు ముందు ఫణిగిరి, తిరుమలగిరి, గాజులబండ వద్ద బౌద్ధ క్షేత్రాలు కనుగొన్నారు. మధ్య భారతదేశం నుంచి బౌద్ధ యాత్రికులు వర్దానది నుంచి ప్రాణహితానది ద్వారా గోదావరిదాటి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలు చేరేవారు. అక్కడి నుండి పాషిగాం అనే గ్రామం వద్ద (కనుగొన్న) బౌద్ధక్షేత్రం దర్శించి, ఫణిగిరి చేరేవారని తెలుస్తున్నది. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ పయనించిన మార్గం ఇదేనని స్పష్టమవుతున్నదని డాక్టర్ కృష్ణశాస్త్రి అభిప్రాయపడుతున్నారు.
సాతవాహన చక్రవర్తులలో 17వ వాడైన హాల సాతవాహనుడు తన కాలపు కవుల ముక్తకాలను 700 లను ఏర్చి దండగా కూర్చాడు. దీనిపేరు గాథాసప్తశతి. దీనిలోని అల్లయవంటి పేర్లు చూడగా వారు తెలుగువారయి ఉంటారేమోననిపిస్తుంది. సప్తశతిలోని గోదావరి ఒడ్ల శృంగారాలు, జనుపచేలు, పత్తిచేలు, కుసుమచేలు, కుండల కపిల బావులు చూడగా తెలంగాణా ప్రాంతం సుందర ప్రతిరూపమా అనిపిస్తుంది.
తవ్వకాలు జరిగిన ప్రాంతాలలో కొండాపురానికి విశిష్ఠత ఉంది. కొండాపురం హైదరాబాదుకు వాయవ్యంగా 43 మైళ్ళ దూరంలో మెదక్ జిల్లా కలబగూడు తాలూకాలో ఉంది. ఈ గ్రామానికి అరమైలు దూరంలోని ఒక వాగు చెరువులో కలిసే ప్రాంతంలోని ఒక దిబ్బను త్రవ్వారు. మానవ జీవితానికి సంబంధించిన సకల వస్తువులూ, ఇళ్ళ పునాదులు చైత్యాలతో సహా బయటపడ్డాయి. కొండాపురం చాలా ప్రాముఖ్యం గల ఆంధ్ర సాతవాహన కేంద్రమయి ఉంటుందని, గ్రీకు రాయబారి మెగస్థనీస్ చెప్పిన ముప్పయి ఆంధ్రమహా నగరాలలో ఒకటయి ఉంటుందని విశ్వసించడానికి తగిన ఆధారాలు దొరికాయి. పురాణకాలపు కుండిన నగరం ఇదేనని కొందరి వూహ. గౌతమీ పుత్రశాతకర్ణి, వాశిష్ఠీపుత్ర పులమావి నాణేలు లభించడం వల్ల ఈ ప్రాంతం, తెలంగాణలో చాలా ప్రాంతం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం మొదలు క్రీస్తుశకం 218 తర్వాత వరకు సాతవాహనుల ఏలుబడిలో ఉంది.
సాతవాహనుల పిదప తెలుగుదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు, బృహత్పలాయన, ఆనందగోత్రుల పరిపాలన తెలంగాణలో ఉన్నట్టు కనిపించదు. సాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఎవరికి వారు స్థానికులు మహాతలవరులై ఉంటారు. అభీరులు కొంతప్రాంతం, ఇక్ష్వాకుల సామంతులుగా పాలించినట్టు అభీరవసుషేణుని శాసనంవల్ల తెలుస్తున్నది.
తర్వాతి రాజులు
పిదప తెలుగుదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలంలో తెలంగాణలో నల్లగొండ మున్నగు ప్రాంతాలు వారి ఆధీనంలో ఉన్నట్టు తోస్తుంది. నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాలపురం వారి రాజధాని. వీరికి వాకాటులతో సంబంధ బాంధవ్యాలున్నందున మెదక్, నిజామాబాద్ ప్రాంతాలు వాకాటుల పాలనలో ఉండేవి. ఇటీవల కీసరగుట్ట త్రవ్వకాలలో వెలువడ్డ అవశేషాలను బట్టి విష్ణుకుండినుల పాలన వాకాటుల సరిహద్దువరకు ఉండేదని స్పష్టం. సరిహద్ధులలో ఎవరూ రాజధాని నిర్మించుకోరు గదా! కనుక ఇంద్రపాలపురి వారి రాజధాని. ఈ వంశరాజులో ఒకడయిన ఇంద్రవర్మ పేరుతో ఈ నగరం వెలసి ఉండవచ్చు.
