- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఇతర ఆలోచనల్లాగే భక్తి పారవశ్యమూ, మతపరమైన ఆధ్యాత్మిక భావాలూ కూడా మెదడులోని కొన్ని భాగాలలో జరిగే చర్యల వల్లనే కలుగుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అటువంటి నమ్మకాలేవీ లేనివారికి కూడా కృత్రిమంగా, మెదడును అయస్కాంత క్షేత్రానికి గురిచేసి అవే భావనలు కలిగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీటి ద్వారా దేవుడున్నాడనో, లేడనో నిరూపించడం వీలవదు. ఎందుకంటే నమ్మకం ఉన్నవారు అది కూడా దేవుడి పనేననీ, మనసుకు దేవుడి గురించి గుర్తుచేసేందుకే అటువంటి ఏర్పాటు జరిగిందనీ వాదించే అవకాశం ఉంది. ఎటొచ్చీ ఇతరత్రా నమ్మకం లేనివారికి అప్పుడప్పుడూ దృశ్యాలూ, ధ్వనులూ స్పష్టంగా వినబడి, కనబడినప్పుడు వారు దాన్ని దేవుడున్నాడనడానికి “ప్రత్యక్ష” సాక్ష్యంగా భావించి, ప్రభావితులు కావచ్చు. ఆ పరిస్థితుల్లో ఈ శాస్త్రీయ వివరణ ఉపయోగపడవచ్చు.
ఇవే కాదు. మెదడుకు సర్జరీ జరుగుతున్నప్పుడు పూర్తి మత్తుమందు ఇవ్వకుండా రోగులను డాక్టర్లు కొద్దిగా మాటల్లో పెడుతూ ఉంటారు. ఆ విధంగా తమ శస్త్రచికిత్సలో ఏ కారణం చేతైనా పొరపాటు జరిగి, రోగికి స్పృహ తప్పితే వెంటనే తెలుస్తుంది. ఇలా చేస్తూ, మెదడులోని కొన్ని భాగాలను స్పృశించినప్పుడు రోగులు తమకు తెలిసినవీ, ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవీ సంగతులు గుర్తుకొచ్చాయని చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని వాసనలూ, పాటల వరసలూ కూడా ఉండవచ్చు. అప్రయత్నంగా మనసు కలిగించే భావాలకు మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది కనక ఇది తెలుసుకోవడం అవసరం. మెదడుకు సంబంధించినంత వరకూ ఈ రకరకాల ఆలోచనలన్నీ మామూలుగా సాగే చిన్న చిన్న విద్యుత్ తరంగాలే.
మెదడులోని బీటా తరంగాలు సెకండుకు 13 నుంచి 30 దాకా ఉంటాయి. ఇవి చేతనావస్థనూ, కేంద్రీకృత తార్కిక ఆలోచనా ధోరణినీ, బహిర్వర్తన (ఎక్స్ట్రోవర్ట్) వైఖరినీ సూచిస్తాయి. సెకండుకు 7 నుంచి 13 దాకా ఉండే ఆల్ఫా తరంగాలు విశ్రాంతినీ, నిర్లిప్తస్థితినీ, ధ్యానాన్నీ, హిప్నోసిస్నూ సూచిస్తాయి. సెకండుకు 4 నుంచి 7 దాకా ఉండే తీటా తరంగాలు పగటికలలు కనడాన్నీ, సృజనాత్మకతనూ, ధ్యానాన్నీ, అతీంద్రియ సంఘటనలనూ, శరీరంనుంచి వేరయిన భావననూ, ఆధ్యాత్మిక భావాలనీ కలిగిస్తాయి. సెకండుకు ఒకటిన్నర నుంచి నాలుగేసి చొప్పున రేగే డెల్టా తరంగాలు గాఢనిద్రకు సంకేతాలు. మొదటిరకం ఎక్కువ తీవ్రతనూ, చివరివి తక్కువ తీవ్రతనూ కలిగి ఉంటాయి. తక్కినవి మధ్యస్తం. ధ్యానంలో ఉన్నప్పుడు ఇవన్నీ మారుతూంటాయి. ఈ మార్పులు స్థల, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ (స్త్రీ పురుషులూ, పిల్లలూ, వృద్ధులూ) వర్తిస్తాయి.
గత వ్యాసంలో వివరించినట్టుగా బౌద్ధ భిక్షువులు ధ్యానంలో ఉన్నప్పుడు వారిపై జరిపిన పరీక్షల్లో మెదడు ముందు భాగంలో ఆలోచనలని కేంద్రీకృతం చేసే ప్రక్రియలు వేగవంతం అయాయనీ, పరిసరాలనూ, స్థల స్వరూపాన్నీ గుర్తించే మెదడు పైభాగం మందగిస్తుందనీ తెలిసింది. క్రైస్తవ ఉపాసకులు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కూడా ఇదే జరిగింది. ధ్యానం చేసిన కొందరికి గుండెజబ్బుల నుంచి కొంత ఉపశమనం కూడా లభించింది. కాని ఆధ్యాత్మిక భావాల్లో కొన్ని దేవుడికి దూరమైపోతున్నట్టూ, అశాంతికి గురి అవుతున్నట్టూ కూడా అనిపిస్తాయి. పరిశోధనల్లో వీటన్నిటినీ పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఇంతమంది వేరువేరు రకాల మనుషులకు దేవుడిమీద నమ్మకం ఒకేపద్ధతిలో కలగడానికి కారణం ఏమిటి? ఇందులో వివిధ సంస్కృతుల మధ్య ఎక్కువ తేడాలు కూడా కనిపించవు. అంటే ఇటువంటి భావాలకు సులభంగా గురి అయే లక్షణాలు మెదడుకు ఉన్నట్టేనని తేలుతోంది. ఇందుకు భౌతిక కారణాలేవైనా ఉన్నాయా అని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రయోగాల్లోమతపరమైన భావాలవల్ల లాభం పొందినట్టు అనిపించినడానికి కారణం ధ్యానం వగైరాలవల్ల మెదడులో కణతలవద్ద ఉండే భాగాలు ప్రేరితం కావడమే నని తెలుస్తోంది.
వీటి ముఖ్య ఉద్దేశమల్లా ఒకటే. కేవలం మెదడులో అకస్మాత్తుగా మెదిలే కొన్ని భావాలను బలహీనతలుగా చేసుకుని కొందరు మతం పేరుతో మోసాలు చెయ్యడం జరుగుతోంది. కనక మెదడులో ఇటువంటి అయోమయం అప్పుడప్పుడూ ఎందుకు కలుగుతోందో సామాన్య ప్రజలకు తెలియజెయ్యడం అవసరం. ముఖ్యంగా మన దేశంలో చేతబడులూ, మంత్రగాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ. కనీసం చదువుకున్నవారైనా నిజానిజాల గురించి ఆలోచించగలిగితే కొంత ప్రగతిని సాధించినట్టే. మెదడులో ఏదో కారణం చేత కలిగిన భౌతికమైన అలజడికీ, దేవుడున్నాడన్న నమ్మకానికీ సంబంధమేమీ లేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిశోధనలవల్ల కొన్ని మానసిక రుగ్మతలకు నివారణ కూడా కలగవచ్చు. ఇది మందులు లేకుండా మెదడుకు తగిన ప్రేరణలిచ్చి సాధించవచ్చు. గత వ్యాసంలో చెప్పినట్టుగా ఎపిలెప్సీవల్లనూ, మాదక ద్రవ్యాలవల్లనూ కూడా కొన్నిఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి.
కొన్ని పరిశోధనల్లో “ప్రేతాత్మలు” ఆవేశించినవారి మెదడునూ, వారి నుంచి “సందేశాలు” అందుకుంటున్న ఇతరుల మెదడునూ పోల్చి చూస్తున్నారు. చైతన్యం అనేది మనిషి చచ్చిపోయినప్పుడు మెదడుతో బాటు అంతమౌతుందా, లేక శరీరానికి బయట “కొనసాగుతుందా” అనేదాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కొనసాగదంటే మనిషికన్నా బలీయమైన అతీతశక్తి ఏదో ఉందనేవారికి నచ్చదు. దేవుడి గురించి బలంగా కలిగిన భావాలన్నీ కూడా మెదడులోని నరాల విన్యాసాల వల్లనే అంటే వారు ఒప్పుకోరు. శాస్త్రవేత్తలుకొందరు మాత్రం దైవాన్ని గురించిన ఊహలన్నీ మెదడులో కలిగే భ్రమలేననీ,దేవుడనేవాడెవడూ లేడనీ అంటారు. మతాన్ని నమ్మేవారిలో కూడా బౌద్ధులు ధ్యానమే ముఖ్యంగా భావిస్తారు. దేవుడున్నాడా లేడా అనేది వారికి ప్రధానం కాదు.
మెదడు అనేది కొన్ని అణువుల, కణాల సమ్మేళనం మాత్రమేనా? మతం అనే “సంగీతాన్ని” మోగించే వాయిద్యమే మెదడు కాదా? వాయిద్యానికీ సంగీతానికీ ఉన్న సంబంధమే మెదడుకూ, ఆలోచనలకూ ఉందనేవారూ ఉన్నారు. చూస్తున్న దృశ్యాలనూ, పొందుతున్న ఇతర అనుభవాలనూ మెదడు ఎలా పసిగడుతోందో దేవుడి ఉనికిని కూడా అలాగే గుర్తిస్తోందేమో? అన్నీ రసాయనిక మార్పులే అయినప్పుడు దేవుడి గురించిన భావాలు మాత్రం అబద్ధమెందుకు కావాలి? అదీ యదార్థమేనేమో?
అసలు యదార్థత అంటే ఏమిటి? మెదడులోనూ,మనసులోనూ కలిగే భావాలన్నీ యదార్థమైనవా? పరిణామవాదాన్ని బట్టి చూస్తే నిజమైన యదార్థమేదో తెలుసుకోవడం మెదడు యొక్క బాధ్యత కాదు. ప్రపంచంలో ప్రాణి యొక్క భద్రతనూ, మనుగడనూ కాపాడడమే దాని పని. తన ఉనికిని గుర్తించుకుని, స్వపర భేదాన్ని అర్థం చేసుకుంటూ, ఉన్న కాసిని ఇంద్రియాల సహాయంతో హానికి గురికాకుండా, ఆహారాన్నీ, ప్రమాదాలనూ కనిపెడుతూ, సంతానోత్పత్తిని సాధిస్తూ, వీలున్నంతకాలం ప్రాణాన్ని నిలుపుకోవడమే దాని విధి. ఇలా అంటే మనిషిని జంతువుల స్థాయికి దిగజార్చినట్టు అనిపిస్తుందేమో కాని ప్రాణికోటిలోని వివిధ జంతువుల శరీర నిర్మాణంలోని తేడాలను బట్టి చూస్తే మనిషికి మరీ గొప్ప ప్రత్యేకత ఏదీ లేదు. అందువల్ల కేవలం ఆలోచనలనూ, ఊహలనూ ఆధారం చేసుకుని “అన్నీ” తెలుసుననుకోవడం సరైనపని కాకపోవచ్చు.
Thursday, May 8, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment