అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, జార్జ్ బుష్ అమెరికా ప్రజల, ప్రవాసుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అప్పులలో నిండా మునిగిన ‘బేర్ స్ట్రెన్స్’ను 29 బిలియన్లతో, ఫ్రెడీ మేక్ – ఫ్రెనీమే కంపెనీలను 200 బిలియన్లతో, ఎఐజి ఇన్యూస్సూరెన్స్ కంపెనీని 85 బిలియన్లతో కొన్నాడు.
అమెరికా ఆర్ధికరంగం పేకలమేడలా కుప్పకూలుతుంది. బ్యాంకులు, ఇన్యూసురెన్స్ కంపెనీలు, తాకట్టు కంపెనీలు ( మోర్టగేజ్ కంపెనీలు) నష్టాల ఊబిలో కూరుకుపోయి దివాళ తీస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది. మరి దీనిలో వెనకాల వున్న కారణలు ఏమిటి?
ఈ ఆర్ధిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తంత చారిత్రాత్మకంగా, అమెరికా ఆర్థిక విధానాలను గమనించాలి. అమెరికా లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, తాకట్ల కంపెనీలకు లాభం చేకూరే విధంగా అప్పటి ప్రభుత్వం 1938 లో ‘ఫెన్నీ మే’ 1970 లో ‘ఫ్రెడ్డీ మేక్’ అనే కంపెనీలను ప్రారంభించింది. యీ కంపెనీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల, తాకట్టు కంపెనీలకు పరోక్షంగా ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చాయి.
ఆర్థిక స్థోమత్త లేని వాళ్ళకు విపరీతమైన అప్పులిచ్చి రియల్ ఎస్టేట్ మార్కెటులో ఒక కృతిమైన డిమాండ్ సృష్టించారు. ఇళ్ళ ధరలను వాస్తవ విలువ కంటే విపరీతంగా రియల్ఎస్టేట్ కంపెనీలు పెంచేసాయి. వడ్డీ వ్యాపారం రుచి మరిగిన బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఎలాంటి నియమనిబంధనలు పాఠించకుండా, అప్పులు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన జనం, తీసుకున్న అప్పులను చెల్లించలేక పోయారు. వడ్డీ వ్యాపారంలో జూదమాడిన కంపెనీలు పేకలమేడలా కుప్ప కూలుతున్నాయి. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డాయి. కారల్ మార్క్స్ అన్నట్టుగా “పెట్టుబడిదారులు తమ బొందను తామే తవ్వుకుంటారని” వాస్తవంగా జరుగుతుంది. అమెరికా లో పెట్టుబడి వ్యవస్థ పరాకాష్టకు చేరుకుంది. 1930 అమెరికా లో ‘గ్రేట్ డిప్రెషన్’ (ఆర్ధిక వినాశకం) పునారావృత్తం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమెరికా చరిత్రలో, ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో, అమెరికా ప్రభుత్వం 700 బిలియన్ల డాలర్ల ప్రజల సొమ్ముని వాల్ స్ట్రీటు లో జూదమాడి నిండామునిగిన దళారులకు, తాకట్టు కంపెనీలకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తుంది. దీనిని అధికారంలో వున్న రిపబ్లికను పార్టీ, ప్రతిపక్షంలో వున్న డెమొక్రెటిక్ పార్టీ రెండూ సమర్ధిస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వం, రాజకీయనాయకుల పాత్రను గమనించాలి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ , ఆర్ధికమంత్రి హెన్రీ పాల్సన్ ప్రభుత్వపరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. బ్యాంకులు, తాకట్టు కంపెనీలు, వ్యాపారసంస్థలమీద ఎలాంటి ప్రభుత్వనియంత్రణ లేకుండా, తమ ఇష్టారాజ్యంగా నడిచాయి. వాల్ స్ట్రీటు జూదగాళ్ళ నష్టాలను సామాన్య జనం నెత్తిన రుద్దుదామని కొంతమంది రిపబ్లికన్లు, డెమోక్రెట్లు ప్రయత్నిస్తున్నారు. 700 బిలియన్ల ప్రభుత్వసొమ్ముని (అంటే అమెరికా ప్రజల సొమ్ముని) వాల్ స్ట్రీట్ షేర్ మార్కెటు దళారులకు ఇవ్వాలని ప్రత్నిస్తున్నారు. కొంతమంది అమెరికను కాంగ్రెసు సభ్యుల విజ్ఞత వల్ల “700 బిలియన్ల బెయిల్ అవుట్” బిల్లు ఓడిపోయింది.
అమెరికాలో అత్యంత ధనవంతమైన వ్యాపారసంస్థ జనరల్ ఎలక్ట్రిక్ చెందిన ఎన్.బి.సి, టైమ్ వార్నర్ చెందిన సి.ఎన్.ఎన్, అలాగే అత్యంత పెద్ద మీడియా కంపెనీ అయిన న్యూస్ కార్పొరేషన్ తమ స్వప్రయోజనాలకోసం యీ బిల్లును సమర్ధిస్తున్నాయి. “మీ ఉద్యోగాలు పోతాయి, మీకు జీతాలు రావు, ఎ.టి.యం కార్డులతో డబ్బు తీసుకోలేర”ని తప్పుడు ప్రచారంతో జనాన్ని బయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఒకవైపు అమెరికాలో మెజార్టీ ప్రజలు “బెయిల్ అవుట్” బిల్లును వ్యతిరేకిస్తున్నా, మరొకవైపు ప్రభుత్వం-రాజకీయనాయకులు-బడా కంపెనీలు “బెయిల్ అవుట్” బిల్లును అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా లో బిజినెస్ లాబీలు ప్రభుత్వం-రాజకీయనాయకులను నియంత్రిస్తాయి. ఒకమాటలో చెప్పాలంటే, అధ్యక్షపదవి పోటిపడుతున్న బారకా ఒబామా 400 మిలియన్లు, జాన్ మెకేయిన్ 300 మిలియన్లు ( రిపబ్లికను పార్టీ తోకలపి) వసూలు చేసారు. దీనిలో మెజార్టీ భాగం బిజినెస్ లాబీల దగ్గర నుండి వచ్చిందే. సెనేట్ లో రాత్రింబగళ్ళు కష్టపడి సెనేటర్లు యీ బిల్లును ఆమోదించి దివాళ తీసిన వ్యాపారసంస్థలకు లాభం చేకూర్చారు.
చివరికి ‘అమెరికను కాంగ్రెసు’ 700 బిలియన్ల బిల్లును సాగదీసి 840 బిలియన్లు చేసి ఆమోదించింది. వెంటనే జార్జ్ బుష్ సంతకంచేసి చట్టం చేసాడు. అమెరికా ప్రభుత్వం, రాజకీయనాయకులు, వ్యాపారవర్గాలు ఎంతగా లాలూచీ పడ్డారో, తమ స్వప్రయోజనాలకోసం దేశాన్ని ఎలా తాకట్టు పెడతారో స్పష్టమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంత దివాళకోరు స్థితికి చేరుకోవటం పరాకాష్ట. ఇదొక పట్టపగలి దొంగతనం; ప్రభుత్వం చట్టబద్దంగా జనాన్ని దోచుకున్న వైనం.
Thursday, October 16, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment