Wednesday, April 23, 2008

టి.ఆర్‌.ఎస్‌. రాజీనామాలు - తదనంతర పరిణామాలు

ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలను ఒక చౌరస్తాలో నిలబెట్టిందనీ, ఉపఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల పరిస్థితి సంక్షోభంలో పడనున్నదనీ అంటున్నారు నాగోబా

టి.ఆర్‌.ఎస్‌. ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు తెలంగాణ రాజకీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అదే సమయంలో సమైక్యవాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలలో తెలంగాణ వాదుల ఒత్తిడి తీవ్రతరమైంది. టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు స్వాగతించారు. వారి పదవీ త్యాగాన్ని అభినందిస్తూ ఇప్పటికే అన్ని జిల్లాలలో వందలాది అభినందన సభలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవి కేవలం అభినందన సభలు గానేగాక తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న ద్రోహ పూరిత, వంచనపూరిత వైఖరిని, గత యాభై ఏండ్లుగా తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ ద్రోహ చరిత్రను, వంచనా చరిత్రను చర్చకు పెడుతున్నాయి. కాంగ్రెస్‌ తెలంగాణను మరోసారి ద్రోహం చేయటానికే సిద్ధపడిందని తెలంగాణ ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ సభలు, అభినందనలు, దీవెనలు టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధులను ఉత్సాహ పరుస్తున్నాయి. వారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పదవులే కాదు ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమేనని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. మొత్తం నాలుగు పార్లమెంట్‌, పదహారు శాసనసభ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రూపొందించుకుంటున్నది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలతో సంభాషించడానికి ప్రజాసంఘాలు, ఈ సంఘీభావ సభలు వారికి ఉపకరిస్తున్నాయి. ఈ సంభాషణ సాగుతున్న తరుణంలోనే ఇటు సమైక్యవాద పార్టీలలో, కాంగ్రెస్‌లోనూ రాజకీయ ప్రకంపనలు తీవ్రతరమవుతున్నాయి.

మొదట కాంగ్రెస్‌ పరిస్థితిని విశ్లేషించుకోవాలి. కాంగ్రెస్‌ వారు ఇప్పుడు ఎన్నితీర్లుగా మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ అంశాన్ని సోనియాగాంధీ నిర్ణయానికి వదిలేసాం, ఆమె నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెపుతూ వస్తున్నా ఆచరణలో కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగు వెయ్యడం లేదు. వెయ్యకపోగా వారి గోల్‌మాల్‌ ప్రకటనలు తెలంగాణను కాంగ్రెస్‌ మరొక్కసారి వంచించేందుకే సిద్ధపడిందన్న అభిప్రాయాన్నే ప్రజలను నమ్మేలాగా చేస్తున్నాయి. మరోవైపు మొన్నటిదాకా సోనియాగాంధీ నిర్ణయమే శిరోధార్యం అన్న ముఖ్యమంత్రి, తెలంగాణపై నిర్ణయించేందుకు ఆమె మోనార్క్‌ కాదు, ఆమెకు పరిమితులు ఉన్నాయి. ఈ టెర్మ్‌లో తెలంగాణను ఇచ్చే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టేశాడు. దాంతో కాంగ్రెస్‌ వైఖరి మరింత స్పష్టమైంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఉపనాయకుడు, కాంగ్రెస్‌ వర్కింగు కమిటి సభ్యుడు అయిన జి. వెంకటస్వామి బృందానికి సోనియాగాంధీ అపాయ్‌ంట్‌మెంట్‌ నిరాకరించడంతో తెలంగాణపై సోనియాగాంధీ మనోభావాలు ఏమిటో వెల్లడైంది. వై. ఎస్‌. ని కాదని సోనియా తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్న భ్రమలు తెలంగాణ వాదులెవ్వరికీ ఇప్పుడులేవు. అందుకే సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం నాకుంది అని ప్రకటించిన మధుయాష్కిని ఉస్మానియా విద్యార్థులు నిలదీయక తప్పలేదు.

1956లో జవహరలాల్‌ నెహ్రూని, 1971లో ఇందిరా గాంధీని లొంగదీసుకుని తమకు అనుకూలంగా నిర్ణయాలను వెలువరింప జేసుకున్న కోస్తా వలసపాలకులు సోనియా గాంధీని లొంగతీసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతర్గతంగా తెలంగాణలోనే కోస్తా వలస పాలకులకు దళారులుగా పని చేయడానికి ద్రోహులు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు.

తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతాలలో దళారి నాయకత్వం ఎపుడూ సిద్ధంగానే ఉంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇటువంటి దళారి నాయకత్వం జార్ఖండ్‌ ఉద్యమంలోనూ, ఛత్తీస్‌గఢ్‌ ఉద్యమంలోనూ ఉన్నది. అయితే పాలవర్గాల కుట్రలు, కుతంత్రాలను చేధించి అంతిమంగా విజయం సాధిస్తారనే దానికి ఆ రాష్ట్రాల ఉద్యమాలే సాక్ష్యంగా ఉన్నాయి. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమం కూడా రాజకీయ పరిణతితో పరిస్థితులను విశ్లేషించుకుంటున్నది. ద్రోహులెవరు? దళారులు ఎవరు? కోవర్టులెవరు? అవకాశవాదులెవరు? వీరి విషయంలో ఉద్యమం స్పష్టమైన సోయితోనే ఉన్నది. ఆ సోయి ఉన్నది కనుకనే మార్చి 24న జరుగబోయే కాంగ్రెస్‌ సీనియర్ల భువనగిరి రణభేరి రద్దయిన మరునాడే తెలంగాణ ప్రజా సంఘాలు, ఉస్మానియా విద్యార్థులు హోలీ సంబురాల్లో భాగంగా కాంగ్రెస్‌ ద్రోహుల శవయాత్రలు నిర్వహించి, పేరు పేరునా వారికి తెలంగాణ ప్రజల పక్షాన సంతాపం ప్రకటించారు. వారి ద్రోహానికి నిరసనగా భునవగిరిలో సభను తాము జరిపి తీరుతామని ప్రకటించారు. (ఈ వ్యాసం అచ్చయ్యేనాటికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి సభ విజయవంతంగా జరిగి ఉంటుంది.)

ఇక సీనియర్ల తెలంగాణ నాటకం ఉత్త బూటకమని ఇదంతా వైఎస్‌ స్క్రీన్‌ప్లేలో భాగంగానే జరిగిందని నమ్మేవారి సంఖ్య ఇప్పుడు 85 శాతం పైగా ఉందని తెలుస్తున్నది. రాష్ట్రపతి పదవికోసం గవర్నర్‌ పదవి కోసం, మంత్రి పదవికోసం ఎదురుచూసి భంగపడిన సీనియర్లే ఈ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం తెలంగాణ ప్రజలు గమనించారు. కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న వారినే శంకించడం ఎందుకులే, కాలం వారి నిజవైఖరిని తేలుస్తుందని వేచి చూశారు. భువనగిరి రణభేరి సభ రద్దుతో వారూ కోస్తా దళారీ వర్గంగానే తేలిపోయారు. వీరంతా కాంగ్రెస్‌ స్కిన్‌సేవర్స్‌గా పని చేస్తున్నారని స్పష్టమైంది. మధూయాష్కిపై ఇటువంటి ఆరోపణలు చాలాకాలం నుంచే ఉన్నాయి. తెలంగాణ అంశం మొత్తంగా టి.ఆర్‌.ఎస్‌. చేతుల్లోకి వెళ్లకుండా ఉండటానికే ఈ స్క్రిప్ట్‌ రాయబడిందని ఇప్పుడు స్పష్టమైంది. స్క్రిప్ట్‌ను రాయడంలో అజాగ్రత్తల వల్ల మధ్యలోనే అభాసుపాలయింది. ఈ మొత్తం నాటకం అంతిమంగా టి.ఆర్‌.ఎస్‌.కే ప్రయోజనం చేకూర్చడం కాంగ్రెస్‌కు విషాదం. ప్రజలకు, ఉద్యమానికి విజయం. కాంగ్రెస్‌ మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగా, కోస్తా భూస్వామ్య సంపన్నవర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందనీ, ఇప్పుడు అదే ధోరణితోనే వ్యవహరిస్తున్నదని రూఢీ అయ్యింది. తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు సోనియాగాంధీకి సరి అయిన సమయం ఎపుడు వస్తుందో తెలియదు కాని కాంగ్రెస్‌ని భూస్థాపితం చేయడానికి తెలంగాణ ప్రజలకు సరి అయిన సమయం రానే వచ్చింది. వలసపాలకులు చేస్తున్న అభివృద్ధి జపం, వారి దళారులు వేస్తున్న పిల్లిమొగ్గలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరిపించలేవు.

