Thursday, October 16, 2008

గతితార్కిక భౌతికవాదం

- ఐరా గొలోబిన్‌
రెండో అధ్యాయం (తరువాయి భాగం)

గతితార్కిక భౌతికవాదం అంటే తత్వశాస్త్రానికి శాస్త్రీయసూత్రీకరణవంటిది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం. హెగెల్ ముందుచూపుతో వ్యాఖ్యానించినట్టుగా “సత్యానికి యదార్థరూపంలో ఉనికినిచ్చేది దాని వైజ్ఞానికవ్యవస్థ ఒక్కటే. తత్వశాస్త్రాన్ని విజ్ఞానశాస్త్రం స్థాయికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నిరూపించాలి; ఇందుకు తోడ్పడే ప్రయత్నం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను…తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంలా రూపొందాలి. తత్వశాస్త్రంఅంటే కేవలం జ్ఞానాన్ని ప్రేమించడం కాదు; అది నిజంగా జ్ఞానమే”. 16

వైజ్ఞానిక తత్వశాస్త్రం

వైజ్ఞానిక తత్వశాస్త్రం పుట్టుక:
గతితార్కిక అంశాలను చాలావరకూ సూత్రీకరించిన హెగెల్ తన శాస్త్రీయలక్ష్యం దిశగా ముందడుగు వేశాడు. అయితే మార్క్స్, ఎంగెల్స్ జమిలిగా సాధించినదేమిటంటే వైజ్ఞానిక తత్వశాస్త్రాన్నీ, గతితార్కిక భౌతికవాదాన్నీ విశదపరచడం. హెగెల్, ఫ్యూఅర్బాఖ్లూ, వారికి మునుపటి అనేక తత్వచింతకులూ, శాస్త్రీయవిశ్లేషకులూ అందరి రచనలనూ వారు ఉపయోగించుకున్నారు. “…గతితర్కం తదితర జ్ఞానసూత్రాలన్నీ ఈ అన్వేషణకు నాంది అనుకోరాదు; అవి అంతిమఫలితాలు. వాటిని ప్రకృతికీ, మానవజాతి చరిత్రకూ అన్వయించడంకాదు; సారాంశంగా భావించాలి. ప్రకృతీ, మానవజాతీ ఈ సూత్రాలకు కట్టుబడిఉంటాయని కాదు; ప్రకృతికీ, చరిత్రకూ అనురూపంగా ఉన్నంతమేరకే ఈ సూత్రాలకు చెల్లుబాటు ఉంటుంది. 17

పెట్టుబడిదారీ విధానపు ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక వికాసమూ, [ఇంగ్లండ్ ఆర్థికవ్యవస్థ, ఫ్రాన్స్ సోషలిజం, జర్మనీ తత్వశాస్త్రం] భౌతిక, రసాయనశాస్త్రాలూ వగైరాల వృద్ధీ, అన్నీ మార్క్స్, ఎంగెల్స్ల పటిష్ట సూత్రీకరణలకు భూమికనిచ్చాయి. ఇవి విశ్వమంతటికీ వర్తించే సామాన్యసూత్రాలు; పెట్టుబడిదారీ విధానంతోసహా మొత్తం సమాజవికాసానికి (చారిత్రక భౌతికవాదం) వర్తించే ప్రత్యేక సూత్రాలు. వైజ్ఞానిక తత్వశాస్త్రం, సామాజశాస్త్రం అనేవి రెండూ తప్పనిసరిగా విప్లవంలో పుట్టిన కవలల వంటివి. పెట్టుబడిదారీ యథాస్థితివాదాన్ని ధిక్కరిస్తూ, దాని అంతం తప్పదని శాస్త్రీయంగా సూచించినవి. “…సాంప్రదాయక ఆస్తిసంబంధాలు సంపూర్ణంగా భగ్నం అవుతున్నప్పుడు… సాంప్రదాయక భావనలన్నీ సంపూర్ణంగా భగ్నమవుతాయి. “18

వైజ్ఞానికతత్వశాస్త్రానికీ, (అన్నిటికీ వర్తించే సర్వసామాన్యశాస్త్రం), తక్కిన జ్ఞానానికీ (ప్రత్యేకవిషయాలకు మాత్రమే వర్తించే సత్యాలు) మధ్య మౌలికమైన తేడాలు తొలిసారిగా ఏర్పడ్డాయి. (’వైజ్ఞానికతత్వశాస్త్రం’ అంటే ‘తాత్వికతలోని శాస్త్రీయత’ అనుకోరాదు. ‘వైజ్ఞానికతత్వశాస్త్రం’ అనేది తత్వశాస్త్రంలోని వైజ్ఞానిక అంశాలకు మాత్రమే పరిమితమైనది. ఇందులో అశాస్త్రీయమైనవాటికి తావుండదు. అలాగే అది కళలూ, వివిధశాస్త్రాలూ అన్నిటి శాస్త్రీయఅంశాలకూ సమగ్రంగా వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా ‘తాత్వికతలోని శాస్త్రీయత’ అనేది తాత్వికతలోని శాస్త్రీయ, అశాస్త్రీయసూత్రాలన్నిటికీ సమగ్రంగా వర్తిస్తుంది. అలాగే అది ప్రత్యేకశాస్త్రాల సామాన్యవిషయాలకే పరిమితం. కళలకూ, నీతిశాస్త్రం వగైరాలకూ వర్తించదు; అవన్నీ ప్రత్యేకశాస్త్రాల వైజ్ఞానికలక్షణాలకు సంబంధించినవైనప్పటికీ కూడా.) ఇది డార్విన్‌తో సహా అనేకుల వైజ్ఞానిక ఆవిష్కరణలన్నిటి మూలంగానే సాధ్యమైంది. ఈ విభజనవల్ల వివిధవిషయాల మధ్యనుండే నిజమైన సంబంధాలు తేటతెల్లంకాసాగాయి. తక్కిన రంగాల్లో తెలిసిన విషయాలన్నిటినీ వైజ్ఞానికతత్వశాస్త్రం సంగ్రహించి ప్రాపంచిక వాస్తవాలను తెలియజేస్తుంది. (వైజ్ఞానికతత్వశాస్త్రం రాజకీయాలూ, భౌతికశాస్త్రం, సంగీతం, నీతిశాస్త్రం మొదలయినవాటి ప్రాథమిక సమాచారాన్ని తిన్నగా కాకుండా తాత్వికపరంగా స్వీకరించి సామాన్యసూత్రాలను రూపొందిస్తుంది. వీటిలో ప్రాథమికవిషయాలకూ, మధ్యస్థంగా అనిపించేవాటికీ సిద్ధాంతంద్వారా సామాన్యత ఏర్పడుతుంది. ఇక్కడ సిద్ధాంతం అంటే తాత్వికభావనల సమాహారం. ఒకప్పుడు దీన్ని ఆదర్శవాద పద్ధతిలో ఊహాజనిత చైతన్యంగా భావించేవారు.) “తత్వవేత్త అయినవాడు విషయాలన్నిటినీ సమగ్రంగా పరిగణించగలిగిఉండాలి”.19 వైజ్ఞానికతత్వశాస్త్రపు ఆకరాల్లో భౌతిక, జీవశాస్త్రాలూ, తర్కం, గణితంవంటి సిద్ధాంతశాస్త్రాలూ, విలువల నాపాదించే నీతిశాస్త్రం, సౌందర్యశాస్త్రం, చరిత్రయొక్క తాత్వికతా వగయిరాలుంటాయి. ఈ తత్వశాస్త్రం విజ్ఞానపు తక్కిన రంగాలన్నిటినీ పోషిస్తుంది. ఇది ‘విజ్ఞానానికొక ప్రాథమిక సైద్ధాంతిక మూలం’. (లెనిన్) సర్వసామాన్యతకిది శ్రేష్ఠమైన కేంద్రం. ‘ఇది రాజకీయ ఆర్థికశాస్త్రాన్నేకాక, మొత్తం మానవవికాస క్రమాన్నే ప్రకాశవంతం చేస్తుందీ.20 వైజ్ఞానిక తత్వశాస్త్రం సిద్ధాంతాల సిద్ధాంతం. జ్ఞానం గురించిన జ్ఞానం. శాస్త్రాల శాస్త్రం. తక్కిన జ్ఞానంతో ఇది విడదీయరాని సంబంధం కలిగి దాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ రెంటిలో ఏ ఒక్కదానిదీ పైచెయ్యి అనలేము. రెంటిలోనూ సత్యాసత్యాలు ఒకలాంటివే.

వైజ్ఞానిక తత్వశాస్త్రం, వైజ్ఞానిక ప్రమాణాలు:
వైజ్ఞానికతత్వశాస్త్రం వైజ్ఞానిక ప్రమాణాలను ఆంటిపెట్టుకుని ఉంటుంది. అది వస్తుగతపద్ధతిలో, స్థిరంగా, పొందికగాఉండే జ్ఞానం. అందులో వర్గీకరణలూ, నియమాలూ, పద్ధతులూ ఉంటాయి; నిరూపణీయంగా, భవిష్యత్తును తెలపగలిగినదై, పిడివాదధోరణి లేని నిశ్చితత్వం కలిగి ఉంటుంది. భౌతికశాస్త్ర ప్రయోగశాలల్లో నియంత్రితంగా, పరిశీలనకు లోబడినట్టుగా కాకుండా దాని సత్యాలను పరిమితులు లేకుండా పరీక్షించవచ్చు. మార్క్స్ తన కాపిటల్ గ్రంథానికి ముందుమాట రాస్తూ పరిశీలనకు లోబడని విషయాలకు “మైక్రోస్కోప్‌లూ, రసాయనిక పరీక్షకపదార్థాలూ అవసరంకావు” అంటాడు.21 ఇక్కడ భౌతిక అన్వేషణకు తోడ్పడేదల్లా రూపరహితంగానూ, మూర్తత్వపద్ధతిలోనూ విశ్లేషించి, సంశ్లేషించగలిగిన మేధాశక్తి మాత్రమే. ఇదే సిద్ధాంతంగానూ, ఆచరణగానూ పరిణమిస్తుంది. వివిధ విషయాలను తెలుసుకునే విధానాలన్నీ ఆయా విషయాల లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. వైజ్ఞానికతత్వశాస్త్ర నిశ్చితసత్యాలను రుజువు చెయ్యగలిగిన మేధోశక్తికూడా భౌతికశాస్త్రాల నిరూపణకు పనికొచ్చే చేతులూ, ఇంద్రియశక్తుల్లా వాస్తవమైనదిగానే ఉంటుంది.

భవిష్యత్తును గురించి చెప్పగలగడంలో వైజ్ఞానిక తత్వశాస్త్రం, తక్కిన విజ్ఞానశాస్త్రాలూ విడదీయలేనివిగా ఉంటాయి; పరస్పరం ఆధారపడతాయికూడా. సామాన్యసత్యాలూ, ప్రత్యేకసత్యాలూ కలిసే ఉంటాయి; అలాగే తక్కిన విజ్ఞానశాస్త్రాలు భవిష్యత్తును గురించి చెప్పగలిగే పద్ధతిని వైజ్ఞానిక తత్వశాస్త్రంనుంచి వేరుచేసినట్టయితే తీవ్రమైన పరిమితులూ, వికృతులూ తలెత్తగలవు. విజ్ఞానశాస్త్రా లన్నిటిలోనూ తెలిసో, తెలియకో కొన్ని అతిసామాన్య తాత్విక అంశాలను స్వాభావికం అనుకుంటాం. ఇవి గనక లేకపోతే భౌతిక, రసాయనశాస్త్రాలవంటివి విజ్ఞానం అనిపించుకోవు. “కొందరు ప్రకృతిశాస్త్రవేత్తలు తత్వశాస్త్రాన్ని లక్ష్యపెట్టకో, దురుపయోగం చేసో తాము స్వతంత్రులైపోయినట్టు భావిస్తారనేది నిజమేగాని, యోచన అనేది లేకుండా వారు ముందుకుపోలేరు. యోచించాలంటే యోచనకు నిర్ధారణలుండాలి”.22 వైజ్ఞానికతత్వశాస్త్రమంటే పూర్వాలోచనా, పునరాలోచనా అనే అర్థం.

వైజ్ఞానికతత్వశాస్త్రాన్ని తక్కిన శాస్త్రాల్లాగే నిరంతరమూ విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఉండాలి; అది చారిత్రకపరిణామాలకు లోనవుతూ, కొంతవరకూ లోపాలు కలిగినదై ఉంటుంది. “తత్వశాస్త్రమంటే దాని కాలాన్ని యోచనాత్మకంగా అవగాహన చేసుకోవడమే”.23 వైజ్ఞానిక తత్వశాస్త్రాన్ని అనునిత్యం వాస్తవప్రపంచంతో పోల్చిచూస్తూ ఉండాలి; దాన్ని వైజ్ఞానిక ఆవిష్కరణల ఆధారంతో వికసింపజేస్తూ ఉండాలి. అది నిలకడగా ఉండటానికి గుడ్డినమ్మకాలూ, పిడివాదవైఖరీ పనికిరావు; నిరంతర విచారణా, శాస్త్రీయఖండనకు అతీతం కాకపోవడం ముఖ్యం.

వైజ్ఞానికతత్వశాస్త్రం పిడివాదానికి ప్రతివాదంవంటిది. “ఏ సిద్ధాంతానికైనా ఏకైక, అంతిమ ప్రమాణం అది వికాసప్రక్రియను నిజంగా ప్రతిఫలిస్తోందా, లేదా అనేది అయినప్పుడు ఇక పిడివాదానికి ఆస్కారమే ఉండదు”.24

References:
16. Quoted in Kaufman, Hegel, pp.372, 374
17. Engels, Anti-Duehring, p.44
18. Marx and Engels, The Communist Manifesto, p. 29
19. Aristotle, Metaphysics, p.64
20. Dietzgen, Some of the Philosophical Essays, p.180
21. Marx, Preface to Capital, Vol.1, p.12
22. Engels, Dialectics of Nature, p.183
23. Hegel, ‘Preface to Philosophy of Right’, in Hegel, The Philosophy of Hegel, p.226
24. Lenin, Selected Works, Vol.1, p.326

No comments: