ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
No comments:
Post a Comment