తెలంగాణ ప్రజలు తమ యడల ఆంధ్ర ప్రాంతీయులు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుండే కాదు, 1948లో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన నాటి నుండి పోరాడుతూనే ఉన్నారు.
”పోలీసు చర్య”తో హైదరాబాదు రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీన పరచగనే జనరల్ చౌదరి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం పౌర పాలనా అధికారులు పూర్వ భారతదేశంలో సీనియర్ సివిల్ సర్వెంట్ యం.కె.వెల్లోడి ఆధిపత్యంలో హైదరాబాదు రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు వందల మంది తమిళ, కేరళ, కన్నడ, ఆంధ్ర అధికారులు మొదటిసారిగా యిక్కడకు మద్రాస్ రాష్ట్రంనుండి తీసుకరాబడ్డారు. తమ రాష్ట్రంలో చిన్న ఉద్యోగులుగా ఉన్న అనేకమంది యిక్కడకు రాగానే అధికారులైనారు. ఇక్కడి ప్రతి ఉద్యోగంలో వీరు తమ ప్రాంతం వారిని భర్తీ చేయడం ప్రారంభించారు. తర్వాత కొన్నాళ్ళకు స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడ ఆంధ్ర అధికారుల దిగుమతి కొనసాగుతూ పోయింది.
1952 నాటికి పరిస్థితి మరీ తీవ్రమై, ఆంధ్రప్రాంతీయుల వలన నానాటికి పెరిగి, ఈ ప్రాంతీయులకు ఉద్యోగాలు దొరకడం కష్టమై, ఆంధ్ర ప్రాంతీయుల దురుసు ప్రవర్తన, దొరతనపు వైఖరి ఈ ప్రాంతీయులలో ఏవగింపు కలుగజేయటంతో ”ముల్కీ ఉద్యమం” ప్రారంభమైనది. అందువల్ల క్రిందిస్థాయి ఉద్యోగాలలో యిక్కడి వారికి అవకాశం దొరకాలనీ బయటి వారికి ప్రాధాన్యత కూడదని 1952 లో ఉద్యమం జరిగింది. తీవ్రమైన ఆ ఆందోళనలో జరిగిన హింసాకాండలో, ఆందోళన కారులు ముఖ్యమంత్రి అధికార వాహనాన్నే తగుల పెట్టారు. పోలీసు కాల్పులలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన అనంతరం ప్రభుత్వం కళ్లుతెరిచి కొన్ని చర్యలు గైకొన్నది. ఈ అనుభవాన్ని గుణపాఠంగా ఉంచుకొని తెలంగాణ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంతో విలీనమవడానికి వ్యతిరేకించారు.
భాషా రాష్ట్రాల ఏర్పాటు సమస్య 1908 నుండే నలుగుతున్నా అనేక మంది భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. 1928లో నెహ్రూ యిలాంటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నా ఆ తర్వాత అనేక చిక్కు సమస్యలు అనుభవంలోనికి రావడంతో ఆయనకూడ తన అభిప్రాయాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు.
ఆంధ్ర, కర్నాటక, రాష్ట్రాలు భాష ప్రాతిపదికపై ఏర్పడాలని 1937లోనే నిర్ణయించిన అఖిలభారత కాంగ్రెస్, 1938లో తన నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ తాను అధికారంలోకి రాగానే ఈ ఏర్పాటు చేయగలమని వాగ్దానం చేసింది. స్వాతంత్య్రానంతరం తన ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశం కాంగ్రెస్ పొందుపరిచింది.
ఆయా ప్రాంతాలవారు కోరుతున్నందున, సువిశాల మద్రాస్ రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి, మహారాష్ట్ర, ఆంధ్ర, కేరళ, కర్నాటక రాష్ట్రాలను భాష ప్రాతిపదికపై రూపొందించే విషయం పరిశీలించడానికి 1948లో కాంగ్రెస్ నాయకులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం అందుకు సుముఖతను వ్యక్తపరుచనందున దాని నివేదికను పరిశీలించేందుకు, దాని ఆధారంతో భాషా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి వేరొక నివేదికను సమర్పించేందుకు శ్రీ నెహ్రూ, శ్రీ పటేల్, శ్రీ పట్టాభిగార్లతో అఖిల భారత కాంగ్రెస్ త్రిసభ్య సంఘాన్ని నియమించింది. చివరకు తేలింది ప్రజాభిష్టానికి అనుకూలంగా వ్యవహరించాలని. దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఈ సమస్యపై ఏకాభిప్రాయం కుదరలేదు. విభజన వాయిదా పడింది.
పూర్వం హైదరాబాదు రాష్ట్రానికి వచ్చి స్థిరపడి ”ఆంధ్ర” పేరుతో అనేక సంస్థలను స్థాపించుకున్న ఆంధ్రులు, రాజకీయాలలో స్థిరపడి పోయినవారు, వారి అంతేవాసులు మాత్రం తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో కలవడానికి సుముఖతను వ్యక్త పరిచారు. అంటే ఆంధ్రులు మాత్రం ఆది నుండి తెలుగు ప్రజలంతా ఏక రాష్ట్రంలో ఉండాలని కోరుతున్నారు. 1952 సాధారణ ఎన్నికలలోను, ఆ తరువాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఊపందుకున్నది. 1953లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన తెలుగు జిల్లాలు ”ఆంధ్ర రాష్ట్రం”గా ఏర్పడినాయి. నాటి నుండి ”విశాలాంధ్ర” ఏర్పడాలన్న కోరికలను ఆంధ్రులు ముమ్మరం చేశారు. అయితే మద్రాస్, ఆంధ్ర కాంగ్రెస్ సంఘాలు, మద్రాస్ ప్రభుత్వం, ఆంధ్రులు విడిపోవడానికి అంగీకరించడంతో అక్కడ ఏ చిక్కు ఉత్పన్నం కాలేదు. రాజధాని గురించి పేచీవచ్చి, ఈ విడగొట్టటంలో కేంద్ర ప్రభుత్వం కొంత జాగుచేయడం వల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నిరసన దీక్షపూని ప్రాణత్యాగం చేయడం, పెద్ద ఆందోళన అనంతరం 1953 అక్టోబర్ మొదటి తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించడం జరిగింది. మద్రాస్ నగరం తమ రాజధానిగా ఉండాలన్న డిమానిడ్‌ను ఆంధ్ర నాయకులు తరువాత వదులుకున్నారు.
తెలంగాణ ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని చారిత్రక సత్యాలను ఇక్కడ పరిశీలించడం అవసరం. హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ సంఘంలోని తెలంగాణ ప్రాంత సభ్యులు 1954 జూన్ 7, 8 తేదీలలో హైదరాబాదులో సమావేశమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కేవలం భాష ప్రాతిపదికపైన కాక, శ్రీ నెహ్రూ 1953 డిసెంబర్ 20న పార్లమెంట్‌లో ప్రకటించినట్టు, భారత దేశాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండే అనువైన విభాగాలుగా, శాస్త్రీయ దృక్పథంతో విభజించే సూచనలు చేయటం రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం బాధ్యతయై యున్నదని కూడా హైదరాబాదు పి.సి.సి. గుర్తు చేసింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు శాస్త్రీయ దృక్పథంతోను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యాను ఆచరణ యోగ్యమని తెలియ చెప్పింది.
సుమారు రెండు సంవత్సరాల అనంతరం 1955 అక్టోబర్ 10న తన నివేదికను సమర్పించిన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం కూడ తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో విలీనమవడాన్ని వ్యతిరేకించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ, ప్రత్యేక రాష్ట్రానికి కావలసిన వనరులు, సంపత్తి తెలంగాణకు ఉన్నవని వక్కాణించింది.
కన్నడ, మహారాష్ట్ర, తెలుగు భాషల ప్రాంతాలతో కలిసిఉన్న హైదరాబాదు రాష్ట్రం విభజింపబడి మహారాష్ట్ర ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో, కన్నడ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో కలవాలని హైదరాబాదు కాంగ్రెస్‌లో ఆనాడు ఉన్న ఆ రెండు భాషా వర్గాలు అంగీకరించాయి. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం (యస్.ఆర్.సి.) కూడ ఈ ప్రతిపాదనను ఆమోదించినది. అయితే, తెలంగాణ ప్రాంతం భవిష్యత్తు గురించే కాంగ్రెస్ వారిలో ముఠాల ప్రాలితిపదికపై అభిప్రాయ భేదాలు ఏర్పడినవి. ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న శ్రీ స్వామి రామ నందతీర్థ, వినాయక్ రావు విద్యాలంకార్ అనే మరొక నాయకుడి సమర్థనతో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలవాలనే ”ఆంధ్ర” నాయకుల డిమాండ్‌కు వంతపాడగా, నాటి ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణారావు, కాంగ్రెస్ వర్గ నాయకులు శ్రీ కె.వి. రంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ జె.వి.నరసింగరావు ప్రభృతులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరారు.
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలవాలన్న ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకించారు. విద్యార్థులు తృణీకరించారు. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం వీరి అభిప్రాయాలతో ఏకీభవించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆమోదించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది? దీనికి కారణం ఆంధ్ర నాయకుల తియ్యటి మాటలు, కల్లబొల్లి కబుర్లు, కపట నాటకాలు. వారికి ఢిల్లీలో పలుకుబడి ఉన్నందున వాస్తవ విషయాలను మసిపూసి మారేడు కాయచేసి, కేంద్ర నాయకులను తమ వాదంవైపు తిప్పుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది దక్షిణ పాకిస్తాన్ కాగలదని బెదిరించారు. నాడు హైదరాబాదు రాష్ట్రంలో కమ్యూనిస్టుల పలుకుబడి అధికంగా ఉన్నందున, కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడగలదని కేంద్ర నాయకులను భయపెట్టారు. తాత్కాలిక ప్రాతిపదికపై తాము రాజధానిని కర్నూలు పట్టణంలో ఏర్పరుచుకున్నందున, తమకు రాజధాని నగర సమస్య కూడా పరిష్కారం కాగలదని వారు చేసి ఆలోచనను కేంద్ర నాయకులు గుర్తించారు.
పరిమిత వనరులు, ఆదాయానికి మంచిన వ్యయంతో, నూతన ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న రోజులు అవి. మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోవటానికి ముందు నుండే హైదరాబాదు రాష్ట్ర వనరులపై కన్నుపడిన ఆంధ్ర నాయకులు ”తెలంగాణ సమైక్యత” నినాదానికి పదును పెట్టి తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో విలీనాని కంటే తమకు వేరే మార్గం లేదని విశ్వసించారు. ఆంధ్ర ప్రాంతంలో విలీనానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో, ప్రజలలో అధిక సంఖ్యాకులు విముఖులుగా ఉన్నందున వారిని ఏదో రకంగా ఒప్పించే ఆలోచనలు చేశారు. ఈ ఎత్తులలో భాగంగానే 1955 నవంబర్ 25వ తేదీన నాటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ప్రవేశపెట్టిన ఒక అధికార తీర్మానాన్ని ఆంధ్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మరొక తీర్మానాన్ని ఆనాటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 ఫిబ్రవరి మొదటి తేదీన ప్రవేశపెట్టగా దానిని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ ఆంధ్రలో తెలంగాణ విలీనం పట్ల అమిత ఆసక్తి కనపరిచింది.
తెలంగాణ ప్రజలకు తగిన రక్షణలు, వారి హక్కుల భద్రతకు చట్టపరంగా గ్యారంటీలు ఇవ్వడమే ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆ రెండు అధికార తీర్మానాల ఉద్దేశ్యం. రక్షణల అమలుకు ఈ తీర్మానాలు స్పష్టంగా ఒక గడువు విధించలేదు. తెలంగాణ వారు తమకు ఆంధ్రనాయకులు రక్షణలు కల్పించాలని కోరలేదు. తెలంగాణ వారు ఆందోళన వెలిబుచ్చినది తమ వనరులను ఆంధ్రులు దోచుకొని చట్టబద్దంగా తమకు దక్కనున్న వ్యవసాయనీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించి తెలంగాణను ఒక కాలనీగా మార్చగలరన్న భయ ఆందోళనలే.
