1948 సంవత్సరానికి పూర్వం ఉనికిలో వున్న హైద్రాబాద్ రాష్ట్రం (సంస్థానం)లో 5కోట్ల 11లక్షల 96 వేల ఎకరాల భూమి వుండగా 2 కోట్ల 96 లక్షల ఎకరాల భూమి సాగయ్యేది. వాటి జనాభా కోటీ 64 లక్షలు. మొత్తం 20వేల గ్రామాలుండేవి. భారతదేశంలోని 560 సంస్థానలన్నిటిలోకి హైద్రాబాద్ సంస్థానం అత్యంత విశాలమైంది. సొంత కరెన్సీ వున్న ఏకైక సంస్థానం కూడా యిదే. అట్లాగే హైద్రాబాద్ రాష్ట్రానికి ఎన్.ఎస్.ఆర్. పేరుతో సొంత రైల్వేతోపాటు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా వుండేది. సొంత సివిల్ సర్వీసూ వుండేది. కృష్ణా, గోదావరి, మంజీర, తుంగభద్ర వంటి జీవనదులు, అపారమైన బొగ్గు నిక్షేపాలు, సున్నపు రాయి గనులు, సువిశాలమైన అడవులు, హైద్రాబాద్ రాష్ట్ర సిరిసంపదలు. చక్కెర, బట్టలు, నూలు, సిగరెట్లు తదితర పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలోనే వుండేవి.
1947 ఆగస్టు 15వతేదీ నాటికి బ్రిటిష్ ఇండియాకు 233 కోట్ల రూపాయల మేరకు అప్పులుండగా హైద్రాబాద్ రాష్ట్రానికి అసలు అప్పులనేవే లేవు. 1948 అక్టోబర్ 17వ తేదిన 63కోట్ల రూపాయల మిగులు బడ్జెటుతో హైద్రాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది.
పూర్వపు రాష్ట్ర అధికార భాష ఉర్దూ, ప్రాథమిక విద్యనుంచి ఇంజనీరింగు, మెడిసన్ వంటి సాంకేతిక కోర్సులు కూడా ఉర్దూ మాధ్యమంలోనే బోధించేవారు. రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ, నాలుగు ఇంటర్మీడియట్ కాలేజీలు, జిల్లాకు ఒకటి చొప్పున ఉన్నత పాఠశాలలు, తాలూకా స్థాయిలో మాధ్యమిక పాఠశాలలు వుండేవి. సామాన్య ప్రజలకు విద్య అందుబాటులో వుండేదికాదు.
శాసన సభకు ఆదాయ వ్యయ పరిశీలన, ప్రశ్నించే అధికారాలు వుండేవికావు. న్యాయవాదులు ఎన్నుకున్న యిద్దరు సభ్యులు, జాగీర్దార్లు, రుసుందారులు, ఎన్నుకున్న మరో ఇద్దరు సభ్యులతో పాటు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రజాప్రముఖులను నిజాం నవాబు నామినేట్ చేసేవారు. స్థానిక పరిపాలనా వ్యవస్థ లేదు. మూడింట ఒక వంతు గ్రామాలు సర్ఫెఖాస్, జాగీర్దార్ల అధీనంలో వుండేవి. పాల్వంచ, వనపర్తి, గద్వాల, దొంచ, రాజోలు, పాయెగా సంస్థానాలుండేవి.
రాష్ట్రంలోని 760 సర్ఫెఖాస్ గ్రామల నుంచి నిజాం నవాబుకు ఏడాదికి రెండు కోట్ల రూపాయల ఆదాయం లభించేది. వేడుకలు,పండగల సందర్భాలలో నజరానాల పేరుతో నవాబు అత్యంత విలువైన బహుమతులు స్వీకరించేవాడు. హైద్రాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సమయంలో ఏడవనిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా పేరు గాంచినాడు. ఒకే ప్రాంతంలో కాకుండా నీటి వసతి వున్న గ్రామాలను అక్కడక్కడా ఎంచుకొని జాగీర్లు ఏర్పాటు చేసుకునేవాడు. పలువురు జాగీర్దార్లకు సొంత రెవిన్యూ, పోలీసు, న్యాయ, సైనిక వ్యవస్థలుండేవి.
హైద్రాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలుండేవి. వాటిలో 5 జిల్లాలు ఔరంగబాదు, బీడ్, పర్భని, నాందేడు, ఉస్మానాబాదులోని 5ం లక్షల జనాభాలో అత్యధికులు మరాఠీభాష మాట్లేడేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మరాఠ్వాడాగా వ్యవహరించేవారు. మూడు జిల్లాలు గుల్బర్గా, రాయచూరు, బీదరులలోని 30లక్షలజనాభాలో ఎక్కువమంది కన్నడ భాష మాట్లాడేవారు. మిగిలిన ఎనిమిది జిల్లాలు కరీంనగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్,మెదక్, నల్లగొండ, అత్రాఫ్ - ఎ - బల్దియా ప్రాంతాన్ని తెలంగాణాగా వ్యవహరించేవారు. తెలంగాణ ప్రాంతం జనాభా 84 లక్షలు.
ప్రజల అశేష త్యాగాలు, బలిదానాలవల ్ల నిరంకుశ నిజాం అనువంశిక పాలన నుంచి హైద్రాబాద్ రాష్ట్రం విముక్తమైంది. హైద్రాబాద్ రాష్ట్రం 63 కోట్ల రూపాయల మిగులు నిధులతో 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. దాంతో రాష్ట్ర ప్రజలు హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని స్వేచ్ఛగా జీవించసాగినారు.
నిరంకుశ నిజాం పరపాలన నుంచి హైద్రాబాద్ రాష్ట్రం విముక్తం కాగానే ప్రజలు సామాజిక సంస్కరణలకు నడుము బిగించారు. అప్పటికే రూపొందిన గిరిజనుల భూమి పరిరక్షణ చట్టం 1/7ని ఆచరణలోకి తెచ్చినారు. రాజు, రాజబంధువులు జాహీర్దారులు, భూస్వాములు, పెత్తందార్ల అదీనంలోని భూముల మీద వాస్తవంగా సేద్యం చేస్తున్న రైతులకు హక్కు కల్పించటానికి 1952- 53లో కాస్ర - పహణి ద్వారా రక్షిత కౌల్దారీ చట్టం రూపొందించి అమలు చేసినారు. అట్లాగే అప్పటివరకూ కాగితాలకే పరిమితమైన అనేక సాగునీటి పథకాల నిర్మాణానికి చర్యలు చేపట్టినారు. ఇదిలా వుండగా 1952లో పొట్టి శ్రీరాములు ఆత్మబలి దానంతో మద్రాసు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, జిల్లాలలో తెలుగు మాట్లాడే ప్రజల కోరిక మేరకు కర్నూలు, రాజధానిగా 1953 అక్టోబర్ 1తేదిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ”జస్టిస్ ఫజల్ ఆలీ” కమిషన్ మరాఠీ మాట్లాడే 5 జిల్లాలను మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే 3 జిల్లాలను కర్నాటక రాష్ట్రంలో కలుపుతూ, ఆంధ్రలో తెలంగాణ విలీనం గురించి యిట్లా వ్యాఖానించింది.
తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సౌకర్యాలతో కూడిన రాజధాని, కృష్ణా, గోదావరి, మంజీరా మొదలగు నదులతో సమృద్ధిగా జలవనరులు, అపారమైన ఖనిజ సంపద, అపారమైన అటవీ సంపద, వున్నాయి. ఆంధ్ర ప్రాంతంవారు విద్య, ఆర్థిక రంగాలతో పాటు పరిపాలనారంగంలో అభివృద్ధి చెందినారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు కనీసం తెలుగు భాషలో విద్యావకాశాలు లేవు. కనుక ఆంధ్రపాలకుల వల్ల తెలంగాణకు న్యాయం జరగదని కమిషన్ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం అందోళన చేసినారు. తెలంగాణలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందనే అభిప్రాయంతో నిపుణుల సిఫారుసు, ప్రజల అభీష్టానికీ వ్యతిరేకంగా వెనుకబడిన, అణగారిన తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించి, 1-11-1956న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినారు.
రక్షణలు
తెలంగాణ ప్రాంతంలోని భూములను ప్రాంతీయ సంఘం అనుమతి లేకుండా ఖరీదు చేయరాదు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలుతెలంగాణ వారికే ఇవ్వవలెను. అప్పటికే అమలులో వున్న ముల్కీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. తెలంగాణ ప్రాంతంలోని అదనపు వనరులు ద్వారా లభించే ఆదాయం, (అబ్కారి, బొగ్గు, ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రలపై వచ్చే ఆదాయం) తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయవలసి వుంటుంది. వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ది చేయటానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రాజకీయాధికారం సముచిత దామాషాలో వుండాలి.
హైద్రాబాద్ రాష్ట్రంలోని అపరిమిత సంపద వనరులు, మొత్తం పాలకుల స్వాధీనంలో ఉండినాయి. ప్రజలు మాత్రం విద్య, సామాజిక, ఆర్ధిక రంగాలలో దయనీయ స్థితిలో ఉండినారు. పాలకులు తమ నివాస పరిపాలన ప్రాంతాలలో మాత్రం ప్రజాధనంతో అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 4 సంవత్సరాలకే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినారు. దాంతో తెలంగాణ మరింతగా దోపిడీకి గురి అయ్యింది.
1956 నవంబరు ఒకటో తేది నాటికి ఆంధ్ర ప్రాంతం రెవిన్యూ (భూమిశిస్తు) 6 కోట్ల 60 లక్షల 63 వేల రూపాయలు వుండగా తెలంగాణ ప్రాంత రెవిన్యూ 3 కోట్ల 42 లక్షల 9 వేల రూపాయలుగా వున్నది. సంవత్సరానికి 7 కోట్ల రూపాయల అబార్కి ఆదాయంతో పాటు బొగ్గుపై లభించు సెస్సు అదనంగా వుండేది.
No comments:
Post a Comment