మరోవైపు తెలుగుదేశంలో తెలంగానం ప్రకంపనాలని సృష్టిస్తోంది. ఇటీవల కడియం శ్రీహరి పత్రికలకిచ్చిన ఇంటర్వూ పార్టీని కుదిపి వేసింది. పార్టీ తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకోక పోయినట్లయితే నాదారి నేను చూసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడైనా ఇవ్వాళ ఇటువంటి అనివార్యతనే ఎదుర్కొంటున్నాడు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము నడవలేక పోయినట్లయితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని వారికి తెలుసు. అందుకే కడియం శ్రీహరిలాగా స్పష్టంగా ప్రకటించక పోయినప్పటికీ తెలంగాణ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. గోదావరి జలాల కోసం పాదయాత్ర, దువాన్ని గూడెం - నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గళమెత్తడం, ఎల్లంపల్లి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, ఎల్లంపల్లిని మరో సింగూరుగా మార్చే ప్రభుత్వ కుట్రను ఎండగట్టడం. ఇట్లా అనేక సమస్యలపై దేవేందర్‌గౌడ్‌ ఉద్యమించడం తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును నిలుపుకోవడం లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు ఇంతటితో సంతృప్తి పడజాలరు. స్పష్టమైన తెలంగాణ అనుకూల వైఖరితో ముందుకు రావాలని తెలంగాణ వాదులు దేవేందర్‌గౌడ్‌ని ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం 2008 డైరీ ఆవిష్కరణ సభలో దేవేందర్‌ని అడ్డుకొని తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించమని నిలదీసారు. ఆ ఒత్తిడికి తలఒగ్గి, ‘మేం మాట్లాడందే చరిత్ర సృష్టిస్తాం’ అని ప్రకటించవలసి వచ్చింది. అదే సభలో పెద్దిరెడ్డి జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మార్చ్‌లో అంబేద్కర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సదస్సులో సి.ఎచ్‌. రాజేశ్వరరావు ఇటువంటి అనుభవాన్నే చవిచూశారు. చివరకు పార్టీ వైఖరిని తాను ప్రకటించలేనని, వ్యక్తిగతంగా తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించారు. ఇట్లా తెలుగుదేశంలోని తెలంగాణ నాయకులకు నిత్యం ఎదురవుతున్న చేదు అనుభవాలివి. ఈ సంఘటనలు వాళ్లను ఆత్మ విమర్శకు పురిగొల్పు తున్నాయి. పార్టీ తెలంగాణ అనుకూల నిర్ణయం చేయకపోతే పార్టీకి పుట్టగతులుండవని వారు నమ్ముతూ పార్టీకీ సూచనలు చేయకతప్పటం లేదు. శ్రీహరి ప్రకటన తెలుగుదేశం పార్టీలో పుట్టిన ప్రకంపనలకు పరాకాష్టగా భావించవచ్చు. ఉప ఎన్నికల అనంతరం ఇది మరింత తీవ్రతరం కావడం ఖాయంగా కన్పిస్తున్నది.

సిపిఎం నలువైపుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నది. టంకశాల అశోక్‌ సిపిఎం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలని వారు ప్రవచిస్తున్న భాషా రాష్ట్రాల సిద్ధాంతం ఎంతటి పిడివాదంగా మారిందో అది స్టాలిన్‌ చెప్పిన జాతుల సమస్యకు ఎట్లా వ్యతిరేకమో పూర్వ పక్షం చేస్తూ ఇటీవలె వ్యాస పరంపర వెలువరించారు. టంకశాల అశోక్‌ లేవనెత్తిన అంశాలపై, సంధించిన ప్రశ్నలపై వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నది. ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యతను కూడా మర్చిపోయి మౌనాన్ని పాటించడం వారి అపరాధ భావనకు చిహ్నంగా పరిశీలకులు భావించక తప్పటం లేదు. వారిది గతితార్కిక భౌతికవాదం కాదు గతితార్కిక కోస్తావాదం అని విమర్శిస్తున్న తెలంగాణ వాదుల వాదనకు వారి మౌనం మరింత బలాన్నిచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు బలం, సభ్యత్వం తెలంగాణలోనే ఎక్కువ. అందుకే వారి ప్రజాప్రతినిధుల తెలంగాణ నుండే అత్యధికంగా ఎన్నికవుతారు. అయితే పార్టీమీద పట్టుమాత్రం కోస్తావారిదే. పార్టీ విధానాలను వారు నియంత్రించ గలుగుతున్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలను పార్టీమీద రుద్దగలుగుతున్నారు. ఇది పార్టీలోని తెలంగాణ కార్యకర్తలను అసహనానికి గురి చేస్తున్నప్పటికీ మింగలేక కక్కలేక భరించే స్థితిలో వారున్నారు. సిపిఐ కేంద్ర పార్టీ తీసుకున్న తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని కూడా రాష్ట్ర పార్టీలో ఉన్న కోస్తా సభ్యుల మెజారిటీ కారణంగా తిరగదోడే పరిస్థితి కనిపిస్తోంది. సిపిఐ జాతీయ మహాసభల్లో కేంద్ర కార్యదర్శి బర్దన్‌ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావనే రాకపోవడం ఇందుకు నిదర్శనం.

ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలనకు ఒక చౌరస్తాలో నిలబెట్టింది. ఉప ఎన్నికల అనంతరం ఈ పార్టీల పరిస్థితి తీవ్రమైన సంక్షోభంలోకి పోవడం ఖాయం. ముఖ్యంగా సోనియా గాంధీ తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. వై.ఎస్‌. చెప్తున్న అభివృద్ధా? తెలంగాణ డిమాండా? తేల్చడానికి ఉప ఎన్నికలు ఒక లిట్మస్‌ టెస్ట్‌. ఈ లిట్మస్‌ టెస్ట్‌లో ఫలితం తేలీన తర్వాత కూడా కాంగ్రెస్‌ తెలంగాణని ప్రకటించకపోతే వారిది దివాళాకోరు రాజకీయమే గాని ప్రజాస్వామిక కార్యాచరణ కాబోదు. ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ రాజకీయ పరిణతికీ లిట్మస్‌టెస్ట్‌.

No comments:

Post a Comment