ఏమైతేనేం, తెలంగాణ ప్రజల ”అపోహల” నివృత్తికి తమ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టపర తీర్మానాలను చంకలో పెట్టుకొని ఢిల్లీ వెళ్లి మకాం వేసిన ఆంధ్ర కాంగ్రెస్ అగ్రనాయకులు చిట్ట చివరకు ప్రధాన మంత్రి నెహ్రూ, దేశీయాంగమంత్రి గోవింద వల్లభపంత్ వంటి జాతీయ నాయకులను ప్రసన్నం చేసుకొని, ప్రభావితం చేయగలిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే బ్రాహ్మణ కులస్తుడైన తనను రెడ్డి కుల అగ్రజులు, భూస్వాములు ముఖ్యమంత్రి కానివ్వడం కల్ల అని ఆనాటి హైదరాబాదు ముఖ్యమంత్రి డా||బూర్గుల రామకృష్ణరావుకు ఆంధ్ర బ్రాహ్మణ నాయకులు అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకట్రావు వంటి వారు ఊదర కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును స్వామి రామనందతీర్థ సుముఖత తెలిపినందున, శ్రీ పి.వి.నరసింహారావు, ఆయన ఇతర అనుయాయులు కూడ ఆంధ్రలో తెలంగాణ విలీనాన్ని సమర్థిస్తూ ఊరూరా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. విశాలాంధ్ర వాదుల సభలను ప్రత్యేక రాష్ట్రవాదులు భంగపరచడాన్ని ప్రభుత్వం మొదట నిరోధించలేదు. తన భవిష్యత్తుపై నిర్ణయం జరిగిన అనంతరమే ముఖ్యమంత్రి రామకృష్ణరావు విశాలాంధ్రవాదులు స్వేచ్ఛగా సభలు జరుపుకునేందుకు గట్టి చర్యలు గైకొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణలో చెలరేగిన ప్రజా ఉద్యమం ప్రభుత్వ పునాదులను కదిల్చివేయడంతో, పరిస్థితిని పరిశీలించేందుకు, కాంగ్రెస్ అధిష్టానవర్గం అప్పటి బొంబాయి కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు శ్రీ యస్.కె.పాటిల్ నాయకత్వాన ఒక ప్రతినిధి వర్గాన్ని హైదరాబాద్ పంపించింది. ఈ ప్రతినిధి వర్గం కూడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సూచించినది. అయినప్పటికీ కేంద్ర నాయకులు, ఆంధ్ర నాయకుల వత్తిడి నుండి తప్పించుకొనలేక పోయారు. ఢిల్లీలో కేంద్ర నాయకుల ద్వారా ఆంధ్ర నాయకుల ప్రభావంపడి శ్రీ రామకృష్ణరావు తన వైఖరిని మార్చుకుని అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును సమర్థించారు. (తనకు గవర్నర్ పదవి దొరకగలదని బూర్గుల రామకృష్ణరావు ఆశించారు. తరువాత ఆయనను కేంద్ర ప్రభుత్వం కేరళ గవర్నర్ చేసింది)
తెలంగాణ ప్రజానీకంలో అధికసంఖ్యాకులు విడిగా ఉండాలనే అభిప్రాయాన్ని కలిగి యున్నారన్న సంగతి రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం (యస్.ఆర్.సి.) కూడా మరుగుపరచలేదనే సంగతి అంతకుముందు ప్రస్తావించడం జరిగింది. అందువలన, ఆ సంఘం స్థూలంగా ఏమి చెప్పింది అనే సంగతి ఇక్కడ పరిశీలిద్దాం.
…. ”ఆంధ్రప్రాంతం ప్రజలంతా తెలంగాణ తమ రాష్ట్రంలో కలవాలనే ఆత్రుతతో ఉన్నప్పటికీ తెలంగాణవారు మాత్రం స్పష్టంగా అందుకు వ్యతిరేకులుగా ఉన్నారు. విలీనీకరణ వాంఛనీయమే అయినప్పటికీ అది తెలంగాణ ప్రజల యిష్ట ప్రకారం వారి ఆమోదంతోనే జరిగితే బాగుంటుంది. ఈ అభిప్రాయాన్ని కొందరు బాధ్యతగల ఆంధ్రనాయకులు కూడా వ్యక్తపరిచారు. ఈ విషయంలో తుది నిర్ణయం గైకొనే అధికారం మౌలికంగా తెలంగాణ వారికే ఉండాలి అని వారు అభిప్రాయపడినారు” అని యస్.ఆర్.సి. తన నివేదికలో 382 పేరాలో వెల్లడి చేసింది.
అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ సదుపాయాల గురించి ఆంధ్ర నాయకులు కొన్ని హామీలు యిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంగతి మనసులో ఉంచుకొని ఆ విషయంలో యస్.ఆర్.సి. ఇలా అభిప్రాయ పడింది. (పేరా 384)
…. ”హామీల రూపం సంతరించుకొననున్న, ఆ ప్రాంతానికి (తెలంగాణకు) యివ్వజూపిన ”రక్షణల” గురించి మేము చాలా జాగ్రత్తగా పరిశీలించాము. రాయలసీమ, సర్కారు జిల్లాల వారికి కుదిరిన శ్రీ బాగు ఒప్పందంలోవలె, ఇవ్వజూపే రక్షణలు కానీ, యింగ్లాండులో ఉన్నటువంటి స్కాటిష్ ”డివాల్యూషన్” వంటి రాజ్యాంగబద్ధమైన రక్షణలు కానీ తెలంగాణకు సరిపోవు… కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా ఉండే ఏ హామీలైనా నిరర్ధకమే”.
న్యాయమూర్తి ఫజులాలీ అధ్యక్షతన, శ్రీ హృదయనాథ్ కుంజ్రా, శ్రీ కె.యం. పణిక్కర్ వంటి మేధావులతో ఏర్పాటైన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం తెలంగాణ గురించి వ్యక్తపరిచిన అభిప్రాయాలలో మరికొన్ని ముఖ్యమైనవి, శాశ్వతంగా గుర్తుంచుకొనదగినవి దిగువ పేర్కొనడం జరిగింది.
…. ”తమకంటే అధిక విద్యావంతులు, లౌకికులునైన కోస్తా జిల్లా వారు మిడతల దండువలె తెలంగాణపై విరచుకపడితే, తాము ఎందుకు కొరగాకుండా పోతామని, విద్యా విషయాలలో వెనుకబడి ఉన్న తెలంగాణ వారు భావిస్తున్నారు… ఆంధ్రులతో పొత్తుపెట్టుకుంటే, వారితో సరితూగలేనందున, లౌకికులైనవారే, తక్షణం అన్ని లాభాలను పొందుతారు. ఒకనాడు నగరాన్ని, తెలంగాణ ప్రాంతమంతటిని కూడా తమ కాలనీగా మార్చే ప్రమాదం ఉన్నది…”
”….ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చూపబడిన కారణాలను ఎవరూ తేలికగా ప్రక్కకు నెట్టివేసే వీలులేదు”.
”….ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాటినుండి ఆర్థిక యిబ్బందులతో సతమతమవుతున్నది. ఆంధ్రలో తలసరి సగటు రెవెన్యూ ఆదాయం కూడా (తెలంగాణకంటే) చాలా తక్కువ. తెలంగాణాలో భూమి శిస్తు ఆదాయం, ఆబ్కారి ఆదాయం అధికంగా ఉండటంవల్ల ఆ ప్రాంతానికి ఆర్థిక యిబ్బందులు ఉత్పన్నమయే అవకాశం లేదు.” ఈ ఆదాయం మాట అటుంచి పెద్ద మొత్తం రిజర్వు నిధులు కూడ హైదరాబాదు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.”
”…. కరువు కాలంలో కూడా తెలంగాణాలో ఖర్చుకంటే ఆదాయం ఎన్నోరెట్లు అధికంగా ఉన్నది.”
”….విలీనీకరణవల్ల పరిపాలన విషయంలో కూడా తెలంగాణకు ఒనకూరే లాభంలేదు. పూర్వ హైదరాబాదు రాష్ట్రం ‘కౌలుదారీ శాసనం’ వంటి అనేక అభ్యుదయకర చట్టాలను అమలు జరిపింది.”
”…. నందికొండ, (నాగార్జునసాగర్) గోదావరి (పోచంపాడు) వంటి, దేశానికే గర్వకారణమైన అతిముఖ్య ప్రాజెక్టులు నిర్మించాలని హైదరాబాదు ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని, నీటి పంపకంపై మద్రాస్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఇపుడు ఆంధ్రప్రభుత్వంతో కొనసాగిస్తున్నది. ఈ ప్రాజెక్టుల విషయంలో మున్ముందు ప్రణాళికలు అమలు చేసేటప్పు%డు విశాలాంధ్ర ప్రభుత్వంలో తమ ప్రయోజనం నిర్లక్ష్యం చేయబడగలదేమో అనే భయం కూడా తెలంగాణ వారిలో గాఢంగా ఉన్నది.
”…. ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణాలను వడివిడిగా రెండు రాష్ట్రాలుగా ఉంచడం ఉభయ ప్రాంతాల వారికి శ్రేయస్కరమనే మేము నిర్ణయించాము. 1962 సాధారణ ఎన్నికల అనంతరం అప్పటి తెలంగాణ శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది అంగీకరించినట్లయితే, అప్పుడు రెండు రాష్ట్రాలను విలీనం చేసే అవకాశం ఉంచుకొనవచ్చు.”
చివరకు 1956 మార్చి 5వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆంధ్ర-తెలంగాణలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం గైకొన్నదని అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ వెల్లడి చేశారు. ”కలిసి ఉంటే పొంతన కుదరకపోతే, ఆలుమగలు విడాకులు పుచ్చుకున్నట్టే కొంత కాలం తర్వాత రెండు ప్రాంతాలు మళ్ళీ విడిపోవచ్చు”నని నెహ్రూ ఆ సందర్భంలో సలహా యిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంతటి బాధ్యతగల పదవిలోనైనా ఉండవచ్చు, ఒకసారి అతనికి ఆ తీర్థం (కాంగ్రెస్ సభ్యత్వం) దొరికినదా అంటే అతడు చెప్పేదానికీ చేసేదానికీ సామ్యం ఉండదు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోకానీ, స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాష్ట్రాలలోను, కేంద్రంలో పరిపాలనచేసిన, చేస్తున్న నాయకుల చరిత్రలలోను మనకు కొట్టవచ్చినట్టు కనిపించే సత్యం ఇదే.
అందువల్లనే, కాంగ్రెస్ అధిష్టానవర్గ నాయకులు ఫజలావంటి మేధావి అధ్యక్షతన ఏర్పడిన న్యాయమూర్తుల సంఘం అభిప్రాయాలను కానీ, ఈ ప్రాంతం ప్రజల అభిప్రాయాలను కానీ లెక్కచేయక కేవలం కొందరు ఆంధ్ర నాయకులను తమ తొత్తులుగా ఉన్న వారిని - సంతృప్తి పరిచేందుకు, వారి టక్కరి టమాకారు మాటలను నమ్మి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అంగీకరించారు.
మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజలే తమ భవిష్యత్ నిర్ణేతలనీ శ్రీ నెహ్రూ పండితునితో సహా నాయకులంతా నెత్తిన నోరు పెట్టుకొని ఇసుకదంపు ఉపన్యాసాలు చేస్తుంటారే ఎక్కడకు పోయింది ఆ ప్రజాస్వామ్యం తెలంగాణ విషయంలో? అనేక సందర్భాలలో ఋజువైనట్టు మన ప్రజాస్వామ్యానికి అర్థం కేవలం అవకాశవాదమే. అప్పటి అవకాశాన్ని అనుసరించి, గత్యంతరంలేక ఆంధ్రనాయకులు తెలంగాణ ప్రజలకు కొన్ని ”రక్షణ”లు కల్పించారు కనుక, ఆ సందర్భంలో రెండు ప్రాంతాలకు చెందిన ”పెద్ద మనుషులు” ఆ నాటి కేంద్ర దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ గోవింద్‌వల్లభ్ పంత్ సమక్షంలో కొన్ని ”ఒప్పందాలు” చేసుకున్నారు.
1956 ఆంధ్ర-తెలంగాణ ఒప్పందం
ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు చట్టబద్ధ తీర్మానాలు వాటిలో ఇచ్చినటువంటి హామీలు, రక్షణలు ప్రాతిపదికగా ఎంతో ఉదారమైన షరతులతో ఆంధ్రనాయకులు తెలంగాణ ముఖ్యులతో ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీనినే ”పెద్ద మనుషుల ఒప్పందం”గా పిలిచారు. ఆంధ్ర రాష్ట్రంవైపు నాటి ముఖ్యమంత్రి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ గౌతులచ్చన్న, శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ఒప్పందంపై సంతకాలు చేయగా హైదరాబాద్ రాష్ట్రం పక్షాన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, శ్రీ జె.వి.నరసింగరావు, డాక్టర్ యం. చెన్నారెడ్డి సంతకాలు చేశారు.
ఈ ”పెద్ద మనుషుల” ఒప్పందంలో, కాల పరిమితి లేకుండా కల్పించబడిన చట్టబద్ధ రక్షణలలో కొన్ని ముఖ్యమైనవి.
1. రాష్ట్ర పరిపాలనపై జరిగే వ్యయాన్ని రెండు ప్రాంతాలు తగు అనుపాతంలో భరించిన అనంతరం తెలంగాణా ఆదాయంలో మిగిలే నిధులను (ఆంధ్రప్రాంతంపై ఖర్చు చెయకుండా) తెలంగాణ అభివృద్ధికే ప్రత్యేకించి ఉండాలి.
2. తెలంగాణాలో ఉన్న విద్యా సౌకర్యాలు అక్కడి వారికే ప్రత్యేకించి, వాటిని ఇంకా అభివృద్ధి పరచాలి. సాంకేతిక (వృత్తి) విద్యా సంస్థలతో సహా తెలంగాణ ప్రాంతంలోని కళాశాలలలో ప్రవేశాలు తెలంగాణ వారికే పరిమితమై ఉండాలి. (ఆనాడు తెలంగాణాలో విద్యాలయాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి.) లేకుంటే రాష్ట్రం మొత్తంలోని విద్యా సంస్థలలో మూడవ వంతు స్థానాలు తెలంగాణ వారికి ప్రత్యేకించాలి. ఈ రెండు పద్ధతులలో తెలంగాణ వారికి ఏది అనుకూలంగా లాభదాయకంగా ఉంటే అదే అనుసరించాలి.
3. ఉద్యోగాలలో నియామకం రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికపైననే జరగాలి.
4. తెలంగాణ వారికి ఉద్యోగాలు దొరకగలవనే హామీ ఉండేందుకుగాను ఆ ప్రాంతంలో నియామకాలకు నివాసానికి సంబంధించిన నిర్బంధాలు విధించాలి. (ముల్కీ నియమాలు కొనసాగించాలి)
5. ముఖ్యమంత్రి గానీ, ఉపముఖ్యమంత్రి గానీ, తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఎవరైతే, వారి అధ్యక్షతన తెలంగాణకు ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి. (తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు అంతా ఈ చట్టబద్ధ ప్రాంతీయ సంఘ సభ్యులుగా ఉంటారు.) అవసరాలను బట్టి ఆ ప్రాంతం సర్వతోముఖ వికాసాన్ని సాధించేందుకు ఆ సంఘం కృషి చేస్తుంది.
6. ముఖ్యమంత్రి, ఉప మంత్రి పదవులలో ఒక దానిలో తెలంగాణ వారుంటే మరొక దానిలో ఆంధ్ర వారు ఉండాలి. ఆంతరంగిక, ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య పారిశ్రామిక, ప్రణాళిక అభివృద్ధి వంటి ముఖ్య శాఖలు ఐదింటిలో రెండు తెలంగాణ వారికి యివ్వాలి.
7. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ భూములు కొనుగోలు, అమ్మకం ప్రాంతీయ సంఘం అనుమతితోనే జరగాలి
No comments:
Post a Comment