మహబూబ్‌నగర్ జిల్లా, తత్పరిసరాలను ‘చోళవాడి’ అనేవారు. చోళుల కాలం క్రీస్తుశకం 480 ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇది కొంత కాలం చోళుల అధీనంలో ఉండి ఉంటుంది.
విష్ణుకుండినుల అనంతరం తెలంగాణలో చాలాభాగం బాదామీ చాళుక్య, రాష్టక్రూట, కళ్యాణి చాళుక్యుల ఏడుబడిలో ఉంది. కళ్యాణి చాళుక్యులు, రాష్ట్ర కూటులు దుర్బలులయిన తర్వాత సామంతులు కొందరు స్వతంత్రులై స్వీయరాజ్యాలు స్థాపించారు. అట్టివారు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులూను. వీరిలో మొదటి ఇద్దరు సామ్రాజ్యాలు స్థాపించలేకపోయారు. కాకతీయులు క్రీస్తుశకం 1158 నుంచి 1323 వరకు 165 సంవత్సరాలు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించారు.
ముదిగొండ చాళుక్యులు
బాదామీ చాళుక్వవంశం వాడైన రెండవ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు క్రీస్తుశకం 624లో పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి వేంగీకళింగాలను జయించి, తన సోదరులు కుబ్జ విష్ణువర్ధనుణ్ని పిష్టపురం (పిఠాపురం)లో వేంగీరాష్ట్రానికి, రణమర్ధనుని ముదిగొండ రాజ్యానికి రాజ ప్రతినిధులుగా నియమించాడు. ఈ వంశం వారు తమ తమ ప్రాంతాలలో స్ధిరపడినా, ముదిగొండ రాజ్యం వారు వేంగీ చాళుక్యులకు లోబడే వుండేవారు. కాని చాళుక్య భీముని, రెండవ భీముని కాలాలలో ముదిగొండ పాలకులు రాష్ట్ర కూటుల వల్ల చాల నష్టపడ్డారు. వీరి రాజ్యం రాష్ట్ర కూటుల రాజ్యానికీ, వేంగీ రాజ్యానికి మధ్య ఉన్నందున రాష్ట్ర కూటులు వేంగీపై దాడి జరిపినప్పుడెల్లా ముదిగొండ రాజ్యానికి చాలా నష్టం కలిగేది. ముదిగొండ రాజ్యం నేటి ఖమ్మంజిల్లా ప్రాంతం. కృష్ణాతీరంలోని కొండపల్లి నుంచి వరంగల్లు జిల్లాలోని కొరవి వరకు వ్యాపించి ఉండేది. రాష్ట్ర కూటుల, చాళుక్యులకు సహజ శత్రువులు కనుక తూర్పు చాళుక్య రాజ్యాన్ని మింగడానికి సిద్ధంగా ఉండేవారు. వేంగీలో రెండవ అమ్మరాజు రాజ్యకాలంలో అతనికి, సవతి అన్న అయిన దానార్ణవునికి సంఘర్షణ వచ్చింది. తిమ్మరాజు రాష్ట్ర కూట కృష్ణుణ్ణి సహాయం కోరాడు. ఇలాంటి అదనుకోసమే కాచుకున్న రాష్టక్రూట చక్రవర్తి తన సేనాపతి అయిన కాకతీగుండ సేనానిని దానార్ణవుని మీదికి పంపాడు. గుండసేనాని ముదిగొండవారి రాజ్యం ఆక్రమించుకొన్నాడు. పిదప వచ్చిన మార్పులో ముదిగొండ చాళుక్యులు రాజ్యం మరల సంపాదించుకొన్నారు. ముదిగొండరాజులు, కాకతీయులు పశ్చిమ చాళుక్యులకు లోబడే కలతలు లేకుండా ఉండేవారు. కాని, కాకతీయరుద్రుడు స్వతంత్రుడైన పిదప ముదిగొండ చాళుక్యులను పూర్తిగా వోడించి, ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ముదిగొండ చాళుక్యులు కొంత కాలం కోస్తా ప్రాంతంలో కొలని రాజుల ఆశ్రయంలోగడిపి, మరల భద్రాచల ప్రాంతంలో స్వతంత్రులుగా తల ఎత్తారు. కాని, కాకతి గణపతి దేవుడు వారిని పూర్తిగా అణచివేసాడు.
