Friday, April 25, 2008

ప్రభుత్వం, అధికార భాష

- వావిలాల గోపాలకృష్ణయ్య

“తేటల్‌ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము
ప్పేటల్‌ వోలె త్వదీయ కంఠమున శోభింపుల్‌ నిగారించు, చే
నాటన్‌ జీవన శోషణన్‌ గనని కృష్ణా గౌతమీ పెన్నలన్‌
గాటంపుం దమి త్రావువార మిదె కాంక్షాక్షీర మాంధ్రావనీ”

పరపాలననుండి బయటపడి ఇన్ని సంవత్సరములు గడచినందుకు ఉత్సవాలు జరుపు కుంటున్నాము. భారతీయ రాజకీయరంగంలో స్వాతంత్య్ర ప్రజ్వలన లార్డు క్లైవు ఏనాడు బెంగాలు ప్రజలను చీల్చి భాషా ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్లిం మత ప్రాతిపదికగా రాష్ట్రాలు నిర్మించాడో, ఆ నాడే ప్రజానీకం జాగరితమై, పరపాలన అంతమొందించవలెనను ఆవేశం కలిగింది.

బెంగాలు అవిభాజ్యమని, బెంగాలు ప్రజానీకం సింహగర్జన చేసింది. పరభాషకు వ్యతిరేకంగా బెంగాలులో బెంగాలు భాష, మహారాష్ర్టలో స్వదేశీ, ఆంధ్రలో జాతీయోద్యమ బీజాలు నవజీవనోద్యమం సాగించింది. అంతా కలిసి వందేమాతరం ఉద్యమం అయింది. 1906లో విభజింపబడిన బెంగాలు 1912లో సమైక్యత సాధించింది.

భాషాధారక రాష్ర్టాలు స్వాతంత్య్రానికి, జాతీయతకు ప్రాతిపదిక అంటూ ప్రథమంగా పరిపాలన ప్రజల భాషలో జరుగవలెనని, విద్యాబోధన మాతృభాషలో నేర్పబడవలెనని ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. 1913లో ప్రథమంగా బాపట్లలో ఆంధ్రమహాసభ జరిగింది. శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన సమావేశంలో ఉద్ఘాటించినట్లు ఆంధ్రోద్యమం ఉద్యోగాలకై కొట్లాటకాదు. పదవులకు ప్రాకులాట కాదు. పరిపాలన, విద్యాబోధన మాతృభాషలో జరిగితే, పరభాషలో జరిగితేను, తల్లి చనుబాలతో పెరిగిన బిడ్డకు, పోతపాలతో పెరిగిన బిడ్డకు ఉన్నంత తేడా ఉంటుందని ఘంటాపథంగా నుడివారు. ఆంధ్రోద్యమం జాతీయోద్యమానికి పునాది అయింది.

ఆంధ్ర ప్రజలకు అప్పటికే ఒక సంస్థ, కార్యకర్తలు, జాతీయభావం, ప్రజా ఉద్యమానికి పునాది అయింది. ఆనాటి ఆంధ్రోద్యమానికి ఆదర్శం శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు చూపారు.
జాతీయోద్యమంలో భాగంగా వున్న వందేమాతరం ఉద్యమంలో, హోంరూల్‌ ఉద్యమంలో, కాంగ్రెసు ఉద్యమంలో, ఆంధ్రులందరు కలిసి ఆంధ్ర ప్రాంతానికి (అప్పటికి బ్రిటిషు పాలనలో వున్న జిల్లాలను కలిపి) ఒక రాష్ట్ర సంఘం ఏర్పడి, పాలనా భాగంగా గౌరవం సాధించారు.

గాంధీజీ రాజకీయ రంగంలోకి రావడంతో హిందీ భారతదేశానికి రాష్ట్రభాషగా వుండవలెనని ఉద్బోధించారు. దేశానికి హిందీ రాష్ట్రభాష, అధికారభాషగా తమ ఆశయం ప్రజానీకం ప్రకటించింది.
పరప్రభుత్వం చీలించి పాలించమన్నట్లు బ్రిటిషు ప్రభుత్వానికి అండగా వున్నందున ఒరిస్సా, సింధు రాష్ర్టాలను 1935లో నిర్మించింది. జాతీయోద్యమ ప్రభావం ఉన్నందున ఆంధ్రులకు రాష్ట్రం లభించలేదు. కర్ణాటకము, మహారాష్ట్రము తమకు తమ భాషా రాష్ర్టాలు కావాలని కోరారు.

