ఇదివరకు వికసించిన పువ్వులు విసిరిన పరిమళాలు
నాతో రాయించేవి
ఇప్పుడు
నీ అబద్ధాలు రాయిస్తున్నాయి-
నిజాలు.
ఇదివరకు
ఊపిరి సలపని ఉద్యమాలు ఉత్తేజం
నను నిలబెట్టేవి నడిపించేవి
ఇప్పుదు
ఊపిరాడనివ్వని నిర్బంధం, ఉక్కుహస్తం
నన్ను ఉక్కు మనిషిగా మారుస్తున్నాయి
నా విశాల ప్రపంచాన్ని దురాక్రమించి
చిన్న చిన్న అరలుగా కత్తిరించి
అటూ ఇటూ మెసలరాని అరలో నను బంధించి
అతిక్రమిస్తే జాగ్రత్త అంటున్నావు
నా చెయ్యి లోపలే వుంది
నువ్వే కదా కట్టేస్తావు
నా కలం నువ్వే కదా విరిచేసావు
నా కలల అలలు వ్యాపిస్తున్నాయని నీ ఆందోళన
నా కాళ్ళు ముడుచుకునే వున్నాను
ఈ చీకటి కొట్లో
నేను నడిచివచ్చిన బాటలో
నేను మొదటివాణ్ణీ కాను చివరివాణ్ణీ కాను
ఆ బాటలో ప్రాణం పోసుకున్న పాటకు
కాళ్ళు వచ్చాయి
నేనేం చేయను
కలల్ని బోనెక్కించి నేరారోపణ చేస్తున్నావు నువ్వు
నవ్వుతున్నాను నేను
నా చుట్టూ కట్టిన నీ ఎత్తైన గోడలు
నా కళ్ళు ఆకాశమంత ఎత్తునుంచి
ప్రపంచాన్ని చూడనేర్పినయ్
ఎప్పుడూ నేలచూపులతో రొటీన్ జీవితంలో
పరిగెత్తే నన్ను
నీలాకాశంలోకి
స్వేచ్ఛావిహంగాల విహాయసంలోకి
ఎదిగే అంతర్ముఖుణ్ణి చేసినయ్
నీ కుర్చీని కాపాడుకోవడానికి
నువ్వెంతగా జనానికి దూరమయ్యావో
ప్రజలు, అశేష ప్రజానీకం మాత్రమే
ఫాసిజాన్ని నాశనం చేస్తారన్న విశ్వాసం
నాకంతగా పెరిగింది
బయట నువ్వెంత ఒంటరివో
నీ నీడ కూడ నీకు నిజం చెప్పలేక
ఇచ్చకాలే చెప్తున్నదో
లోపల నేనంత బలగంలో వున్నాను
సిద్ధాంతబలంలో వున్నాను
ఇవ్వాళ మౌనంగా వున్నా
ఇపుడో రేపో లావాలెగజిమ్మే
అగ్నిపర్వత సదృశ ప్రజాబలంతో వున్నాను
దీర్ఘనిశ్శబ్ద నిర్బంధంలో
ఆలోచనల్ని పదునుపెడుతూ
ఇపుడు నిగళాలు రాస్తున్నాయి నియంతా
రేపు గళం విప్పి స్వేచ్ఛలో పాడుతాను
No comments:
Post a Comment