-సంకెపల్లి నాగేంద్ర శర్మ
Bathukamma
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో….బంగారు బతుకమ్మ ఊయ్యాలో… అంటూ వయస్సు, అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తెదవులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరంతో కలిసి ఆడుకునే తెలంగాణా ట్రేడ్ మార్కు పండుగ. గుజరాతీలు, రాజస్ధానీలు శరన్నవరాత్రులలో జరుపుకునే దాండియా, గర్బి ఆటతో ఆ పండుగను పోల్చవచ్చును. బతుకమ్మల పండుగ, ఇది పల్లె ప్రజల పండుగ, ముఖ్యంగా మహిళలు కోలాహలంగా జరుపుకునే జానపదులు పండుగ. ఆశ్వీజ మాసంలో దసరా ముందు అరుదెంచే తొమ్మిది రోజుల పండుగ. ఈ పండుగ ప్రాశస్త్యాన్ని, తెలంగాణ పొగసూరిన బతుకుల వెనుకబాటుతనాన్ని, ఉద్యమాల త్యాగనిరతిని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను గూర్చి కరీంనగర్ రచయిత్రి శ్రీమతి సబ్బని శారద 2001లో రాసిన ‘తెలంగాణా బతుకమ్మ పాట’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తెలంగాణా భాషలోని వంపుసొంపైన పదాల మాటలతో ఆమె అల్లిన 34 పేజీల గ్రంధ రూపంలో బతుకమ్మ దీర్ఘ గానవాహిని వింటే మనసు పులకించి, ఆవేశం జలగంగలా ఉప్పొంగుతుంది. తెలంగాణా జిల్లాల వెనుకబాటుతనాన్ని, మూతబడుతున్న ఫ్యాక్టరీలు, రైతుల, నేతన్నల ఆత్మహత్యలు, పనులు లేక చినిగిన విస్తర్లయిన కూలీల బతుకులు, ఆకలిచావులు, బీడీ మహిళా కార్మికుల వెతలు, వలసవాదుల దోపిడిిని, మొసలి కన్నీరు కార్చే పాలకుల వివక్షతలను, ఆమె తూర్పారబడుతూ చిత్రీకరించిన తీరు అద్భుతంగా కనిపిస్తుంది. జానపదుల కళలైన ఒగ్గు కథలా, చిందు యక్షగానంలా, వీధి బాగవతుల గాన మాధుర్యతల శైలి ఇందులో అలరారుతుంది. కొత్త తరహా ప్రక్రియలో ఈమె రాసిన బతుకమ్మ పాటలు జనాదరణ పొందాయి. ఆడియో క్యాసెట్లుగా కూడా విడుదలై ఈ ప్రాంత జనాల నోళ్ళలో నానుతున్నాయి.
పండుగ నేపథ్యం:
మహాలయ అమావాస్య నుండి దసరా ముందు దుర్గాష్టమి వరకు తెలంగాణా ప్రాంతంలో ఈ పండుగను జరుపుకునే ఆచారం ఉంది.
ఓ విధంగా చెప్పాలంటే గౌరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించే పండుగ.
ఈ పండుగ పారమార్థికాన్ని పరిశీలిస్తే సుమారు 2 వందలు ఏళ్ళ నుండి ఈ పండుగ తెలంగాణలో అమలులో వున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కరువు-కాటకాలు, పాలకుల దోపిడీలు, కన్నీళ్ళు, కష్టాలు బతుకమ్మ పాటలలో నిలిచాయి. అందుకే బతుకమ్మ పాటల్లో ఆనాటి సాంఘీక సంస్కృతుల, పుట్టింటి ప్రేమలు, అత్తింటి ఆరళ్ళు అణగారిన బతుకుల వ్యధలు కనిపిస్తాయి. ఈ పండుగ అంతరంగంతో పాటు, తెలంగాణా జిల్లాల వెనుకబాటు తనాన్ని సమతౌల్యంగా బాధలు, ఆవేదనల పూలతో పేర్చి రచయిత్రి పాఠకుల ముందుంచింది.
సాహితీ ప్రక్రియగా బతుకమ్మ పాట:
తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల సాంప్రదాయకతను, సనాతన ఆచారాలను, వెనుకబాటుతనాలను చొప్పిస్తూ రచయిత్రి శ్రీమతి సబ్బని శారద బతుకమ్మ పాట ప్రక్రియలో హృద్యంగా వివరించారు. సాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఉన్నప్పటికినీ, బతుకమ్మ పాట ప్రక్రియ రూపంలో తన అభిప్రాయాలను నిఖ్ఖచ్చితంగా చెప్పడం అమెకే చెల్లింది. బతుకమ్మపాటను విలక్షణమైన సాహితీ ప్రక్రియగా గుర్తించి తొలిసారిగా ఆమె తెలంగాణా వెనుకబాటుతనాన్ని లయబద్ధంగా సాహిత్యీకరించడం ఆమె చేసిన సాహితీ ప్రయోగానికి జేజేలు పలుకక తప్పదు. గత ఏడేళ్ళ కిందట రాసిన తెలంగాణా బతుకమ్మ పాట విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తెలంగాణా రాజకీయ ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు ఈ పాటలలోని వాడిన మకుటం: రామరామ ఉయ్యాలో/ రామనే శ్రీరామ ఉయ్యాలో / హరి హరి ఓ రామ ఉయ్యలో / హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో .. అన్న లయాత్మకమైన మకుటంతో ఆమె పాటతో పాటు సాహిత్యం పరుగెడుతుంది.
తెలంగాణా ప్రాంతంలో దేవతలను ఆమె తన బతుకమ్మ పాటలో ఇలా చెప్పింది.
రామరామ ఉయ్యలో… ముందుగా నినుదల్తు ఉయ్యాలో / ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో/ అటెన్క నిను దల్తు ఉయ్యాలో / అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో/ భక్తితో నినుదుల్తు ఉయ్యాలో/ బాసరా సరస్వతి ఉయ్యాలో/ సమ్మక్క సారక్క ఉయ్యాలో/ సక్కంగ మముజూడు ఉయ్యాలో/ బద్రాద్రి రామన్న ఉయ్యాలో / భవిత మాకు జెప్పు ఉయ్యాలో / యాదితో నినుదల్తు ఉయ్యాలో/ యాదగిరి నర్సింలు ఉయ్యాలో/ ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో / ఎములాడ రాజన్న ఉయ్యాలో/ ఐలేని మల్లన్న ఉయ్యాలో/ ఐక్యమత్యమియ్యి ఉయ్యాలో/ …అంటూ తల్లడిల్లుతున్న తెలంగాణా గూర్చి చెబుతూ, తెలంగాణా సాధనే ఏకైక మార్గమని అంటుంది. తల్లడిల్లుతుంది ఉయ్యాలో/ తల్లి తెలంగాణా ఉయ్యాలో/ ఆర్తితో బతుకులూ ఉయ్యాలో/ ఆగమయ్యే సూడు ఉయ్యాలో/ అక్కలార మీరు ఉయ్యాలో/ తెలంగాణా మనది ఉయ్యాలో/ తెలంగాణం మనది ఉయ్యాలో/ గాంధీలాగా మీరు ఉయ్యాలో/ గమ్యాన్ని చేరాలి ఉయ్యాలో/ అంబేత్కరుని ఉయ్యాలో/ ఆశయాల మేర ఉయ్యాలో/ మంచి కోరి మనం ఉయ్యాలో/ మనుగడ సాగిద్దాం ఉయ్యాలో/ కష్టాల కడలి ఉయ్యాలో/ కన్నీటి కావ్యమూ ఉయ్యాలో/ తెలంగాణా బతుకు ఉయ్యాలో/ తెలంగాణా బతుకమ్మ ఉయ్యాలో …అంటూ తెలంగాణా బతుకు కన్నీళ్ళ గాథలను అక్షరబద్దం చేసింది.
