సిరిసిల్ల పవర్‌లూమ్ వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.
చిరంజీవి గత నెల 20వ తేదీన ఏ కారణంతో సిరిసిల్ల పర్య టన చేపట్టినప్పటికీ, అక్కడి నేత కార్మికుల దుర్భర పరిస్థితుల్ని మరొకసారి లోకానికి చాటినట్టయింది. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితికి ఎన్డీఏ, యూపీఏ -రెండూ బాధ్యత వహించాల్సిందే. అందు వల్ల సమస్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి సిరిసిల్ల బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. బాధిత ప్రజలను, నేత కార్మిక సంఘాలను చేనేత రంగ నిపుణులను సహకార సంఘాలను కూడగట్టి సమిష్టి పరిష్కారాన్ని కనుక్కునే బాధ్యతను తెలంగా ణవాదులు తమ భుజానికెత్తుకోవాలనేది నా అభిలాష.
మొదట ఆత్మహత్యలు అరికట్టడానికి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, హక్కుల సంఘాలు నిలబడి తమకు చేతనైన సహాయం చేస్తూనే, బాధిత ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఎల్లవేళలా పాలకవర్గాలు ఉత్పత్తి సంక్షోభాన్ని కేవలం మార్కెటు సమస్యగా చిత్రించి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆధునికత- అభివృద్ధి పేరిట అనుసరించిన సామ్రాజ్య వాద విధానాల వల్ల, అందులో భాగంగా రూపొందించిన నూతన జౌళి విధానం వల్ల సిరిసిల్లకు ఈ దుస్థితి పట్టింది. నూతన జౌళి విధానానికి స్వస్తి చెప్పి, నేత రంగంపై ఉన్న అప్పులన్నీ రద్దుచేసి, కార్మికులందరికి ఉపాధి కల్పించే దిశగా, అంతిమంగా దేశీయ వస్త్ర పరిశ్రమను కాపాడుకునే విధంగా ఆందోళన కొనసాగాల్సిన అవసరం ఉంది.
అతిపెద్ద ఉపాధిరంగంగా ప్రసిద్ధి గాంచిన చేనేతరంగాన్ని విడిగా అభివృద్ధి చేయకుండా పాలకవర్గాలు మిల్లురంగం, పవర్‌లూమ్ రంగాలను చేనేతతో కలిపి భారత జౌళిరంగ విధానాన్ని రూపొందించారు. కార్మికులు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ దీనిని 1985లో ప్రజలపై రుద్దారు. పైగా వ్యవస్థాగత సర్దుబాటు కార్య క్రమం పేరిట 1991లో సరళీకృత విధానాలు అమలు చేశారు. దీనివల్ల నూలు- రంగుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలోనే జౌళీ పార్కుల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం టెక్నికల్ అప్‌గ్రెడేషన్ ఫండ్ (టియుఎఫ్) పేర 25,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చింది. భారీ పెట్టుబడిదార్లకు ఆటోమైజేషన్ పేరుమీద భారీ సబ్సిడీలు ఇచ్చింది. ఆధునిక టెక్నాలజి పేరు మీద మరమగ్గాల దిగుమతులకు రాయితీలిచ్చింది.
20 శాతం పెట్టుబడి రాయితీలు, 100 శాతం మౌలిక వసతుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఉచిత నీరుతోపాటు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడానికి అంగీకరించి ఎన్డీఏ ప్రభుత్వ జాతీయ జౌళీ విధానం బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదార్లకు ఎర్ర తివాచీలు పరిచింది. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో జరిగిన ఆత్మహత్యలను అరికడతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ చర్యలు తీసుకోలేదు. పైగా ఆటోమైజే షన్‌తో కూడిన 14 జౌళీ పార్కుల నిర్మాణానికి రాష్ట్ర జౌళీ విధానం పేర భారీ ప్రణాళిక(2005-10)ను ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో హైదరాబాద్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు 300 ఎకరాల స్థలంలో 300 కోట్లతో ప్రారంభ సన్నాహాలు చేశారు. ఈ పార్కుల్లో కూడా జెట్‌లూమ్స్ (నాడీ లేకుండా వాయు వేగంతో నడిచే మరమగ్గాలు) ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ పథకం. సరిగ్గా తమిళనాడు, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల్లో ఇదే రకం ఉత్పత్తి విధానంతో పోటీపడలేక సిరిసిల్ల పవర్‌లూమ్ రంగం కుప్పకూలిందని నేత కార్మి కులు ఆరోపిస్తున్నారు.
ప్రపంచీకరణతో పొరుగుదేశాల నుంచి వస్త్రాలు, పట్టునూలు దిగుమతి చేసుకోవడంతో వారణాసి మొదలుకుని పోచంపల్లి వరకు పట్టు వస్త్ర పరిశ్రమ వీధుల్లో పడ్డది. పోచంపల్లి టై అండ్ డై తోపాటు చేనేత నైపుణ్యంపై కార్మికులకు పేటెంట్ హక్కులిచ్చి, అప్పులన్నీ రద్దు చేయాల్సింది. ఇది చేయకపోగా, సిరిసిల్ల లాంటి పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమను పరిరక్షించకుండా, ప్రతి మనిషి రోజుకు సగటున 960 గజాల వస్త్రం నేసే జెట్‌లూమ్‌ల కోసం జౌళీ పార్కుల విధానాన్ని ప్రకటించడం, సిరిసిల్లను మరింత వధ్యశాలపై నెట్టడానికే దారితీస్తుంది.
వస్త్ర పరిశ్రమను కొద్దిమంది బడా వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. అలాగే సరళీకరణ-ప్రపంచీకరణలో భాగంగా గుత్తపెట్టుబడిదార్లకు అనుగుణంగా ఉన్న జాతీయ జౌళి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ జౌళి విధానాలను మార్చకుండా 414 కోట్లకు చేరిన చేనేత రంగ బకాయిలు, ప్రైవేటు అప్పులు చెల్లించకుండా నేత రంగంలో ఆత్మహత్యలను అరికట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి బాధిత సిరిసిల్ల ప్రజలమధ్య ‘పీపుల్స్ రౌండ్ టేబుల్’ జరగాలని అభిలషిస్తూ, కొన్ని అంశాలు చర్చకు ప్రతిపాదిస్తున్నాను. 1997ను ప్రాతి పదికగా తీసుకుని, ఆత్మహత్యలు- ఆకలిచావులతోపాటు అనారోగ్యం తదితర కారణాలతో బలవన్మరణాలకు గురయిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇచ్చి, పిల్లలకు ఉచిత చదువుతో పాటు కుటుంబంలో ఒకరికయినా ఉపాధి కల్పించాలి.
పేరుకుపోయిన వస్త్రాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి, తిరిగి ఉత్పత్తికి అవసరమయిన ముడిసరుకును, విద్యుత్‌ను సబ్సిడి రేట్లకు అందజేయాలి. సిరిసిల్ల పవర్‌లూం వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.
అపెరల్ పార్కుల పేరిట భారీ రాయితీలతో సాగుతున్న గుత్తపెట్టుబడిదారు ల దోపిడికి అడ్డుకట్ట వేయాలి. ఉపాధి ప్రాతిపదికగా ప్రజామోదంతో సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించాలి. కార్మికులందరికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ప్రత్యేక వృద్ధాప్య పింఛనును 1,000 రూపాయలకు పెంచాలి. నేత కార్మికులకు కనీసవేతనాలు అమలు పరచాలి. నిత్యావసర సరుకులన్నీ సబ్సిడి రేట్లకు చౌక దుకాణాల ద్వారా అందించాలి. తక్షణ సహాయ చర్యలకోసం, రుణ విముక్తికోసం కార్పస్‌ఫండ్‌తో స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత పరిశ్రమ పేటెంట్ హక్కులిచ్చి చారిత్రిక కళానైపుణ్యాలను పరిరక్షించాలి.
-అమర్ (జనశక్తి రాజకీయ ఖైదీ)
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 9 అక్టోబరు 2008
No comments:
Post a Comment