- శ్రీ ఆదిరాజు వీరభద్రరావు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలము, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము- ఈ మూడును గొప్ప శైవక్షేత్రములు. ఈ మూడు లింగముల మధ్యనున్న దేశమునకు త్రిలింగదేశమని పేరు వచ్చినది. ఆణెము అనగా దేశమని అర్థము. కావున త్రిలింగ దేశము త్రిలింగనాణెము, త్రిలింగాణము అయినది. త్రిలింగాణ శబ్దమే మారి తెలంగాణెము, తెలంగాణము అనుపేరు వ్యవహారములోనికి వచ్చినది. శాసనములలో దీనిని తిలింగమనిరి. ముసల్మాను చరిత్రకారులు దీనిని తిలింగ్ అనియే వ్యవహరించింది. ప్రజలు తైలంగులయిరి.
శ్రీశైలంతు సమారభ్య - చోళేశాన్మధ్యభాగ్యతః
త్రైలాంగ దేశో దేవేశి - ధ్యానాధ్యయన తత్పరః
అను తంత్ర శాస్త్రమును బట్టి త్రైలింగులు అనగా తెలుగువారు ధ్యాన, అధ్యయన తత్పరులుగా నున్నట్లు ప్రశంసింపబడియున్నారు.
తెలంగాణ మనగా తెలుగువారుండు దేశమని అర్థము. ఇది ప్రాచీనపదము. ఒకప్పుడు తెలంగాణము దక్షిణాపథమున విశాల భూభాగమును ఆక్రమించి యుండెను. కాని కాలక్రమమున తెలంగాణము చీలికలయి, వేర్వేరు రాజుల ఆధిపత్యములోకి వచ్చినందున వేర్వేరు నామమలను బొందెను, అయినను హైదరాబాదు రాష్ట్రములోని హైదరాబాదు, వరంగల్లు, ఖమ్మముమెట్టు, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ అను తొమ్మిది జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దమే నిలిచిపోయినది. తెలంగాణ పదము ఈ తొమ్మిది జిల్లాలకు అన్వయిచుచు, రాజకీయ పత్రములందు వ్యవహరించుచున్నారు. ఈ తొమ్మిది జిల్లాల యందును తెలుగువారు ప్రధానముగా నుంటచే తెలంగాణ శబ్దము సార్థకముగా నున్నది. అసలీ తెలంగాణమే తెలుగువారికి ఆది నివాస భూమిగా నుండెను. ఇచ్చిటి నుండియే వారు పలు ప్రాంతములకు విస్తరిల్లిరి. ఆ ప్రాంతములందు ఆంధ్ర శబ్దము ప్రచారమునకు వచ్చి, ఆంధ్రప్రాంతంగా రూఢియై పోయినది. తెలుగువారు ఆంధ్రులు గనుకను, ఆంధ్రులు తెలుగువారు గనుకను ఇప్పుడంతయు తెలంగాణమే, అంతయు ఆంధ్రాణమే.
ఆంధ్రులు ప్రాచీనులు ఐతరేయ బ్రాహ్మణమునందు ఆంధ్రుల ప్రశంసకలదు. రామాయణ, మహాభారతము లందును ఆంధ్రులను గూర్చిన ప్రశంస కలదు. రామాయణ కథలోని పర్ణశాల తెలంగాణమునకు చెందినదే. వరంగల్ జిల్లా, జనగాం తాలూకాలోని జీడికల్లు నందే శ్రీరాముడు మాయా కురంగమును వధించినట్లు ఐతిహ్యము కలదు. శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రిచేసిన కిష్కిందాపురము ఈ రాష్ట్రములోని ఆనెగొంది ప్రాంతమని చరిత్రకారులు నిర్ణయించియున్నారు.
ప్రాచీనకాలములో తెలంగాణ నివాసులు విశిష్ట సభ్యత కలవారయి యున్నట్లు నిజమాబాదు నుండి మధిర వరకును గనబడుచున్న “కెయిరను” లను సమాధుల పరిశీలనము వలన తేలుచున్నది. కాని ఆనాటి అనగా సుమారు మూడువేల సంవత్సరముల క్రిందటి చరిత్ర తెలియుట లేదు.
ఆర్యులు దక్షిణాపథమునకు ఎప్పుడు ఏతెంచిరో సరిగా తెలియదు. మౌర్య చక్రవర్తుల కాలము నాటికే తెలంగాణమున ఆంధ్ర రాజన్యులు ప్రబలులై యున్నట్లు తెలియుచున్నది. అయినను మౌర్యవంశ రాజులు ఆంధ్రరాజ్యమును జయించి మగధ రాజ్యములో చేర్చుకొనిరి. అశోకవర్ధన మహారాజు, మరణానంతరము క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దములో ఆంధ్రులు విజృంభించి తిరిగి ఆంధ్ర రాజ్యమును స్థాపించిరి.
దక్షిణాపథములో వెలిసిన మొట్టమొదటి గొప్ప రాజ్యము ఆంద్రులది. ఈ ఆంధ్ర రాజ్యమును స్థాపించిన కీర్తి శాతవాహన వంశమునకు చెందవలసి యున్నది. శాతవాహనుడు, శ్రీముఖుడు, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టిపుత్ర పులుమాయి, రెండవ పులుమాయి, యజ్ఞశ్రీ శాతకర్ణి మున్నగు ఆంధ్ర రాజులు శాతవాహన వంశీయులు ముప్పది యిద్దరు రాజులు క్రీస్తు శకము 225 ప్రాంతము వరకు పరాక్రమోపేతులయి దక్షిణాపథము నంతయునేలిరి. శాతవాహనుల విశాల సామ్రాజ్యములో తెలంగాణము చేరి యుండెను.
శాతవాహనులు ఆంధ్రులైనను వారిది ఆంధ్రభాష కాదు. అప్పుడు ప్రజల భాష ప్రాకృత భాషయై యుండెను. శాతవాహనులు దాక్షిణాత్య సంస్కృతిని తీర్చి దిద్దిరి. కళలను పెంపొందించిరి. వైదిక మతావలంబకులైనను బౌద్ధ, జైన, మతములయెడ ఆదరాభిమానములు చూపిరి. వర్తకము విస్తరిల్లెను. వీరికి ముప్పది కోటలు, రెండు వేల ఆశ్విక దళము, వేయిగజములు, లక్ష కాల్బలము ఉండెను. మెదకు జిల్లాలోని కొండాపురం వారి టంకసాల నగరముగా నుండెను. శాతవాహనుల తరువాత క్రీస్తు శకము మూడవ శతాబ్దము మొదలుకొని రెండు మూడువందల సంవత్సరముల వరకు తెలంగాణ చరిత్ర తెలియుట లేదు. చిన్న చిన్న సంస్థానములు ఉండి యుండెనేమో !
శాతవాహనుల తరువాత చెప్పుకోతగ్గ వారు చాళుక్యులు. క్రీస్తు శకము ఆరవ శతాబ్దములో చాళుక్యుల కథతో చరిత్ర ప్రారంభమగుచున్నది. ఆరవ శతాబ్దములో రెండవ పులకేశి అను మహారాజు మహాశూరుడయి,దిగ్విజయయాత్రలు చేసి నర్మదానదికి దక్షిణ భాతమునంతయు తన ఏలుబడిలోనికి తెచ్చెను. తెలంగాణములో కొందరు సామంతరాజులు వెలిసిరి. చాళుక్యులు ఎల్లప్పుడు పల్లపులతో యుద్ధము చేయుచుండిరి. ఎనిమిదవ శతాబ్ది మధ్య భాగమున రాష్ట్ర కూటులు రాజ్యాధి పతులయిరి. చాళుక్యులు తిరిగి పరాక్రమించి రాజ్యమును జయించి సుమారు రెండు వందల సంవత్సరములు తమ యాధిపత్యమును నిలుపుకొనిరి. చాళుక్యుల అధికారము క్రీ.శ. 1189లో అంతమొందెను. చాళుక్యులు శైవమతాభి మానులు. తెలంగాణములో కాలాముఖ శైవము, పాశుపత శైవము, లకులీశ శైవము ప్రబలియుండెను. చాళుక్యులు శిల్ప సంగీత నాట్యకళలను ప్రోత్సహించిరి.
తరువాత హోయిసలులు, యాదవులు, అధిపతులైరి. దక్షిణాపథము నేలిన హిందూరాజులో యాదవులే కడపటివారు.
చాళుక్యులకు ఓరుగంటి నుండి అనుమకొండ విషయమును ఏలుచుండిరి. చాళుక్యుడయిన ఆరవ విక్రమాదిత్యుని మరణానంతరము కాకతీయ రాజగు రెండవ ప్రోలరాజు చాళుక్యాధికారమును ధిక్కరించి స్వతంత్రుడయ్యెను. కాకతీయులకు ఒరుగల్లు రాజధానిగా నుండెను. దీనినే ఏకశిలాగనరమనుచుండిరి. ఇప్పుడు వరంగల్లు అనుచున్నారు. కాకతీయులు ఒరుంగల్లు మొదలి పట్టణంబుగా, శ్రీ స్వయంభూదేవ దివ్యశ్రీపాద పద్మారాధకులై, విదితవిక్రమశీలురై పరమమాహేశ్వర వీరలక్ష్మి ఆంధ్ర భూభాగమునంతయు ఏకఛత్రచ్ఛాయకు తెచ్చిరి. విశాల సామ్రాజ్యము ఏర్పడెను. తెలంగాణ వాసుల ప్రభ తేజోవంతముగా వెలిగెను. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర భాష ప్రశస్తి చెందెను. కాకతీయ సామ్రాజ్యకాలము ఆంధ్రులకు స్వర్ణయుగముగా ప్రకాశించెను. కాకతీయులలో కడపటివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. కాకతీయ సామ్రాజ్యము విధిక్రమము ననుసరించి క్రీ.శ. 1323లో అస్తమించెను. తెలంగాణమున ముస్లిం రాజుల పరిపాలనము ప్రారంభమయ్యెను.
ఢిల్లీ సుల్తానుల కన్నులు 1303లో ఓరుగల్లుపై పడెను. వారి ప్రయత్నము లన్నియు విఫలము లయ్యెను. కాని 1321లో మహమ్మదు బిన్ టోగ్లకు ఘోరయుద్ధచేసి ఓరుగల్లును వశపరుచుకొనెను. దక్కను అంతయు మొగలుల స్వాధీనమయ్యెను. ఆంధ్రులలో ఐకమత్యము లేనందున స్వార్ధపరులమూలకముగా తెలంగాణ రాజ్యము బ్రద్దలయ్యెను. మొగలుల ప్రభ వెలుగసాగెను. అయినను క్రీ.శ. 1335-1336 ప్రాంతములో ఆంధ్రనాయకులు తిరుగబడి ముసల్మానులను జయించి ఓరుగంటి కోటను వశపరుచుకొని ఆంధ్ర హిందూ రాజ్యమును మరల ప్రతిష్టాపించిరి. కాని ఈ ఐకమత్యము ఎక్కువ కాలము నిలువలేదు. తమలో తాము పొట్లాడు కొనసాగిరి. ఓరుగల్లు, రాచకొండ రాజ్యములు తెలంగాణము లో ఏర్పడెను. ఆంధ్రజాతి దుర్బలస్థితి చెందెను.
క్రీ.శ. 1347 లో గుల్బర్గాలో బహమనీ రాజ్యము ఏర్పడి తిరిగి దక్కను ముస్లిం పాలకుల క్రిందికివచ్చెను. 1417లో బహమనీ నవాబు మహబూబ్నగర్ జిల్లాలోని పానుగల్లు దుర్గమును ముట్టడించెను. విజయనగరము, ఓరుగల్లు రాజులు, సరదారులు గొప్ప సైన్యముతో బహమనీ నవాబులను ఎదురించిరి. పెక్కు యుద్ధములు జరిగెను. ఉభయ పక్షములు పడుచు, లేచుచుండెను తెలంగాణము బహనీ నవాబుల వశమయ్యెను. క్రీ.శ. 1527లో బహమనీ రాజ్యము అస్తమించెను. బహమనీ రాజుల కాలములో తెలంగాణము యుద్ధరంగముగా మారెను. ప్రజల కష్టపడిరి.
బహమనీ రాజ్యములోని గోలకొండసీమకు కులీ కుతుబుల్ ముల్కు అనువాడు 1512 లో బహమనీ రాజ్యములో ఒక సుబేదారుగా నియమితుడయ్యెను. ఇతడు స్వాతంత్య్రము ప్రకటించి గోలకొండ రాజధానిగా తెలంగాణమునకు అధిపతి అయ్యెను. గొలకొండ కుతుబుషాహీల కాలములో తెలంగాణము స్వస్థత చెందెను. తెలంగాణమునకు గోలకొండ కేంద్రమయి విరాజిల్లెను. కుతుబుషాహీ వంశములో ఆఖరువాడు అబుల్ హసన్ తానేషా (తాన్షాహా). ఇతనిని జయించి ఔరంగజేబు చక్రవర్తి 1687లో తెలంగాణమును మొగలు సామ్రాజ్యములో జేర్చెను. కుతుబుషాహీల కాలములోనే హైదరాబాదు నగరము నిర్మాణమయ్యెను (1591)
క్రీ.శ. 1713లో మొగలు సుబేదారుగా ఆసఫ్జా నిజాముల్ ముల్కు హైదరాబాదు వచ్చెను. ఇతడు 1724లో స్వాతంత్య్రము ప్రకటించి ప్రస్తుతపు నిజాము ప్రభువు వంశమునకు మూలపురుషుడయ్యెను. నిజాము ప్రభుత్వ ప్రారంభముననే ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు రాజకీయరంగము న ప్రవేశించిరి. నిజాములు ఇంగ్లీషు వారికి సామంతులయిరి. రెండవ నిజామగు నిజామలీఖాను 1766లో ఉత్తర సర్కారు లను, 1800లో రాయలసీమను ఇంగ్లీషువారికి దత్తత చేసెను. విశాలమయిన తెలంగాణము రెండుభాగములుగా రాజకీయముగా విడివడిపోయెను. నిజాముల మంత్రులలో సర్సాలారుజంగు ప్రముఖుడు. ఇతడు పరిపాలనమున మంచి సంస్కరణలు చేసేను. ప్రస్తుతపు నిజాం సర్ మీరు ఉస్మానలీఖాన్ బహద్దరు వారు సప్తమ నైజాము. శ్రీవారు 1911లో సింహాసనమెక్కిరి. వీరు తమ పరిపాలనా కాలమున పెక్కు రాజకీయ సంస్కరణములు కావించి రాజ్యమును సువ్యవస్థితముగా నొనర్చిరి. ఇప్పుడు ప్రజాస్వామిక పద్ధతుల మీద రాజ్యాంగము నడుచుచున్నది. 1950 జనవరి 26 గురువారమునాడు హైదరాబాదు రాష్ట్రము భారత యూనియనులో విలీనమయ్యెను. నిజాము ప్రభువు “రాజప్రముఖ” పదవి వహించియున్నారు.
(తెలంగాణం, మొదటి భాగం, దేశోద్దారక గ్రంథమాల, 1956 సంకలనం : వట్టికోట ఆళ్వారు స్వామి)
Friday, October 24, 2008
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
fantastic contribution. my dear friend..pl keep it up
Post a Comment