కరీంనగర్ బాధలను ఆమె చెప్పిన తీరులో
రాజకీయపు జిల్లా ఉయ్యాలో/రాణించె జిల్లా ఉయ్యాలో/ కరినారం జిల్ల ఉయ్యాలో/ కదిలికున్న జిల్ల ఉయ్యాలో/ మానేరు పరుగులు ఉయ్యాలో/ మరి చిన్నవయిపోయే ఉయ్యాలో అంటుంది. విషాదకరమైన దృశ్య రూపకంలా సిరిసిల్లా నేతన్న ఆకలి చావులపై ఇలా పాట కట్టింది.. సిరిసిల్లా బతుకులు ఉయ్యాలో/ సిరిలేని బతుకులు ఉయ్యలో/ ఆకలి చావులు ఉయ్యాలో ఆత్మహత్యలు చూడు ఉయ్యాలో/ వలస బతుకులు జూడు ఉయ్యాలో/ వట్టిపోయిన బతుకు ఉయ్యాలో/ బొంబాయి భీవండి ఉయ్యాలో/ బోసి పోయిన బతుకు ఉయ్యాలో అంటుంది.
అనేకానేక పెద్దపెద్ద బీడి కార్ఖానాలకు నిలయమై, బీడి కార్మికుల వెతలకు ఖిల్లాయైన ఇందూరు జిల్లా బాధలను ఆమె ఇలా ఏకరువు పెట్టింది. నిజాం బాధలు ఉయ్యాలో/ నిట్టూర్పు బతుకులు ఉయ్యాలో/ బీడీల బతుకులు ఉయ్యాలో/ బీడైన బతుకులు ఉయ్యాలో.
తెలంగాణా జిల్లాల బతుకులను పీడించే కరెంట్ వ్యథలను ఇలా పాటలో కై కట్టింది. సింగరేణి బొగ్గు ఉయ్యాలో/ సిరిగలా సీమరా ఉయ్యాలో/ ఎన్టీపిసీలు ఉయ్యాలో/ కరెంటు పుట్టిల్లు ఉయ్యాలో/ కరువెట్ల వచ్చెరా ఉయ్యాలో/ ఉపాధులు కోల్పోయి బజారున పడిన బతుకులు, మూత పడుతున్న ప్యాక్టరీల గూర్చి ఇలా చెప్పింది. ఎఫ్‌సిఐ కంపిన్లు ఉయ్యాలో/ ఏమై పాయరా ఉయ్యాలో/ అంతర్గాం మిల్లులు ఉయ్యాలో/ అంతరించి పోయె ఉయ్యాలో/ సిరిసిల్లా స్పిన్నింగ్ ఉయ్యాలో/ సిక్కుల్లో పడెరా ఉయ్యాలో/ గోదారి దారుల్లో ఉయ్యాలో/ గోసకచ్చె బతుకు ఉయ్యాలో/ అని చెబుతుంది.
మూత పడిన వరంగల్ ఆజాంజాహి మిల్ గూర్చి…
కాకతీయలు నాటి ఉయ్యాలో/ కాలమేది నేడు ఉయ్యాలో/ పరిశ్రమ లేవి ఉయ్యాలో/ పనిపాట లేవి ఉయ్యాలో/ అజంజాహి మిల్లు ఉయ్యాలో/ ఆంతరించిపోయె ఉయ్యాలో … సింగరేణి గనులుండి ఉద్యోగాల ఖిల్లాయైన ఖమ్మం జిల్లాకు వచ్చిన
కోస్తాంద్రుల కొత్త వలసల గూర్చి ఇలా చెప్పింది. ఖమ్మం సీమకు ఉయ్యాలో/ కాలుజేతులచ్చె ఉయ్యాలో/ గోదారి దారుల్లో ఉయ్యాలో/ కొత్త వలసలచ్చె ఉయ్యాలో/ అయ్యయ్యో ఓ రామ ఉయ్యాలో/ హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో.. నల్లగొండ జిల్లా వెతలను ఇలా చెప్పింది. నాగార్జున సాగరు ఉయ్యాలో/ నల్లగొండలుంటె ఉయ్యాలో/ కటకట నీళ్ళకు ఉయ్యాలో/ కరువెట్ల వచ్చెరా ఉయ్యాలో/ ఫ్లోరైడ్ నీళ్ళల్లో ఉయ్యాలో/ పాడయ్యెను బతుకు ఉయ్యాలో/ కష్టకాలమచ్చె ఉయ్యాలో/ కరువుకాలమచ్చె ఉయ్యాలో/ పరుగులిడె కృష్ణమ్మ ఉయ్యాలో/ పక్షపాతమేమి ఉయ్యాలో.
మెదక్ జిల్లా కరువు గురించి ఇలా రాసింది. మెదక్ సీమ జూడు ఉయ్యాలో/ మెతుక్కు కరువాయె ఉయ్యాలో/పటాన్ చెరువు ఉయ్యాలో/ పర్యావరణం చూడు ఉయ్యాలో/ కాలుష్యం కోరల్లో ఉయ్యాలో/ కాటేస్తున్నది ఉయ్యాలో అంటుంది.
జీడిమెట్ల జూడు ఉయ్యాలో/ జీవులా బతుకులు ఉయ్యాలో/ రోగాల బారిన ఉయ్యాలో/ రోధించె బతుకులు ఉయ్యాలో/ అల్ కబీర్ల జూడు ఉయ్యాలో/ అంగట్ట బతుకులూ ఉయ్యాలో/ పశువుల రక్తమూ ఉయ్యాలో/ పారుతుండె జూడు ఉయ్యాలో అంటుంది. ఆదిలాబాద్ గిరిజనుల బతుకులను, పాలమూరు కూలీల బతుకు వ్యధలను రంగారెడ్డి జిల్లాలో విషం జిమ్ముతున్న ఫ్యాక్టరీల కాలుష్యాలను హైదరాబాద్‌లోని భూబకాసురులైన రియల్ ఎస్టేట్ల అక్రమ మాఫియా దందాలను ఆమె తన పాటలో ఏకరువు పెట్టింది.నంది అవార్డులు, నాటకాలు, ఆటా, తానా అవకాశాలు దూరదర్శన్, ఆకాశవాణి, పత్రికల్లో తెలంగాణా వాళ్లకు చూపిస్తున్న వివక్షతను ఆమె ఎండగట్టింది.
తెలంగాణా రాష్ట్ర సాధన:
తెలంగాణా బతుకులు మెరుగు కావాలంటే రాష్ట్ర సాధనే దిక్కని బల్లగుద్ధి చెప్పింది. తెలంగాణా రావాలి ఉయ్యాలో/ తెలంగాణా బాగుకూ ఉయ్యాలో/ తెలంగాణ కావాలి ఉయ్యాలో/ తెలంగాణ మేలుకూ ఉయ్యాలో అంటుంది.
తెలంగాణా బతుకమ్మలు కొనసాగినంత కాలం ఈ రచయిత్రి రాసిన పాట
జవజీవాలతో ఉంటుందని, అంత సాహితీ పరిపుష్ఠి, తెలంగాణా నిండుదనం ఇందులో వుంది అని నేను భావిస్తున్నాను.
2001లో మొదటి ముద్రణగా వెలువడి విశేష ఆదరణ పొందిన ఈ పుస్తకం మళ్ళీ ఈ 2008న ద్వితీయ ముద్రణకు రావడం ఈ బతుమ్మ పాట ప్రముఖ తెలంగాణ జానపద గాయని అంతడుపుల రమాదేవి గాత్రంతో ఆడియో
క్యాసెట్‌గానూ ఆడియో సి.డి.గానూ వెలువడటం గొప్ప విషయం. రచయిత్రి శ్రీమతి సబ్బని శారద గారిని, వారికి చేదోడువాదోడుగా నిలిచిన వారి శ్రీవారు సబ్బని శ్రీ లక్ష్మీనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
No comments:
Post a Comment