శ్రీ లాలాలజపతిరాయ్‌ నాయకత్వాన పంజాబు ఉద్యమం, బాలగంగాధరతిలక్‌ నాయకత్వాన మహారాష్ట్ర ఉద్యమం, రాజేంద్రప్రసాద్‌ నాయకత్వాన బీహారు ఉద్యమం, శ్రీ రవీంద్ర కవీంద్రుని నాయకత్వాన బెంగాలు ఉద్యమం, ఆంధ్రమహాసభ నాయకత్వాన ఆంధ్రోద్యమం…తమభాష కొరకు, తమ ఉనికి కొరకు, తమ వ్యక్తిత్వం కొరకు వివిధ రూపాల చైతన్యస్రవంతులు ప్రవహింపసాగినవి. అది జాతీయ ఉద్యమంలో భాగాలుగా ఉపనదులు మహానదిలో చేరినట్లు లీనమై, స్వాతంత్య్ర ధ్యేయంతో ముందుకు సాగాయి. తమ తమ భాషా వ్యక్తిత్వాలు నిలుపుకుంటూ నిలుపుకొనుటలో నవ జీవనోద్యమాలు సాగిస్తూ, బ్రిటిషు ప్రభుత్వాన్ని ప్రతిఘటించుటకు కావలసిన ఐక్యతను సాధించుకొను గమన పరిజ్ఞానం ఇంగ్లీషులో పొంది, సమైక్య ఉద్యమాలు సాగించి, స్వాతంత్య్రోద్యమ ఫలితంగా ఎన్నో సంవత్సరాల క్రితం సాధించగలిగారు. కాని 1906లో బెంగాల్‌ను మతప్రాతిపదిక మీద విభజించి, పాలించదలచి, 1912లో విఫలమైన ఇంగ్లీషు రాజనీతి, 1947లో బెంగాల్‌నే కాక, భారతదేశాన్నే మతప్రాతిపదిక మీద చీల్చి, భారత పాకిస్తాన్‌లు చేసి, రెండు దేశాలు నిర్మించి, రెంటికీ ప్రాధాన్యం ఇచ్చామంటూ వైదొలగారు.
భాషా ప్రాతిపదిక మీద యేర్పడిన జాతీయోద్యమమే స్థిర పునాదుల మీద నిలబడగలదని, మతప్రాతిపదిక మీద స్వాతంత్య్రం తాత్కాలికమేనని పాకిస్తాన్‌ ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఋజువు చేసింది. మతావేశంలో ప్రారంభమై, నామరూపాలు కలిగించుకున్న పాకిస్తాన్‌ 1969కల్లా మతం కన్నా భాష ప్రాధాన్యమని ముజిబుర్‌ రహమాన్‌ నాయకత్వాన ప్రారంభమైన బెంగాల్‌ ఉద్యమం సర్వస్వతంత్ర సమాన ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్‌ యేర్పడి, బెంగాలీ భాషను రాజభాషగా, బోధనాభాషగా నిర్ణయించుకుంది.

భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఇన్ని సంవత్సరాలైనా, దేశానికి స్వతంత్ర భాషావిధానం యేర్పడకపోవడం, స్వాతంత్య్రానంతరం నవోజ్జీవనం సన్నగిలడం కారణం. స్వాతంత్య్రం లభించిన తర్వాత అలవాటు క్రింద అధికారులు ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోవడం, స్వాతంత్య్ర ప్రకటననాడే దేశభాషను ప్రకటించని బలహీనత ఇంగ్లీషు ప్రాబల్యానికేగాక, ఇంగ్లీషు మీదనే అధిక మోజు ఏర్పడి, స్వాతంత్య్రానంతరం ఏర్పడిన రెండు మూడు తరాల జనానికీ కూడ అలవాటు క్రింద ఇంగ్లీషు వాడుకలో పడిన అలవాటులో మాతృభాషపై అభిమానం సన్నగిల్లసాగింది.

ఆంధ్రోద్యమం సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు బలిదాన ఫలితంగా కర్నూలు రాజధానిగా, ఆంధ్రరాష్ర్టం 1953 అక్టోబరు 1వ తేదీన ఏర్పడింది. నిజంగా ఆంధ్రరాష్ర్టం యేర్పడిన వెంటనే,ఆంధ్ర శాసనసభ తన అధికార భాష తెలుగు అని ప్రకటించి ఉండవలసింది. అంత త్వరలో, అతి సాహసంతో, ప్రభుత్వం ఏర్పడగానే తమ అధికార భాష బెంగాలీ అని ప్రకటించిన కీర్తి బంగ్లాదేశ్‌కే చెందుతుంది. అయినా ఈ వ్యాసరచయిత ప్రతిపాదించిన “రాజ్యాంగ నిబంధనలను” అసంగతంగా లేనంతవరకు, ప్రభుత్వ వ్యవహారాలను తెలుగులోనే నిర్వహించాలనే తీర్మానం శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి “సాధ్యమైనంత త్వరలో” అనే సవరణతో 1955 సెప్టెంబరు 29 తేదీన ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. ఈ వ్యాసరచయిత ప్రతిపాదించిన బిల్లు మాత్రం త్రోసివేయబడింది.

1946 ప్రాంతంలో ఏర్పడిన మద్రాసు కాంగ్రెస్‌ మంత్రివర్గం ఆంధ్ర జిల్లాలలో తూర్పు గోదావరి జిల్లాలో, తమిళనాడులో తంజావూరు జిల్లాలో విద్యాబోధన జిల్లాస్థాయివరకు మాతృభాషలోనే నిర్వహించవలెనని ఆదేశించింది. అమలు జరపటానికి ప్రయత్నించింది. కాని తీవ్ర ప్రయత్నం మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అందుకే ఈ తీర్మానం.
“సాధ్యమైనంత త్వరలో” అని ఉండడంతో, నత్త నడకతో ప్రారంభం అయింది. ఒక ఉన్నతాధికారిని వేశారు. ఇంతలో విశాలాంధ్రను సాధించడం జరిగింది. నైజాం నిరంకుశ పాలన క్రింద ఉర్దూ భాష రుద్దబడిన ఆంధ్ర ప్రజానీకం నైజాం ఆంధ్రమహాసభ ఆధ్వర్యాన శ్రీ మాడపాటి హనుమంతరావు నాయకత్వాన ఆంధ్ర భాషాభివృద్ధికి, ఆంధ్ర ప్రజల సముజ్జీవనానికీ, ఆంధ్రోద్యమం నడచి, తెలుగు భాషాభివృద్ధికీ సంస్కృతి పరిరక్షణకు మహదుద్యమాలు నడచినవి. నైజాం నిరంకుశత్వమే కాకుండా, ప్రభుత్వాన్నే తొలగించుకోగలిగారు. అందరూ తెలుగువారు ఒకటిగా అనేక శతాబ్దాల అనంతరం చేరగలిగారు. ఆంధ్రమాత కౌగలిలో అనుంగు బిడ్డలుగా ఆశ్రయం పొందగలిగామని మహదానందపడ్డారు.

విశాలాంధ్ర ఏర్పడగానే ప్రథమ కర్తవ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగును అన్ని స్థాయిలలో అధికారభాషగా చేసి ఉండినట్లయితే విశాలాంధ్ర సాధించినందుకు నిజమైన సార్థకత ఉండేది. అది కాకుండా మద్రాసురాష్ట్రం నుండి విడివడిన మన నాయకత్వం ఇంగ్లీషును వదలలేక, నైజాం పాలననుండి బయటపడ్డ నాయకత్వం ఉర్దూ నుండి బయటపడలేక తెలుగును అధికారభాషగా అమలు జరుపుటకు సాహసంతో నిర్ణయించుకోలేకపోవడంతో, అటు యిటు అధికారులు ఇంగ్లీషు అధికారభాషగా అమలు జరుపుటతో తమ శక్తిసామర్య్థాల్ని వినియోగించి రెండు వర్గాలలోను ఇంగ్లీషును అలవాటు చేశారు. విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడిందనే సంతోషంతో సంతృప్తి చెంది, అంతకుముందు ఈ రెండు ప్రాంతాలలోను నడచిన ఆంధ్రోద్యమాలు, ఆంధ్ర పునరుజ్జీవనోద్యమాలు మరుగునపడినవి. ఇటు బయట సాంస్కృతిక ఉద్యమం సజీవంగా నడవని సమయంలో, అటు అధికారులు, రాజకీయ నాయకత్వం తెలుగుపై పట్టుదల వహించక, ఇంగ్లీషునే ప్రోత్సహించడం, ఇంగ్లీషు లేకపోతే బ్రతకలేమనే మనోదౌర్బల్యంతో పనిసాగిపోతే, అధికారుల చేయి పైచేయి అయి అంతా ఇంగ్లీషులోనే సాగింది. అటు బ్రిటిషు పాలననుండి బయటపడిన ఆంధ్రులుగాని, తామాశించిన తెలుగు భాషలో పరిపాలన, బోధన జరిగి, తమ మాతృస్థానం అనుకోగలిగిన సాంస్కృతిక వారసత్వం భాషాభిమానం ఎప్పుడూ అమలు జరగలేదే. ఇక మిగిలింది ఉద్యోగాలు, అధికారాలు, స్వార్థలాభాలు, వీటితో ఆంధ్రుల సమైక్యతకు ప్రధానమైన శక్తి వమ్ము అయింది. ఇతర ఆలోచనలు సాగినవి. అధికారంలోని అధికారులలో వచ్చిన వివాదాలు, స్వార్థాలు, ఆంధ్రప్రదేశ్‌ విచ్ఛిన్నతకు దారితీసినవి. అదృష్టవశాత్తు విచ్ఛిత్తికి దారితీసినవే కాని విచ్ఛిత్తి కాకపోవడం ఆంధ్రుల అదృష్టం.

……….. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (1908-2003)
పేరుమోసిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, నిస్వార్థ సంఘసేవకుడు, సుదీర్ఘమైన తన జీవితాన్నంతటినీ సార్వజనిక ప్రయోజనాలకై వెచ్చించిన గాంధేయవాది. కళాప్రపూర్ణ, పద్మభూషణ తదితర బిరుదులతో ఆయనను సత్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఆయన ఆదర్శాలతో మాత్రం పనిలేనట్టే కనబడింది. ఆయన భుజానికెత్తుకున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాల్లో తెలుగు భాషకు సేవ చెయ్యడం ఒకటి మాత్రమే. తెలుగును అధికారభాషగా చెయ్యాలని ఆయన ఎంతగా ప్రయత్నించాడో ఈ వ్యాసాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతకాలంలో తెలుగు భాష గురించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాసానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది.

No comments:

Post a Comment