పొలవాస రాజులు
ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని పొలాస గ్రామాన్ని పూర్వం పొలవాస అనేవారు. ఇక్కడి సామంతులు క్రీస్తుశకం 1075 నుంచి 1160 వరకు చిన్న రాజ్యం పాలించారు. వీరి రాజ్యంలో జగిత్యాల, మంతెన, ములుగు, పర్కాల, నర్సంపేట తాలూకాలుండేవి. వీరు రాష్ట్ర కూటులు. వీరికి, పొరుగున ఉండే కాకతి రాజులకు బద్దవైరం. క్రీస్తుశకం 1127 లో భూలోకమల్ల సోమేశ్వరుడు చాళుక్య సామ్రాజ్యనికి చక్రవర్తి అయినప్పుడు అతని తమ్ముడైన యువరాజు తైలవుడు కందూరునాడులో రాజప్రతినిధి. ఇతడు స్వాతంత్య్రం ప్రకటించుకొన్నప్పుడు పొలవాస సామంతులు మేడరాజు, గుండరాజు చక్రవర్తిని ధిక్కరించి, తైలవుని సమర్ధించారు. 1138లో భూలోకమల్లుని కుమారుడు జగదేకమల్లుడు చక్రవర్తి అయి, తెలంగాణాలో చెలరేగిన విప్లవాన్ని అణచడానికి స్వయంగా తరలి వచ్చాడు. కాకతి ప్రోలరాజు చక్రవర్తి పక్షాన పొలవాస గుండరాజును యుద్దంలో చంపాడు. కందూరు నాడంటే జడ్చెర్ల సమీపంలోని కందూరు. ఇది పూర్వం ఒక ప్రాంతానికి ముఖ్యపట్టణం. ఇక్కడ పశ్చిమ చాళుక్యుల రాజప్రతినిధిగా తైలవుడు ఉండేవాడు.
వేములవాడ చాళుక్యులు
వేములవాడ చాళుక్యుల మూలపురుషుడు కూడా బాదామి సత్యాశ్రయ పులకేసి వల్లభుడే. వేములవాడ చాళుక్యులలో 8వ శతాబ్దంలో ఉన్నవాడు వినయాదిత్య యుద్దమల్లుడు. ఇతని ప్రధాన పట్టణం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ. యుద్దమల్లుని కుమారుడు అరికేసరి. ఇతడు రాష్టక్రూట నిరుపమ ధ్రువ చక్రవర్తి సామంతుడు, మహావీరుడు. చక్రవర్తి కోసం పెక్కు యుద్ధాలు గెలిచాడు. ఇతని మనుమడు రెండవ అరికేసరి. ఇతడు గొప్ప రాజతంత్రుజ్ఞడు, పరాక్రమశాలి. రాష్టక్రూట సామంతుడైనా, ఆ రాజవంశ కన్యను వివాహమాడాడు. ఈమె పేరు లోకాంబిక. ఇతనికి రాష్ట్ర కూట చక్రవర్తి అయిన గోవిందరాజుతో వైరం ఏర్పడింది. ఇతడు గోవిందరాజును ధిక్కరించి, జయించి, అతని పినతండ్రి అయిన బద్దెగ అనే వాడిని రాష్టక్రూట చక్రవర్తిగా ప్రతిష్టింపచేశాడు. అరికేసరి కర్నాట భాషా పోషకుడు. పంపడను మహాకవి ఇతని ఆస్థానంలో ఉండి భారతాన్ని జైన సంప్రదాయంతో అరికేసరి నాయకుడుగా విక్రమార్జున విజయమనే పేర రచించాడు. ఇది తెలుగువాడయిన పంపడు రచించిన తొలి కన్నడ కావ్యం, తెలంగాణాలో అవతరించింది. ఇది 10వ శతాబ్దంలోని నన్నయ్య భారతానికి ఒక శతాబ్దం ముందు రచితమైంది. పంపని తమ్ముడు జీవ వల్లభుడు వేయించిన గంగాధర పర్వత కన్నడ శాసనంలో చివరన మూడు తెలుగు కందాలు చెక్కించాడు. అవే తెలుగులో తొలి కందాలు. వానిలో ఒకటి ఉదాహరిస్తున్నాను.
