మనిషి మరణం నన్ను కలవర పెడుతుంది
అమరుడయ్యాడనూ
అరుణ తార అవుతాడనూ
ఒక మనిషి చావడమంటే
మానవత్వం ఊపిరి బిగబట్టటమే
ఏ ఊరో ఏ పేరో తెలియదు
ఎవరూ పోల్చుకోరు
కాని హతుడు మనిషని
హంతకునికి తెలుసు
అడవిలో కన్నీటి పూలు
కురిసిన చెట్టుకూ తెలుసు
శవంపై పిడికెడు మట్టి
చల్లిన గాలికీ తెలుసు
మనిషంటే వొంటరి కాదు గదా
ఒక సామాజిక ఖండం
సూర్య తాపాన్నీ సముద్ర ఆర్ద్రతనూ
తనలో ఇముడ్చుకున్న పృథ్వీ ఖండం
మనిషి ఊపిరి దీపం ఆరిపోయిందంటే
మనసు చీకటవుతుంది
నాకే పరిచయమూ లేక పోవచ్చు
నేను పేరైనా వినివుండక పోవచ్చు
ఫోటోలోనే కాదు, చూసినా
పోల్చుకోలేక పోవచ్చు
కాని అతడు మనిషని తెలిసాక
మనకు కావల్సిన వాడు
కాకుండా ఎట్లా ఉంటాడు ?
No comments:
Post a Comment