Wednesday, April 23, 2008

తెలంగాణ విద్యార్థి సంఘం


హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మంగళవారం.. సమయం ఉదయం 11.30. శాసనసభ ఆవరణలో ఒక్కసారిగా కలకలం. పోలీసులు, మీడియా అందరూ కలకలం వినిపిస్తున్నవైపు పరుగులు. ఒకపక్క అసెంబ్లీ సందర్శకులు, మరోవైపు పాత్రికేయులు, ఇంకోవైపు పోలీసులు.. ఏం జరుగుతోందో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి నినాదాలు చేసినప్పుడు తొలుత నెలకొన్న పరిస్థితి ఇది.



విద్యార్థి సంఘం నేతలు రాజారాం యాదవ్‌, అనిల్‌ తదితరుల నేతృత్వంలో కొందరు తెలంగాణ విద్యార్థులు శాసనసభ ఆవరణలో ప్రవేశించారు. ఒక్కొక్కరుగా ప్రవేశించిన వారు.. క్రమంగా ఒక్కచోట గుమిగూడారు. తమవెంట తెచ్చిన ప్లకార్డులను పైకి తీశారు. తెలంగాణకు అనుకూలంగా శాసనసభ తీర్మానం చేయాలని, మహారాష్ట్రలోలా తెలంగాణ రాజ్‌ థాకరేలు కావాలని, వైఎస్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. కాసేపటికి తేరుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. విద్యార్థులను బయటకు నెట్టేసి.. అనంతరం వారిపై లాఠీఛార్జి చేశారు. తర్వాత 11మందిని అరెస్టుచేసి తొలుత అబిడ్స్‌ పోలీసుస్టేషన్‌కు, అక్కడినుంచి బొల్లారంకు తరలించారు. కేసుపెట్టి వదిలేశారు.



విద్యార్థులు శాసనసభ ఆవరణలోకి ఎలా ప్రవేశించారు.. భద్రత సిబ్బంది కళ్లుగప్పి ప్లకార్డులను ఎలా తీసుకెళ్లగలిగారన్నది అంతుపట్టకుండాఉంది. అసెంబ్లీ ఆవరణలోకి మూడు, నాలుగు అంచెల భద్రతా వలయాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్‌ఫోను ఉంటేనే.. ఆపేసి మళ్లీ ఆన్‌ చేయమని అడుగుతారు. అలాంటిది ప్లకార్డులు ఎలా లోపలికి తీసుకెళ్లారో పోలీసులకూ అర్థంకావడం లేదు. మరోవైపు.. తమ సహచరుల అరెస్టు గురించి తెలుసుకున్న ఉస్మానియా విద్యార్థులు తార్నాక ఫ్త్లెఓవర్‌ వద్ద రాస్తారోకోకు దిగారు.

(19 ఫిబ్రవరి 2008

No comments:

Post a Comment