“జిన భవనంబు లెత్తించుట
జినపూజ ల్సేయుచున్కి జీనమునులకు న
త్తిన యన్నదానం బీవుట
జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్”
కాకతీయులు
కాకతీయుల పుట్టుపుర్వాలపై విశేష పరిశోదన జరిపి, అపూర్వ విషయాలు కనుగొన్న డాక్టర్ పివి పరబ్రహ్మశాస్త్రి తెలుపుతున్న విషయాలు క్రింద క్రోడీకరిస్తున్నాను.
కాకతీయులు మొదట్లో చాలా కాలము రాష్ట్ర కూట రాజుల సేనాపతులు. కాకతీయ వెన్నమ రాజు నాల్గవతరం వాడయిన గుండరాజు రాష్ట్ర కూట సేనాపతిగ వేంగీ దేశంపై దాడిచేసి మరణించాడు. ఇది సుమారు క్రీస్తుశకం 890-900 నడుమ జరిగింది. ఇతని కుమారుడు ఎర్రన. రాష్టక్రూట రాజులు ముదిగొండ చాళుక్యులను కొరవి రాజ్యం నుంచి తరిమివేసి, ఎర్రనను దానికి పాలకునిగా నియమించారు. ఇతని కుమారుడు బేతరాజు, ఇతని కుమారుడు గుండమరాజు, ఇతడు గొప్పయోధుడు. ఇతడే వేంగీ రాజయిన చాళుక్య అమ్మరాజును గెలిచినవాడు. కాని ఇతనిని తర్వాత ముదిగొండ చాళుక్య చక్రవర్తి తైలవుని సహాయంతో యుద్ధంలో చంపారు.
గుండరాజు మరణించగానే కొరవిరాజ్యం ముదిగొండ చాళుక్యుల వశమైంది. అతనిని కుమారుడు బేతరాజు చాల చిన్నవాడు. అతనిని అతని మేనత్త కామసాని తన భర్త ద్వారా చాళుక్య చక్రవర్తికి విన్నవించి, అనుమకొండ ప్రాంతానికి రాజుగా చేసింది. దీనితో కాకతీయులలో మార్పు వచ్చింది. కాకతీయులు రాష్ట్ర కూటులపట్ల అభిమానం వదలి చాళుక్యులకు విధేయులయ్యారు. పిదప బేతరాజు, పిదప అతని కుమారుడైన మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, దుగ్గరాజు, రెండవ ప్రోలరాజు క్రీ.శ.1052 నుంచి 1157 వరకు నూట అయిదేళ్ళు సామంతులుగానే పాలించారు. రెండవ ప్రోలరాజు గొప్ప యోధుడు. ఇతడు తెలంగాణాలో చెలరేగిన విప్లవాలన్నిటినీ అణచివేసి కల్యాణి చాళుక్య చక్రవర్తి రెండవ జగదేకమల్ల ప్రతాప చక్రవర్తి అనుగ్రహం పూర్తిగా సంపాదించాడు. తెలంగాణాలో తనకు సాటి వీరుడు మరొకడు లేడని నిరూపించుకొన్నాడు. దీనితో కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాది పడింది.
స్వాతంత్య్ర ప్రకటన - రుద్రదేవుడు
రెండవ ప్రోలరాజు పెద్ద కుమారుడు రుద్రదేవుడు 1158 లో పట్టానికి వచ్చాడు. ఇతని కాలంలో కల్యాణి చాళుక్య చక్రవర్తి అయిన ద్వితీయ జగదేకమల్ల ప్రతాప చక్రవర్తిని అతని సోదరుడైన తైలవుడు త్రోసిరాజని సింహాసనం ఆక్రమించాడు. ఇలా ఉండగా, ఆరవ విక్రమార్కుని దౌహిత్రుడైన కళచురి బిజ్జలుడు మూడవ తైలవుని తరుమగొట్టి రాజ్యమాక్రమించాడు. కల్యాణి చాళుక్య సామ్రాజ్యం మూడు ముక్కలైంది. కాకతీయ రుద్రుడు వీరిలో ఎవరికి విధేయుడుగా ఉండాలో తేల్చుకోలేకపోయాడు. దురాక్రమణ దారుడైన బిజ్జలునికీ తలవంచడం అతనికి నచ్చలేదు. కనుక క్రమంగా తెలంగాణాను ఆక్రమించుకోవడం ప్రారంభించాడు. బిజ్జలుడు మైళగి అనే సేనాపతి అధీనాన గొప్ప సైన్యం పంపాడు. దానితోను, ఇరుగు పొరుగు వారితోను రుద్రదేవుడు పోరి, అందరిని జయించి, అనుమకొండ వేయిస్తంభాల గుడిలో విజయ శాసనం వేయించాడు. స్వాతంత్య్రం ప్రకటించి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని రాజ్యానికి దక్షిణాన శ్రీశైలం వరకు, ఉత్తరాన గోదావరి, పశ్చిమాన బీదరు తూర్పున ద్రాక్షారామం ఎల్లలు. రుద్రదేవుడు దేవగిరి యాదవ రాజులపై దండెత్తి ఆ యుద్ధంలో 1195 లో మరణించాడు. అతని పిదప అతని తమ్ముడైన మహాదేవుడు మూడు సంవత్సరాలు రాజ్యమేలి దేవగిరి యాదవరాజులపై దండెత్తి యుద్ధంలో మరణించగా, రుద్రుని కుమారుడైన గణపతిదేవుణ్ని 1199 లో విధేయులైన మంత్రి సేనాపతులు సింహాసనా సీనుణ్ని చేశారు. గణపతిదేవుడు 1199 నుంచి 1262 వరకు 63 ఏళ్ళు రాజ్యం చేసి, చోళులను, పాండ్యులను, కళింగులను జయించి, పెక్కు కోవెలలను నిర్మించాడు. దాదాపు తెలుగు దేశమంతా ఈయన రాజ్యంలో ఉంది. ఉత్తరాన గోదావరి, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన కాంచి రాజ్యమూ సరిహద్దులు. గణపతిదేవునికి కుమారులు లేనందున, అతని కుమార్తె రుద్రమదేవి, గణపతిదేవుని తర్వాత 1262 లో రాజ్యానికి వచ్చి 1289 వరకు ఏలింది. ఎదురు తిరిగిన సామంతులను అణచివేసి, రాజ్యాన్ని స్థిరపరచింది.
రుద్రమదేవికి కుమారులు లేరు. ఆమె దౌహిత్రుడైన ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది. అతడు 1189-1323 వరకు రాజ్యం చేశాడు. అతని కాలంలో కాకతీయ రాజ్యం పడమట బీదరు దాటి, దక్షిణాన కంచి, తూర్పున ద్రాక్షారామం, ఉత్తరాన కోటగిరి, పోలాస్ వరకు వ్యాపించి ఉండేది.
ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానయిన ఘియాజుద్ధీన్ ఖిల్జి ఉలుగ్ ఖాన్ అనే సేనాపతిని పంపి వరంగల్లుపై దాడి జరిపారు. ఆ దాడిలో కాకతీయులు వోడిపోయారు. ప్రతాపరుద్రుడు బందీ అయ్యాడు. అతడు ఢిల్లీకి వెళ్ళే దారిలో యమునానదీ తీరంలో అత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.
కాకతీయ సామ్రాజ్యంలో కళా సాహిత్యాలు చాలా అభివృద్ధి పొందాయి.
Friday, October 24, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment